samantha birthday special |బ్రేక్ ది రూల్స్-ఎవరైనా సమంతను ఫాలో కావాల్సిందే
గత కొన్నేళ్లుగా సమంత కథాంశాలు, పాత్రల పరంగా ప్రయోగాలకు అధికంగా ప్రాధాన్యమిస్తోంది. నటిగా ప్రతి సినిమాలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు తపనపడుతోంది. మైథలాజికల్, లేడీ ఓరియెంటెడ్ లాంటి భిన్నమైన జోనర్స్ ను ఎంచుకుంటూ నవతరం నాయికలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. సమంత పుట్టినరోజు నేడు. ఆమె కెరీర్ లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఏవంటే...
నేటి స్పీడ్ యుగంలో కథానాయికల కెరీర్ మహా అయితే ఐదేళ్లు కొనసాగడం గగనమవుతోంది. ఒకటి, రెండు పరాజయాలు పలకరించగానే దర్శకనిర్మాతలతో పాటు ప్రేక్షకులు హీరోహీరోయిన్లను పక్కనపెట్టేస్తున్నారు. కానీ నవతరం తారల జోరును తట్టుకొని ఓ కథానాయిక పన్నెండేళ్ల పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగడం మాత్రం అరుదుగానే చెప్పుకోవాలి. ఆ ఘనతను సొంతం చేసుకున్న కథానాయిక మరెవరో కాదు సమంత. దక్షిణాది చిత్రసీమలో విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించాలి. పాత్రల పరంగా ఛాలెంజెస్ ఉండాలి. అప్పుడే నటిగా తనకు సంతృప్తి దొరుకుతుందని సమంత చెబుతుంటుంది. ఆ సిద్ధాంతమే ఆమెను అగ్రకథానాయికగా నిలబెట్టింది.2010 లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది సమంత. తొలి చిత్రంలోనే తన అందచందాలతో యువతరం హృదయాల్ని దోచేసింది. సినిమా పెద్ద హిట్ అయినా స్టార్ హీరోల నుంచి సమంతకు పిలుపురాలేదు. అయినా నిరాశపడకుండా తమిళంలో కొన్ని చిన్న సినిమాలు చేసింది. బృందావనం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. దూకుడు, ఈగ సినిమాలు సమంత కెరీర్ ను మలుపుతిప్పాయి. ఈ రెండు సినిమాలతో సమంత గ్లామర్ తో మాత్రమే కాదు యాక్టింగ్ తోనూ మెప్పించగలదని నిరూపించుకున్నది. బలపడింది. అత్తారింటికి దారేది, మనం, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలతో టాలీవుడ్ లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నది.
అగ్ర హీరోయిన్ హోదా, అంతులేని అభిమానగణం, భారీ పారితోషికం, వరుస అవకాశాలు వస్తోన్న సమయంలో ఎవరైనా రిస్క్ చేయడానికి ఇష్టపడరు. కానీ ర సమంత ప్రయోగాల దారినే ఎంచుకుంది. క్యారెక్టర్స్ పరంగా ఛాలెంజెస్ కోరుకుంది. కెరీర్ ఫుల్ జోష్ లో ఉన్న సమయంలోనే తమిళ చిత్రం 10 ఏండ్రాదుకుల్ల సినిమాలో విలన్ గా నటించింది. థంగమాగన్ అనే సినిమాలో సాధారణ ఢీ గ్లామర్ రోల్ చేసింది.
రంగస్థలం సమంత కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. రామలక్ష్మి అనే పల్లెటూరి యువతిగా సహజ నటనతో మెప్పించింది సమంత. ఈ పాత్ర కోసం తన బాడీ లాంగ్వేజ్, స్టైల్ పూర్తిగా మార్చుకొని నటించింది. నటిగా ఈ సినిమా ఆమెను కొత్త కోణంలో ఆవిష్కరించింది. అలాగే మహానటిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని అతి భయస్తురాలైన జర్నలిస్ట్ గా కనిపించింది. తనకు ఎదురైన అవరోధాల్ని అధిగమిస్తూ అలనాటి మేటి నటి సావిత్రి జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చే పాత్రికేయురాలిగా సమంత అద్వితీయ నటనను కనబరిచింది.
సూపర్ డీలక్స్ లో ప్రయోగాత్మక పాత్రలో నటించింది. సాధారణంగా నంబర్ వన్ పొజిషన్ ఉన్న నాయికలు అలాంటి పాత్రలు చేయడానికి సాహసించరు. కానీ సమంత మాత్రం సవాల్ గా భావించి వయాంబు పాత్రలో ఒదిగిపోయింది. ఓ బేబీలో 70 ఏళ్ల బామ్మగా కనిపించింది.
ఫ్యామిలీమ్యాన్ 2 సిరీస్ తో నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. తమిళ రెబెల్ రాజీగా అసమాన నటనను కనబరిచి విమర్శకుల ప్రశంసలను అందుకొంది.
పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ పాటలో సమంత నటిస్తుందనే వార్తలు వెలువడగానే చాలా మంది విమర్శించారు. సమంత డబ్బుల కోసమే ఈ పాట చేస్తోందని, అవకాశాలు తగ్గడం వల్ల ప్రత్యేక గీతాలను అంగీకరిస్తుందని కామెంట్స్ చేశారు. కానీ సమంత మాత్రం అవేవీ పట్టించుకోలేదు. బోల్డ్ స్టెప్ వేసి హిట్ తోనే విమర్శకులకు సమాధానమిచ్చింది.
ప్రస్తుతం కెరీర్ లో తొలిసారి మైథలాజికల్ కథాంశంతో శాకుంతలం సినిమా చేస్తోంది సమంత. ఇందులో కావ్యనాయకి శకుంతలగా కనిపించబోతున్నది.
మూసధోరణికి భిన్నంగా ప్రతి సినిమాలో నటిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు సమంత ప్రాధాన్యమిస్తుంటుంది. అపజయాలు ఎదురైనా భయపడదు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సమంత ఇదే పంథాను అనుసరిస్తోంది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగుతోంది. తనపై వచ్చే విమర్శలను చూసి కృంగిపోలేదు. వారిపై ప్రతి విమర్శలు చేయలేదు. ఆ విమర్శలను తన విజయ సోఫానాలుగా మలుచుకుంటోంది.
సంబంధిత కథనం
టాపిక్