Rajasthan elections 2023 : రాజస్థాన్​లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ షురూ..-rajasthan assembly elections 2023 live voting begins in 199 seats ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Rajasthan Elections 2023 : రాజస్థాన్​లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ షురూ..

Rajasthan elections 2023 : రాజస్థాన్​లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ షురూ..

Sharath Chitturi HT Telugu
Nov 25, 2023 07:12 AM IST

Rajasthan Assembly elections 2023 : రాజస్థాన్​లో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్​ ప్రక్రియ మొదలైంది. గెలుపుపై బీజేపీ, కాంగ్రెస్​లు ధీమాగా ఉన్నాయి.

రాజస్థాన్​లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ షురూ..
రాజస్థాన్​లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ షురూ.. (PTI)

Rajasthan Assembly elections 2023 : మరో హైఓల్టేజ్​ యాక్షన్​కు దేశం సిద్ధమైంది. రాజస్థాన్​లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ప్రక్రియం.. శనివారం ఉదయం 7 గంటలకు మొదలైంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటర్లు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా.. అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్​ శ్రమిస్తుంటే.. ఆ పార్టీని గద్దె దించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మొత్తం మీద.. ఈ దఫా ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీ వర్సెస్​ రాజస్థాన్​ సీఎం అశోక్​ గహ్లోత్​గా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల వివరాలు..

రాజస్థాన్​లో మొత్తం 200 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మెజారిటీ కోసం 101 సీట్లు సంపాదించాల్సి ఉంది. ఈ 200 సీట్లల్లో.. 199 సీట్లకు శనివారం ఉదయం పోలింగ్​ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే, కాంగ్రెస్​ అభ్యర్థి గుర్మీత్​ సింగ్​ కూనర్​ మరణంతో.. శ్రీగంగానగర్​లోని కరణ్​పూర్​ సీటు పోలింగ్​ ప్రక్రియను సస్పెండ్​ చేశారు.

మొత్తం 199 సీట్లకు 1,862 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. రాష్ట్రంలోని 5.25 కోట్ల మంది ఓటర్లు.. వీరి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. వీరిలో 18-30ఏళ్ల మధ్య ఓటర్లు 1.71 కోట్ల మంది ఉన్నారు. తొలిసారి ఓటు (18-19ఏళ్లు) వేస్తున్న వారి సంఖ్య 22.61 లక్షలుగా ఉంది.

Rajasthan Assembly elections 2023 live updates : ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. మాక్​ డ్రిల్స్​ సైతం నిర్వహించింది. పోలింగ్​ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. అధికారులు భారీస్థాయిలో భద్రతా దళాలను మోహరించారు.

మోదీ వర్సెస్​ గహ్లోత్​..!

ఈ దఫా రాజస్థాన్​ ఎన్నికలు.. మోదీ వర్సెస్​ గహ్లోత్​గా మారాయి! రాష్ట్రంలో అనేకమార్లు పర్యటించిన ప్రధాని మోదీ.. గహ్లోత్​తో పాటు ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీకి అధికారాన్ని ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్​ కూడా తన వంతు ప్రయత్నం చేసింది. కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శల చేయడంతో పాటు 'ఉచిత' హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు కృషి చేసింది.

గెలుపెవరిది..?

Rajasthan elections 2023 : రాజస్థాన్​లో.. 1993 నుంచి ఓ ఆనవాయతీ కొనసాగుతోంది. అక్కడ ఏ పార్టీకి కూడా వరుసగా రెండోసారి అవకాశాన్ని ఇవ్వలేదు ఓటర్లు. ఈ ఆనవాయతీని బీజేపీ బలంగా విశ్వసిస్తోంది. కానీ దీనిని ఈసారి బ్రేక్​ చేస్తామని కాంగ్రెస్​ ధీమాగా ఉంది.

మరి.. ఈ ఆనవాయతీ ఈసారి కూడా రిపీట్​ అవుతుందా? లేక కాంగ్రెస్​కి మరో అవకాశం దక్కుతుందా? అన్నది.. రాజస్థాన్​ ఎన్నికల ఫలితాలు వెలువడే డిసెంబర్​ 3తో తేలిపోనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం