TS Election Campaign : తెలంగాణలో ముగిసిన ప్రచార పర్వం, మూగబోయిన మైకులు-hyderabad news in telugu telangana elections 2023 campaign closed ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ts Election Campaign : తెలంగాణలో ముగిసిన ప్రచార పర్వం, మూగబోయిన మైకులు

TS Election Campaign : తెలంగాణలో ముగిసిన ప్రచార పర్వం, మూగబోయిన మైకులు

Bandaru Satyaprasad HT Telugu
Nov 28, 2023 04:58 PM IST

TS Election Campaign : మంగళవారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇన్నాళ్లు చెవులు చిల్లులు పడేలా మోగిన మైకులు మూగబోయాయి.

ముగిసిన ఎన్నికల ప్రచారం
ముగిసిన ఎన్నికల ప్రచారం

TS Election Campaign : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు మైకులు మూతపడ్డాయి. నెలన్నర రోజుల పాటు సాగిన ప్రచారాలు మూగబోయాయి. ఎన్నికలంటే ఓ పండగలా సాగిన వాతావరణం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు ప్రచారాలతో హోరెక్కించారు. ప్రచారంలో ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం జరిగింది. హామీల వర్షం కురిసింది. మరికొన్ని రోజుల్లో ప్రజలు ఎవర్ని మెచ్చారో, ఎవర్ని ఇంటికి పంపారో తెలిసిపోనుంది.

పోటీలో 2290 మంది

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిలో 221 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయగా, 45 వేల మంది పోలీసులు భద్రతా విధులు నిర్వర్తిస్తు్న్నారు. మంగళవారం సాయంత్రం నుంచి సోషల్‌ మీడియాలోనూ రాజకీయ ప్రకటనలకు అనుమతి లేదని ఈసీ తెలిపింది. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాను రంగంలోకి దింపారు.

కేంద్ర, రాష్ట్ర బలగాలు రంగంలోకి

తెలంగాణలో జరగనున్న ఎన్నికలకు లక్ష మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారని అధికారులు తెలిపారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు ఎన్నికల నిర్వహణకు విధులను నిర్వర్తిస్తున్నాయి. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు బలగాలను మోహరించారు. రాష్ట్ర ఎన్నికల విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలోని 4400 సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు భద్రతా బలగాలను మోహరించినట్లు తెలిపారు. ఎన్నికలకు అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, తెలంగాణ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.

144 సెక్షన్

తెలంగాణ ఎన్నికల విధులలో 45 వేలమంది తెలంగాణ పోలీసులు ఉండగా, 18 వేల మంది హోంగార్డులు ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. ములుగు జిల్లాలో మావోయిస్టు యాక్షన్ టీం చొరబడిందన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతను ఏర్పాటుచేశారు. మావోయిస్టులు రాజకీయ నేతలు, పోలీసుల లక్ష్యంగా భారీ స్కెచ్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు మావోల ప్రభావిత అటవీ ప్రాంతాలలో కూంబింగ్ నిర్వహిస్తు్న్నారు. ఏజెన్సీ ప్రాంతాలతో గట్టి నిఘా పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సాయంత్రం నుంచి పోలింగ్ ముగిసేవరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది.

Whats_app_banner