pravin tambe | 41 ఏళ్లలో ఐపీఎల్‌లో అరంగేట్రం... ‘కౌన్ ప్రవీణ్ తాంబే?’ ట్రైలర్ రిలీజ్
41 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ముంబై క్రికెటర్ ప్రవీణ్ తాంబే జీవితం వెండితెరపై రాబోతున్నది. ‘కౌన్ ప్రవీణ్ తాంబే’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి జయప్రద్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు
క్రికెట్‌లో నలభై ఏళ్లు దాటితే ఆటకు రిటైర్‌మెంట్ ప్రకటించి కామెంటేటర్‌గానో, కోచ్‌గానో సెటిల్ అవుతారు.కానీ నలభై ఏళ్లలో కొత్తగా కెరీర్ మొదలుపెట్టడం అంటే అసాధ్యం అనే చెప్పాలి. ముంబై క్రికెటర్ ప్రవీణ్ తాంబే విషయంలో అదే జరిగింది. 41 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో 2013 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రవీణ్ తాంబే అరంగేట్రం చేశారు. 2014 సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ పై హ్యాట్రిక్ సాధించాడు. ఆ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్స్‌లో ఒకరిగా నిలిచాడు. ఆ తర్వాత ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రవీణ్ తాంబే ప్రాతినిథ్యం వహించాడు. అతడి జీవితం ఆధారంగా ‘కౌన్ ప్రవీణ్ తాంబే’ పేరుతో సినిమా తెరకెక్కుతోంది. తెలుగులో ‘ప్రవీణ్ తాంబే ఎవరు’ పేరుతో ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నారు. ఇందులో శ్రేయస్ తల్ఫాడే టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం విడుదలచేశారు. రాహుల్ ద్రావిడ్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది. క్రికెట్, కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోతూ ఇబ్బందులు పడే వ్యక్తిగా ట్రైలర్ లో శ్రేయస్ తల్ఫాడే కనిపించారు. పెళ్లి చూపుల్లో ఏం చేస్తావని అడిగిన ప్రశ్నకు బౌలింగ్, బ్యాటింగ్ కూడా చేస్తాను అని శ్రేయస్ తల్ఫాడే చెప్పడం నవ్వులను పంచుతుంది. 34 ఏళ్లు వచ్చినా కూడా నేషనల్స్‌లో ఆడాలని కలలు కనే వ్యక్తిగా ఎమోషనల్‌గా అతడి క్యారెక్టర్‌ను చూపించారు. అవకాశం ఇస్తానని చాలా ఏళ్లు తప్పించుకొని ఇప్పుడు వయసు అయిపోయిందంటున్నారని అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఏజ్‌ను నేను నమ్మను అనడం ఆకట్టుకుంటోంది. ఫాస్ట్ బౌలర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి ఆ తర్వాత స్పిన్నర్‌గా మారి నలభై ఒక్క ఏళ్ల వయసులో ప్రవీణ్ తాంబే తన కలను ఎలా నెరవేర్చుకున్నాడో ఈ సినిమాలో చూపించబోతున్నారు. ప్రవీణ్ తాంబే పాత్రలో శ్రేయస్ తల్ఫాడే జీవించాడు. జయప్రద్‌దేశాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డిస్నీ హాట్ స్టార్ ద్వారా ఏప్రిల్ 1న ఈ సినిమా విడుదలకానుంది. అంజలి పాటిల్ హీరోయిన్‌గా నటించింది.