Ante sundaraniki movie review: నాని అంటే సుందరానికి మూవీ రివ్యూ..
Ante sundaraniki review: అంటే సుందరానికి మూవీ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం. నేడు తెలుగుతో పాటు తమిళ, మలయాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే...
Ante sundaraniki review: హీరోయిజం, మాస్ హంగులకు దూరంగా రియలిస్టిక్ కథాంశాలను ఎంచుకుంటూ సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు నాని. తాను ఎంచుకునే ప్రతి సినిమాలో వినోదంతో పాటు ఎమోషన్స్ సమపాళ్లలో ఉండేలా జాగ్రత్తపడుతుంటాడు. కెరీర్ ఆరంభం నుంచి ఆ శైలిలోనే అడుగులు వేస్తున్నాడు నాని. మరోసారి ఆ పంథాలో అతడు చేసిన చిత్రం అంటే సుందరానికి.
మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లతో కమర్షియల్ సక్సెస్‌లను అందుకున్న వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మలయాళ నటి నజ్రియా నజీమ్ ఈ చిత్రంతోనే టాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ప్రచార చిత్రాల్లో నాని, నజ్రియా నజీమ్ కెమిస్ట్రీతో పాటు వారిద్దరూ భిన్న మతాలకు చెందిన వారిగా చూపించడం ఆసక్తిని పంచింది. శుక్రవారం నాడు తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
సుందర్‌ప్రసాద్ (నాని) బ్రాహ్మణ యువకుడు. సంప్రదాయాలు, ఆచారాలకు విలువనిచ్చే కుటుంబం అతడిది. లీలా థాంసన్(నజ్రియా నజీమ్) క్రిస్టియన్ అమ్మాయి. స్కూల్ డేస్‌లోనే సుందర్, లీలా మధ్య పరిచయం ఏర్పడుతుంది. వయసుతో పాటే వారి అనుబంధం బలపడుతూ ప్రేమగా మారుతుంది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు.
భిన్న మతాల కారణంగా ఇరు కుటుంబసభ్యులు వీరి పెళ్లిని వ్యతిరేకిస్తారు. ఈ అడ్డంకులను దాటుకొని ఈ జంట ఎలా ఏకమైంది. పెళ్లి కోసం వారు ఆడిన అబద్దం ఏమిటి? మతం కంటే మంచితనం, మానవత్వమే ముఖ్యమని వారు ఎలా నిరూపించారన్నది ఈ చిత్ర ఇతివృత్తం.
Ante sundaraniki: సింపుల్ లవ్ స్టోరీ
సింపుల్ లవ్‌స్టోరీతో తెరకెక్కిన ఫన్ ఎంటర్‌టైనర్ ఇది. ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకొని దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ కథను రాసుకున్నారు. ఎమోషన్స్, డ్రామా కంటే కామెడీపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అందుకు తగినట్లుగానే సినిమా ప్రారంభం నుంచి ప్రీక్లైమాక్స్ వరకు నవ్విస్తూనే సాగుతుంది.
Ante sundaraniki: నాని పాయింట్ ఆఫ్ వ్యూ
హిందూ, క్రిస్టియన్ మధ్య వైరుధ్యాల అన్నది చాలా సంక్లిష్టమైన పాయింట్. ఈ పాయింట్‌ను కథను ముందుకు నడిపించడానికి ఇరుసుగా వాడుకున్నాడు తప్పితే డీప్‌గా డిస్కస్ చేయలేదు.
నాని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథనం సాగుతుంది. తన ఆఫీస్ కొలిగ్ కు (అతిథిగా నటించిన హీరోయిన్ ఎవరన్నది వెండితెరపై చూడాల్సిందే) కథ చెబుతున్నట్లుగా చూపిస్తూ సినిమాను మొదలుపెట్టారు దర్శకుడు. కుటుంబ ఆచారాల కారణంగా నాయకానాయికలు ఎదుర్కొనే సమస్యలతో ప్రథమార్థం నవ్విస్తుంది. వారి చిన్ననాటి ఎపిసోడ్స్‌ను ఆకట్టుకుంటాయి.
పెళ్లి చేసుకోవడానికి వారు ఆడే అబద్దాలతో విరామంలో ట్విస్ట్ ఇచ్చారు. ఆ అబద్దాల కారణంగా వారి జీవితం ఏ మలుపులు తిరిగిందో సెకండ్ హాఫ్‌లో చూపించారు. అబద్దాల్ని దాచడం కోసం వారు పడే కష్టాలు నవ్విస్తాయి. పతాక ఘట్టాల్లో సినిమా ఎమోషనల్‌గా టర్న్ తీసుకుంటుంది. మతం కంటే మంచితనమే ముఖ్యమంటూ చిన్న సందేశంతో సినిమాను ముగించారు. సుందర్ ప్రసాద్ ఆడిన అబద్దం నిజమంటూ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆసక్తిని పంచుతుంది.
కెమిస్ట్రీ ప్లస్ పాయింట్
నాని, నజ్రియా కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సహజ నటనతో ఇద్దరు ఆకట్టుకున్నారు. నాని ఆద్యంతం ఈ సినిమాలో పక్కింటి కుర్రాడిగా కనిపించారు. నజ్రియా కు తెలుగులో చక్కటి ఎంట్రీగా ఈ సినిమా ఉపయోగపడింది. నరేష్, రోహిణి, నదియా, అళగమ్ పెరుమాల్ తమ అనుభవంతో పాత్రల్లో ఒదిగిపోయారు. రాహుల్ రామకృష్ణ కామెడీ ట్రాక్ తో పాటు హర్షవర్ధన్ నాని మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులను పంచాయి.
నిడివి అడ్డంకి
ఈ సినిమాకు నిడివి పెద్ద అడ్డంకిగా మారింది. దాదాపు రెండు గంటల యాభై ఆరు నిమిషాల నిడివి ఉంది. దాంతో చాలా చోట్ల సాగదీసిన అనుభూతి కలుగుతుంది. దర్శకుడిగా, రచయితగా వివేక్ ఆత్రేయ వైవిధ్యతను చాటుకున్నాడు. కామెడీ తన బలం అని ఈ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు. వివేక్ సాగర్ సంగీతం ప్రధాన బలంగా నిలిచింది.
పర్‌ఫెక్ట్ టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్ ఇది. ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
రేటింగ్- 3.25/ 5
సంబంధిత కథనం
టాపిక్