Praveen Kumar Sobti| 'మహాభారతం'లో భీముడు చనిపోయాడు..!
మహాభారతం ఫేమ్ ప్రవీణ్ కుమార్ సోబ్తి కన్నుమూశారు. 74 ఏళ్ల వయస్సులో చనిపోయారు. 1988లో బీఆర్ చోప్రా తెరకెక్కించిన మహాభారత సీరియల్‌లో భీముడి పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రముఖ నటుడు, క్రీడాకారుడు అయిన ప్రవీణ్ కుమార్ సోబ్తి మరణించారు. పంజాబ్‌కు చెందిన ఈయన 74 ఏళ్ల వయస్సులో దిల్లీలో కన్నుమూశారు. ఈయన 1988లో బీఆర్ చోప్రా తెరకెక్కించిన మహాభారత సీరియల్‌లో భీముడి పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. ఎక్కువగా రౌడీ, అంగరక్షకుడి పాత్రలో కనిపించారు. 6.6 అడుగుల ఎత్తు, భారీ కాయంతో ప్రతినాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
పంజాబ్‌లో జన్మించిన ప్రవీణ్ కుమార్ సినిమాల్లోకి రాకముందు క్రీడాకారుడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించారు. హ్యమర్, డిస్కస్ త్రోలో అంతర్జాతీయ పతకాలను సాధించారు. ఆసియా క్రీడల్లో నాలుగు పతకాలు గెలిచారు. ఇందులో 2 స్వర్ణం, ఓ రజతం, ఓ కాంస్యం ఉన్నాయి. అంతేకాకుండా రెండు సార్లు ఒలింపిక్స్‌లో(1968 మెక్సికో గేమ్స్, 1972 మ్యూనిచ్) దేశానికి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా 1966 కింగ్‌స్టన్ కామన్వెల్త్ గేమ్స్‌లో హ్యామర్ త్రోలో రజతాన్ని సాధించారు. క్రీడల్లో ఈయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. అంతేకాకుండా ప్రవీణ్‌కు బోర్డర్ సెక్యూరిటీలో డిప్యూటీ కమాండెంట్ ఉద్యోగం కూడా ఇచ్చింది.
ట్రాక్ అండ్ ఫీల్డ్స్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ 70వ దశకంలో చిత్రసీమలో అడుగు పెట్టారు. అప్పటి నుంచి పలు హిందీ సినిమాల్లో నటించిన ఆయన 1988లో వచ్చిన మహాభారతం సీరియల్‌లో భీముడి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కరిష్మా కుద్రత్ కా, యుధ్, జబర్దస్త్, సింఘాసన్, ఖుద్గర్జ్, లోహా, మొహబ్బత్, కే దుష్మన్, ఇలాకా లాంటి సినిమాలు ఉన్నాయి.
2013లో ప్రవీణ్ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున దిల్లీలోని వజీర్‌పుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఓటమి తర్వాత భాజపాలో చేరారు. 2021లో పంజాబ్ ప్రభుత్వం నుంచి తనకు పింఛన్ అందడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సంబంధిత కథనం