Telugu News  /  Entertainment  /  Why Tollywood Old Hits Re Release In Theaters What About Business
పవన్ కల్యాణ్ జల్సా రీ రిలీజ్
పవన్ కల్యాణ్ జల్సా రీ రిలీజ్

Tollywood Re-Release : సినిమా రీ రిలీజ్‌ ఎందుకు? బిజినెస్ ఎలా ఉంటుంది?

19 December 2022, 14:20 ISTAnand Sai
19 December 2022, 14:20 IST

Tollywood Old Hits Re Release : ఈ మధ్య ఓ ట్రెండ్ నడుస్తోంది. గతంలో హిట్ అయిన బ్లాక్ బస్టర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ సైతం ఎగబడి చూస్తున్నారు. ఇలా రీ రిలీజ్ చేసిన మూవీలతో బిజినెస్ జరుగుతుందా?

ఇప్పుడు రీ రిలీజ్(Re Release) షోల దగ్గర ఫ్యాన్స్ సందడి మామూలు ఉండట్లేదు. టాలీవుడ్ హిట్(Tollywood Hits) చిత్రాలను రీ రిలీజ్ చేస్తే.. అభిమానులు ఎంత దూరం నుంచైనా వచ్చి చూస్తున్నారు. నిజానికి కొత్త సినిమా కంటే.. మళ్లీ విడుదల చేసిన పాత సినిమాల దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు. డైలాగ్స్ వర్డ్ టూ వర్డ్ చెబుతూ.. తమ అభిమాన హీరోపై ప్రేమను చూపిస్తున్నారు. ఇక సోషల్ మీడియా(Social Media)లో అయితే.. ఈ రీ రిలీజ్ లకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ హిట్ చిత్రాలైన ప‌వ‌న్ క‌ల్యాణ్(Pawan Kalyan) ఖుషి, మ‌హేష్‌బాబు ఒక్కడు కూడా రీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పటివరకు ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనను దృష్టిలో ఉంచుకుని, టాలీవుడ్(Tollywood) నిర్మాణ సంస్థలు గతంలో విడుదలైన సినిమాలను డిజిటలైజ్ చేస్తున్నాయి. పాత సినిమాల ప్రింట్‌లను రీస్టోర్ చేస్తున్నాయి. కోవిడ్(Covid) తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు తెరుచుకున్నప్పటికీ థియేటర్ల యజమానుల్లో భయం ఉంది. అంతకుముందు థియేటర్ బయట ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తూ.. హౌస్ ఫుల్ బోర్డులు కనిపించేవి. ప్రేక్షకులు తమ అభిమాన నటీనటులను వెండితెరపై చూస్తూ.. ఎంజాయ్ చేసేవారు. కానీ తర్వాత పరిస్థితి మారింది.. థియేటర్లు పూర్వవైభవాన్ని పొందగలవా అని అనుకునేలా అయింది.

ఇలాంటి సమయంలో టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. గతంలో రిలీజైన సినిమాలు, సాధారణంగా బ్లాక్ బస్టర్స్ అయినవి, అత్యాధునిక సాంకేతికతతో టచ్ అప్ చేసి.. పరిమిత సంఖ్యలో షోలకే మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రేక్షకుల నుండి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌ను బట్టి, ఈ ట్రెండ్ ఇలానే కొనసాగేలా ఉంది. థియేటర్ల వద్ద ఫ్యాన్స్(Fans) సందడి కనిపిస్తోంది. టిక్కెట్లు సాధారణంగా ఆఫ్‌లైన్ టిక్కెట్‌లకు బదులుగా ఆన్‌లైన్ బుకింగ్(Online Booking) ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అందుబాటులో ఉంటున్నాయి.

16 సంవత్సరాల క్రితం విడుదలైన మహేష్ బాబు(Mahesh babu) నటించిన పోకిరి చిత్రాన్ని యుఎస్‌లో 4కే టెక్నాలజీలో(4K Technology) రీమాస్టర్ చేసి రీ-రిలీజ్ చేయడంతో ఈ ట్రెండ్ ప్రారంభమైంది. ప్రీ-బుకింగ్స్ తెరిచినప్పుడు, స్పందన చూసి మేకర్స్ ఆశ్చర్యపోయారు. టిక్కెట్లు గంటల్లోనే అమ్ముడయ్యాయి. ఆ తర్వాత భారత్‌లోనూ అదే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న మళ్లీ విడుదల చేశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్, ఇలియానా నటించిన జల్సా (2008) నిర్మాతలు ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు.

బాలకృష్ణ, టబు, శ్రియ శరణ్ నటించిన చెన్నకేశవ రెడ్డి కూడా మళ్లీ వచ్చింది. ఇది సెప్టెంబర్ 24న 4k లో తిరిగి విడుదలైంది. ఆ తర్వాత డార్లింగ్ ప్రభాస్(Prabhas) పుట్టిన రోజు సందర్భంగా బిల్లా(Billa) సినిమాను రీ రిలీజ్ చేశారు. దీనికి రెస్పాన్స్ భారీగా వచ్చింది. ఇలానే రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది.

ఈ ట్రెండ్.. చాలా తక్కువ పెట్టుబడితో థియేటర్లకు ఆదాయ వనరుగా మారాయి. ఒక సినిమాను రీమాస్టర్ చేయడానికి అయ్యే ఖర్చు దాదాపు రూ.5 నుంచి 8 లక్షలుగా ఉంది. కొన్ని సినిమాలకు కాస్తంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా జోడిస్తున్నారు. దీంతో ఖర్చు 10 లక్షలపైనే అవుతుంది. రిటర్న్‌లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. రీ-రిలీజ్ అయిన సినిమాలు కోట్లను వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు పోకిరి(Pokiri) 320 షోల నుండి ఒక్క రోజులో దాదాపు 1.75 కోట్లు వసూలు చేయగా, జల్సా రెండు రోజుల్లో 500ప్లస్ షోల నుండి దాదాపు 3.25 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ రెండు సినిమాల నుంచి వచ్చిన కలెక్షన్స్ లో ఛారిటీకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ లెక్కన రీ రిలీజ్ చేసిన సినిమాలతో బిజినెస్ బాగానే జరుగుతుందన్నమాట.

ఇంకా ఎన్నో రీ-రిలీజ్‌లు లైన్‌లో ఉండటంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ బిజినెస్ జోరుగా సాగుతోంది. ప్రొడక్షన్ హౌస్‌లు గతంలో విడుదలైన సినిమాలను డిజిటలైజ్ చేస్తున్నాయి. ప్రింట్‌లు అరిగిపోయిన పాత సినిమాలను బయటకు తీస్తున్నారు. ప్రసాద్ ల్యాబ్స్‌ వీడియో పోస్ట్-ప్రొడక్షన్‌లో పని చేస్తుంది. డిజిటలైజేషన్, రిస్టోరేషన్, VFXతో సహా సరికొత్త సాంకేతికతను ఉపయోగించి ఎండ్-టు-ఎండ్ సేవలను అందిస్తుంది.

ఇలా పాత సినిమాలను రీ రిలీజ్ చేయడమనేది.. టైమ్ ట్రావెల్ లాంటిది అనుకోవచ్చు. ప్రస్తుత తరం వారు థియేటర్లలో ఒకప్పటి క్లాసిక్ సినిమాలను ఎక్స్ పిరియన్స్ చేయోచ్చు. తమ అభిమాన హీరోల సినిమాల విడుదలలో చాలా కాలం గ్యాప్ ఉండటం కూడా ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించేందుకు ఈ రీ రిలీజ్లు ఉపయోగపడుతున్నాయి. కాలం మారింది, టెక్నాలజీ కూడా పెరిగింది. డిజిటల్ ఫిల్మ్ ప్రొడక్షన్ 2010 వరకు పుంజుకోలేదు. అంతకు ముందు కొన్ని డిజిటల్ ఫిల్మ్‌లు మాత్రమే ఉన్నాయి. సినిమాలు రీల్స్,నెగటివ్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడే అసలు పని.. ఎందుకంటే ప్రస్తుత సినిమా థియేటర్లు డిజిటల్ ఫార్మాట్‌కు సరిపోయేలా అప్‌గ్రేడ్ అయ్యాయి. దీంతో నిర్మాణ సంస్థలు సినిమాను రీ మాస్టర్ చేసి.. థియోటర్లలో వదులుతున్నాయి. పిక్చర్ క్వాలిటీ సైతం అదిరిపోయేలా ఉంటుంది.