Priyanka Gandhi: మోదీపై ‘మేరే నామ్’ అనే సినిమా తీయాలి: ప్రియాంక గాంధీ సెటైర్; సల్మాన్ ఖాన్ తో పోలిక
Priyanka Gandhi: మధ్య ప్రదేశ్ ఎన్నికల సభలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. మోదీ ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
Priyanka Gandhi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఒక సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ఒక పాత్రతో పోలుస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.
ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు..
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన తేరే నామ్ సినిమాను ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్ర ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుందని, అలాగే, మన ప్రధాని మోదీ కూడా ఎప్పుడూ ఏడుపేనని ఆమె వ్యాఖ్యానించారు. అందుకే ప్రధాని మోదీపై మేరే నామ్’ అనే బయోపిక్ సినిమా తీయాలి’ అని సెటైర్ వేశారు. “మోదీ జీ గురించి ఒక విషయం చెప్పాలి.. అతను ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు (రోటే హై రెహతే హై). ‘తేరే నామ్’ సినిమాలో సల్మాన్ ఖాన్ మొదటి నుంచి చివరి వరకు ఏడుస్తూనే ఉన్నాడు. అదేవిధంగా మోడీ జీ కూడా ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు. అందుకే ఆయన బయోపిక్ ను 'మేరే నామ్' టైటిల్‌తో రూపొందించాలి" అని ప్రియాంక గాంధీ ఒక ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు.
ఎప్పుడూ సొంత కష్టాలే..
సొంత కష్టాలను ప్రజలకు చెప్పుకుని ఏడ్చే ప్రధాని మోదీ ఒక్కరేనని ప్రియాంక విమర్శించారు. "తన సమస్యలతో ఎప్పుడూ బాధపడే భారతదేశపు మొదటి ప్రధాని నరేంద్ర మోదీ. కర్నాటక ఎన్నికల సమయంలో అక్కడికి వెళ్లి, నన్నిలా తిట్టారు, నన్నలా తిట్టారు అని ఒక జాబితా చదివి వచ్చాడు. ఇప్పుడు మధ్య ప్రదేశ్ లో మరో లిస్ట్ తో వచ్చాడు’’ అని ప్రియాంక గాంధీ విమర్శించారు.
మా నాన్నను కూడా తిట్టేవారు
ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని కూడా గుర్తు చేసుకున్నారు. ‘అమేథీ ప్రజలు తన తండ్రి రాజీవ్‌గాంధీని ఆయన ముఖంపైననే విమర్శించేవారు. 'రాజీవ్ భయ్యా, మీరంటే మాకు ప్రేమ. మీకు ఓటు వేస్తాం. కానీ మీరు మా రోడ్లను బాగు చేయకపోతే మాత్రం మేము మీకు ఓటు వేయం" అని బెదిరించేవారు’. కానీ, ఆ మాటలను రాజీవ్ గాంధీ తప్పుబట్టేవారు కాదని, కారణాలు వివరిస్తూ, వారిని సముదాయించే వారని ప్రియాంక గుర్తు చేశారు.