Rajasthan Assembly Polls 2023: రాజస్తాన్ కాంగ్రెస్ మేనిఫెస్టో; పశుపాలకుల నుంచి పేడ సేకరణ; కేజీ 2 రూపాయలకు..
Rajasthan Assembly Election 2023: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేశారు. రాష్ట్రంలోని పశుపాలకుల నుంచి కేజీ 2 రూపాయలకు పేడ సేకరిస్తామని ఆ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.
Rajasthan Congress manifesto: రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ నేతలు అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్, గోవింద్ సింగ్, సీపీ జోషి .. తదితరులు మంగళవారం పార్టీ ఆఫీస్ లో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోకు ‘జన ఘోషన పత్ర’గా పేరు పెట్టారు.
అధికారంలోకి వస్తే..
రాజస్తాన్ లో మళ్లీ అధికారంలోకి వస్తే పంచాయత్ స్థాయి రిక్రూట్ మెంట్ స్కీమ్ ను అమలు చేస్తామని, అలాగే, రాష్ట్రంలో కులగణన చేపడ్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అలాగే, వివిధ పంటలకు కనీస మద్ధతు ధరను స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయిస్తామని వెల్లడించింది.
200 స్థానాలు
రాజస్తాన్ లో నవంబర్ 25వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3వ తేదీన మిగతా రాష్ట్రాల ఫలితాలతో పాటు రాజస్తాన్ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్తాయి. 2013 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించగా, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచి, బీఎస్పీ, స్వతంత్రుల మద్ధతుతో అధికారంలోకి వచ్చింది. రాజస్తాన్ లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
కాంగ్రెస్ హామీలు
మొత్తం 7 ప్రధాన హామీలను కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. అవి..
- గృహ లక్ష్మి యోజన కింద ఇంటి పెద్దగా ఉన్న మహిళకు సంవత్సరానికి రూ. 10 వేలు.
- రాష్ట్రంలోని 1.05 కోట్ల కుటుంబాలకు రూ. 500 లకే గ్యాస్ సిలిండర్.
- గోధాన్ గ్యారెంటీ స్కీమ్ కింద పశు పాలకుల నుంచి కేజీ రూ. 2 కి పేడ సేకరణ
- ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ
- ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లేదా ట్యాబ్.
- ప్రకృతి విపత్తుల్లో ఎవరైనా చనిపోతే, ఆ కుటుంబానికి రూ. 15 లక్షల బీమా.
- చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ మొత్తాన్ని రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంపు.