Ammu Movie Review: అమ్ము మూవీ రివ్యూ - మణిరత్నం హీరోయిన్ సినిమా ఎలా ఉందంటే
Ammu Movie Review: ఐశ్వర్యలక్ష్మి, నవీన్‌చంద్ర, బాబీసింహ ప్రధాన పాత్రల్లో నటించిన అమ్ము సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా నేడు విడుదలైంది. ఈ సినిమాకు చారుకేష్ శేఖర్ దర్శకత్వం వహించాడు.
Ammu Movie Review: అమ్ము మూవీ రివ్యూ
సినిమా- అమ్ము
నటీనటులు- ఐశ్వర్యలక్ష్మి, నవీన్‌చంద్ర, బాబీసింహ, రఘుబాబు, రాజారవీంద్ర
డైరెక్టర్ - చారుకేష్ శేఖర్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ - కార్తిక్ సుబ్బరాజు
నిర్మాతలు -కళ్యాణ్ సుబ్రమణియన్, కార్తికేయన్ సంతానం
డైలాగ్స్ - పద్మావతి మల్లాది
గ్లామర్ హంగుల కంటే అభినయాన్ని నమ్ముకొని సినీ పరిశ్రమలో రాణించే హీరోయిన్లు అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో ఐశ్వర్యలక్ష్మి(Aishwarya Lekshmi) ఒకరు. తమిళంలో డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో హీరోయిన్‌గా మంచి పేరుతెచ్చుకున్నది ఐశ్వర్యలక్ష్మి. తెలుగులో గాడ్సే సినిమాలో నటించింది.
మణిరత్నం (Maniratnam) దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్‌లో(Ponniyin Selvan) కీలక పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఐశ్వర్యలక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా అమ్ము. నవీన్‌చంద్ర (Naveen chandra) హీరోగా నటించిన ఈ సినిమాకు చారుకేష్ శేఖర్ దర్శకత్వం వహించాడు. తమిళ దర్శకుడు కార్తిక్‌సుబ్బరాజు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. అమెజాన్ ప్రైమ్ (Amazon prime video) ద్వారా నేడు (గురువారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సామాజిక సందేశంతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే.
అమ్ము పెళ్లి కథ...
అమ్ముకు (ఐశ్వర్యలక్ష్మి) తన పక్కింట్లోనే ఉండే చిన్ననాటి నుంచి తెలిసిన రవీంద్రనాథ్‌తో (నవీన్‌చంద్ర) పెళ్లి జరుగుతుంది. రవీంద్రనాథ్‌కు మహారాణిపల్లి పోలీస్‌స్టేషన్‌లో సీఐగా ఉద్యోగం వస్తుంది. పెళ్లి తర్వాత భర్తతో కొత్త జీవితం మొదలుపెడుతుంది అమ్ము.
పెళ్లైన కొద్ది రోజుల వరకు అమ్మును ప్రేమగా చూసుకున్న రవీంద్రనాథ్ ఆ తర్వాత శాడిస్ట్‌గా మారిపోతాడు. జనాల దృష్టిలో మాత్రం మంచివాడు నటిస్తుంటాడు. అమ్మును మాటలతో బాధపెట్టడం, కొట్టడం చేస్తుంటాడు. రోజురోజుకు అతడు ప్రవర్తన మితిమీరిపోతుంటుంది. అయినా భర్తపై ఉన్న ప్రేమతో ఆ బాధలన్నింటినీ ఓపికగా భరిస్తుంటుంది అమ్ము.
చివరకు ఓ రోజు ధైర్యం చేసి రవిపై డీజీపీకి కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటుంది అమ్ము. కానీ రవి తెలివిగా ఆమె ప్లాన్‌ను కనిపెట్టి వెనక్కి తీసుకొస్తాడు. భర్తకు బుద్ధిచెప్పేందుకు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న అమ్మకు మర్డర్ కేసులో జైలుకెళ్లి పెరోల్ మీద బయటకువచ్చిన ప్రభుదాస్‌తో (బాబీ సింహ) పరిచయం ఏర్పడుతుంది. అతడి ద్వారా భర్త రవి నిజస్వరూపాన్ని ప్రపంచానికి ఎలా తెలియజేసింది? ప్రభుదాస్ ఎవరు? అమ్ముకు అతడు ఏ విధంగా సహాయపడ్డాడు? అన్నదే ఈ చిత్ర కథ.
యథార్థ ఘటనల స్ఫూర్తితో...(Ammu Movie Review)
భోజనం టైమ్‌కు తీసుకురాలేదని, కూర సరిగా వండలేదని భార్యను కొట్టిన భర్త అంటూ ప్రతిరోజు వార్తలు కనిపిస్తూనే ఉంటాయి. మాటలతో, చేతలతో భర్తల కారణంగా భార్యలు బాధింపబడుతోన్న సంఘటనల నుంచి స్ఫూర్తి పొందుతూ అమ్ము కథను రాసుకున్నాడు దర్శకుడు ప్రభుదాస్.
పురుషాధిక్యతతో భార్యలను కొట్టడం, తిట్టడం తమ హక్కుగా చాలా మంది భర్తలు భావిస్తుంటారు. ఉన్నత విద్యావంతుల్లో ఈ రకమైన శాడిజం కనిపిస్తుంటుంది. సమాజంలో మంచి పొజిషన్స్‌లో ఉండే వారిలో కూడా అంతర్లీనంగా పశుప్రవృత్తి దాగి ఉంటుందని ఈ సినిమాలో చూపించారు దర్శకుడు.
ఆధారపడటం కరెక్ట్ కాదు...
భర్త ఎంత కొట్టినా, తిట్టినా భార్య ఓపికగా భరించాల్సిందేననే సిద్ధాంతాన్ని సమాజంలో పేరుకుపోయిన సిద్ధాంతాన్ని తప్పు అంటూ అమ్ము సినిమాలో చూపించారు దర్శకుడు చారుకేష్ శేఖర్. తమ జీవితాలకు సంబంధించిన నిర్ణయం ఏదైనా తామే తీసుకోవాలని, ఎదుటివారిపై ఆధారపడాల్సిన అవసరం లేదని హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి క్యారెక్టర్ ద్వారా చాటిచెప్పారు
రియాలిటీ మిస్…
నవీన్‌చంద్ర, ఐశ్వర్యలక్ష్మి పెళ్లితో ఈ సినిమా మొదలైంది. ప్రారంభంలో వారి అనుబంధాన్ని రొమాంటిక్ గా చూపిస్తూ మెయిన్ పాయింట్‌లోకి వెళ్లాడు దర్శకుడు. రవి కారణంగా అమ్ము పడే ఇబ్బందులతో కథను ముందుకు నడిపించాడు. భర్తపై ఉన్న ప్రేమతో అతడిలో మార్పు కోసం అమ్ము చేసే ప్రయత్నాలను డైలాగ్స్ ద్వారా ఆవిష్కరించడం బాగుంది. భర్త మారడని తెలుసుకున్న అమ్ము... ప్రభుదాస్ ద్వారా చట్టానికి ఎలా పట్టించిందనేది సెకండాఫ్‌లో చూపించారు. ఆ సీన్స్ కొంత లాజిక్స్‌కు దూరంగా సాగుతాయి. వాటిని కన్వీన్సింగ్ రాసుకుంటే బాగుండేది. ఆ సీన్స్‌లో రియాలిటీ మిస్సయింది.
ఐశ్వర్యలక్ష్మి జీవించింది...(Ammu Movie Review)
అమ్ము పాత్రలో ఐశ్వర్యలక్ష్మి జీవించింది. భర్త చేతిలో నిత్యం అవమానాలు పాలయ్యే సగటు ఇల్లాలి పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. అమ్ము పాత్రను ఓన్ చేసుకొని నటించిన తీరు మెప్పిస్తుంది. ప్రజల దృష్టిలో మంచివాడిగా నటిస్తూ భార్యను హింసించే శాడిస్ట్ భర్త పాత్రలో నవీన్‌చంద్ర యాక్టింగ్ బాగుంది. రెండు షేడ్స్‌తో సాగే పాత్రలో చక్కటి వేరియేషన్స్ చూపించాడు. ప్రభుదాస్‌గా బాబీసింహా క్యారెక్టర్ జోవియల్‌గా సాగుతుంది. సత్యకృష్ణ, రఘుబాబు క్యారెక్టర్స్‌ను చక్కగా వాడుకున్నాడు డైరెక్టర్.
డైలాగ్స్ ప్లస్...
ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాను చక్కటి ఎమోషన్స్‌తో అర్థవంతంగా తెరకెక్కించారు దర్శకుడు. పద్మావతి మల్లాది రాసిన డైలాగ్స్ బాగున్నాయి. కథనం కొంత నిదానంగా సాగడం ఇబ్బంది పెడుతుంది. ఫస్ట్‌హాఫ్‌లో ఇంటెన్సీటి, ఎమోషన్స్ సెకండాఫ్‌లో మిస్సయ్యాయి.
హార్ట్ టచింగ్ ఫిల్మ్...
హార్ట్ టచింగ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అమ్ము ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఐశ్వర్యలక్ష్మి యాక్టింగ్ కోసమైనా ఈ సినిమా చూడొచ్చు.
రేటింగ్ - 2.75/5