Ayushmann Khurrana comments: బాలీవుడ్‌లో విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా. మొదటి నుంచీ అతడు ఎంపిక చేసుకునే కథలు, అతని నటనను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. విక్కీ డోనార్, బదాయిహో, బాలా, ఆర్టికల్ 15, ఈ మధ్యే వచ్చిన డాక్టర్ జీలాంటి భిన్నమైన కథలతో మూవీలు చేసిన ఘనత అతని సొంతం. అయితే అతని సినిమాలు బాగానే అనిపించినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం బోల్తా పడుతూ ఉంటాయి.
ఈ మధ్యే మీడియాతో మాట్లాడిన ఆయుష్మాన్.. తన చివరి మూడు సినిమాలైన చండీగఢ్ కరే ఆషికీ, అనేక్, డాక్టర్ జీలపై స్పందించాడు. ఇతర హీరోలు ముట్టుకోని కథలతోనే తాను సినిమాలు చేయాలని అనుకుంటానని ఈ సందర్భంగా అతడు చెప్పాడు.
"నిషేధంగా భావించే సబ్జెక్టులతోనే నేను సినిమాలు చేయడం ప్రారంభించాను. సమాజంలో అందరూ, పిల్లలతో సహా చూసే సినిమాలు చేయాలనుకుంటాను. నిజానికి నా చివరి మూడు సినిమాలు కమర్షియల్‌గా పెద్దగా ఆడలేదు. అందులో ఒకటి ఎల్జీబీటీక్యూ (లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) మూవీ అయిన చండీగఢ్ కరే ఆషికీ కూడా ఒకటి.
దురదృష్టవశాత్తూ మన దేశం గేలను ఇష్టపడదు. అనేక్ అనే డాక్యుడ్రామా కూడా మరో సినిమా. ఇక డాక్టర్ జీ మూవీకి ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో బాగానే ఆడింది" అని ఆయుష్మాన్ చెప్పాడు.
తన సినిమాలు బాగా ఆడలేకపోవడం ఎప్పుడైనా ఆందోళన కలిగించిందా అని అడిగినప్పుడు అలా ఎప్పుడూ జరగలేదని చెప్పాడు. "నేనెప్పుడూ ఆందోళనకు గురి కాను. నేను రిస్క్‌లు తీసుకోవడం ఆపేస్తే నేను కూడా సాంప్రదాయ హీరోను అవుతాను. నేనెప్పుడూ సాంప్రదాయేతర హీరోగానే ఉంటాను. భవిష్యత్తులోనూ అలాగే ఉంటాను. నాకు జయాపజయాలతో సంబంధం లేదు. హద్దులను చెరిపేస్తూనే ఉంటాను. నా సినిమాలన్నీ చాలా వరకూ లో, మిడిల్ బడ్జెట్ మూవీలే. అందుకే ఎవరూ నష్టపోరు. నేను సులువుగా రిస్క్‌లు తీసుకోగలను" అని ఆయుష్మాన్ చెప్పాడు.
నిజానికి ప్రేక్షకులు ఎప్పుడూ అంతుచిక్కరని, ఇప్పుడు మరింత సవాలుగా మారారని అతడు అనడం విశేషం. మంచి సినిమాలు కాదు.. ఇప్పుడు గొప్ప సినిమాలు చేయాల్సి వస్తోందని అన్నాడు. వాళ్లను ఇళ్ల నుంచి థియేటర్లకు రప్పించే ఎక్సైటింగ్ సబ్జెక్ట్‌లను ఎంపిక చేసుకోవాల్సి వస్తోందని చెప్పాడు.
టాపిక్