NTR | తారక్ ఫోన్‌లో ఎక్కువగా ప్లే అయ్యే పాట ఏంటో తెలుసా? రాక్ సాంగ్ మాత్రం కాదు
ఇటీవల కాలంలో తన ఫోన్‌లో ఎక్కువ విన్న పాట గురించి ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సమీపిస్తున్న కొద్ది ఆ చిత్రబృందం కూడా వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీగా గడుపుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి ముగ్గురు దేశ మొత్తం పర్యటిస్తూ తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. తాజాగా మలయాళీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ ముగ్గురు. ఇందులో పలు ఆసక్తికర విషయాలను పాలుపంచుకున్నారు. ఇందులో భాగంగా యాంకర్ నిర్వహించిన ర్యాపిడ్ ఫైర్ రౌండులో మీ ఫోన్‌లో ఎక్కువగా ప్లే అయ్యే పాట ఏంటి అని ఎన్టీఆర్‌ను అడగ్గా ఆయన కేరాఫ్ కంచరపాలెం సినిమాలో పాట అని చెప్పేశారు.
మీ ఫోన్‌లో ఎక్కువగా ప్లే అయ్యే పాట?
తారక్: ఆశాపాశం.. కేరాఫ్ కంచరపాలెం
ఏ సినిమాకు సీక్వెల్ ఉంటే బాగుంటుందని అని అనుకుంటున్నారు?
తారక్: అదుర్స్
మీరు ఓ ఐలాండ్‌లో చిక్కుకుపోయారు. ఇండస్ట్రీలో ఉన్న ముగ్గురు వ్యక్తులను ఎంచుకుని వారినీ మీతో పాటు అక్కడ ఉంచాలనుకుంటే.. ఎవరిని ఉంచుతారు?
తారక్: చరణ్, రానా, అనిరుధ్
ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తారు?
తారక్: ప్రణతీ(ఎన్టీఆర్ భార్య)
కేరాఫ్ కంచరపాలెం సినిమాలోని ఆశాపాశం పాట అంటే తనకు ఎంతో ఇష్టమని తారక్ చెప్పారు. అంతేకాకుండా ఈ పాటను కొన్ని లైన్లు పాడి వినిపించారు కూడా. 2018లో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం సినిమాలోని ఈ పాట చిత్రం పతాక స్థాయిలో ఉన్నప్పుడు వస్తుంది. విశ్వ రాసిన ఈ సాంగ్‌ను అనురాగ్ కులకర్ణి ఎంతో అద్భుతంగా ఆలపించారు.
ఎన్టీఆర్ ఆశాపాశ పాటను ఎక్కువగా వింటానని చెప్పడంపై కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేశ్ మహా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆశాపాశం పాటను ఎక్కువగా వింటారని చెప్పడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. తారక్ గారూ మీకు ధన్యవాదాలు. ఆర్ఆర్ఆర్ గొప్ప సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని వెంకటేశ్ మహా ట్వీట్ చేశారు.
ఈ ఇంటర్వ్యూలో రామ్‌చరణ్ కూడా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ నిర్వహించారు. అభిమాని చేసిన పనికి మీరు ఇబ్బంది పడిన సంఘటన ఏదైనా ఉందా అని యాంకర్ ప్రశ్నించగా.. ఆ సంఘటన గురించి వివరించారు.
"ఇటీవల ఓ అభిమాని చేసిన పనితో ఎంతో ఇబ్బంది పడ్డాను. గత కొన్ని రోజులుగా శంకర్ సినిమా కోసం రాజమండ్రిలో షూట్ చేస్తున్నాం. ఓ వ్యక్తి నన్ను కలవడం కోసం రోజూ షూటింగ్ స్పాట్‌కు వచ్చి అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడు. అతన్ని గమనించిన నా సిబ్బంది.. నాకు సమాచారమిచ్చారు. మేకప్‌తో ఉన్న సమయంలో బయటకు వెళ్లొద్దని శంకర్ చెప్పడంతో అతణ్ని కలవడం కుదరలేదు. సరిగ్గా పదో రోజు అతడు గుండెలపో ఓ పెద్ద టాటూ వేయించుకుని వచ్చాడు. ఆ విషయం తెలిసిన వెంటనే అతన్ని కలిసి పచ్చబొట్టు ఎప్పుడు వేయించావు.. అని అడిగాను.. మిమ్మల్ని కలవడం కోసం నిన్ననే వేయించాను అని చెప్పాడు. ఆ మాట విన్నగా ఎంతో బాధగా, భయంగా అనిపించింది. నటీనటుల పేర్లను టాటూ వేయించుకోవడం సర్వసాధారణం.. కానీ నన్ను కలవడం కోసమే టాటూ వేసుకోవడం చూసి కాస్త భయం వేసింది." అని రామ్‌చరణ్ స్పష్టం చేశారు.
సంబంధిత కథనం
టాపిక్