Family Star OTT Platform: ఫ్యామిలీ స్టార్ ఓటీటీలో ఛేంజ్ - ముందుగా అనుకున్న ప్లాట్‌ఫామ్ కాదు!
Family Star OTT Platform: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అఫీషియల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్సయింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
Family Star OTT Platform: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఈ శుక్రవారం (ఏప్రిల్ 5న ) ప్రేక్షకుల ముందుకొచ్చింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. దిల్‌రాజు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.
అమెజాన్‌లో స్ట్రీమింగ్...
ఫ్యామిలీ స్టార్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు ఇన్నాళ్లుగా ప్రచారం జరిగింది. పదహారు కోట్లకు విజయ్ దేవరకొండ మూవీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో పుకార్లు షికారు చేశాయి. అయితే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కావడం లేదు.
ఫ్యామిలీ స్టార్ అఫీషియల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్సయింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. నాలుగు నుంచి ఆరు వారాల గ్యాప్ తర్వాతే ఫ్యామిలీ స్టార్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియలో రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మే రెండో వారం లేదా మూడో వారంలో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ఆరేళ్ల తర్వాత...
గీతగోవిందం సక్సెస్ తర్వాత దాదాపు ఆరేళ్ల విరామం అనంతరం విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ఇది. ఈ సినిమా ఓవర్‌సీస్ ప్రీమియర్స్‌కు నెగెటివ్ టాక్ వస్తోంది. అవుట్‌డేటెడ్, రొటీన్ స్టోరీతో వచ్చిన టెంప్లేట్ మూవీ ఇదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాలో డైరెక్టర్ చూపించిన మిడిల్ క్లాస్ కష్టాలు కన్వీన్సింగ్‌గా లేవని, సెంటిమెంట్‌తో పాటు విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ కూడా సరిగ్గా వర్కవుట్ కాలేదని ఆడియెన్స్ ట్వీట్లు చేస్తున్నారు.ఫ్యామిలీ స్టార్‌తో విజయ్ దేవరకొండ ఖాతాలో మరో ఫ్లాప్ పడిందని అంటున్నారు.
ప్రీ రిలీజ్ బిజినెస్...
విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోకు ఉన్న క్రేజ్‌తో పాటు ఫ్యామిలీ కథల పట్ల దిల్‌రాజుకు ఉన్న జడ్జిమెంట్ కారణంగా ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 43 కోట్లకు అమ్ముడుపోయాయి. 44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజైంది. అయితే నెగెటివ్ టాక్ కారణంగా ఈ మూవీ బ్రేక్ అవుతుందా లేదా అన్నది డౌట్‌గా మారింది.
లైగర్ కంటే తక్కువే...
విజయ్ దేవరకొండ గత సినిమాలతో పోలిస్తే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మోస్తారుగానే జరిగాయి. లైగర్ మూదవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఐదు కోట్లు దాటగా...ఫ్యామిలీ స్టార్‌కు మాత్రం మూడు కోట్ల లోపే అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి. నెగెటివ్ టాక్‌తో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ మూవీ తొలిరోజు పది కోట్లకుపైనే కలెక్షన్స్ రాబట్టనున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
జెర్సీ డైరెక్టర్‌తో...
ఫ్యామిలీ స్టార్ తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ ఓ మూవీ చేయబోతున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.