SRH vs RCB: ఉప్పల్‍లో టాస్ గెలిచిన బెంగళూరు.. ఈసారి ఆ పొరపాటు చేయలేదు!
SRH vs RCB IPL 2024: భీకర ఫామ్‍లో ఉన్న సన్‍రైజర్స్ హైదరాబాద్, వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరు షురూ అయింది. పది రోజుల క్రితం బెంగళూరును బాదేసిన హైదరాబాద్ ఫుల్ జోష్‍లో ఉంది. ఈ పోరులో ముందుగా టాస్ గెలిచింది ఆర్సీబీ.

IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) విధ్వంసకర దూకుడుతో అదరగొడుతోంది. ఈ సీజన్‍లోనే రెండుసార్లు ఐపీఎల్‍లో అత్యధిక స్కోరు చేసి చరిత్ర సృష్టించింది. పది రోజుల కిందటే చిన్నస్వామి వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)ను బాదేసి.. ఐపీఎల్‍లో హయ్యెస్ట్ స్కోరు (287) నమోదు చేసింది ఎస్‍ఆర్‌హెచ్. ఇప్పుడు హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో నేడు (ఏప్రిల్ 25) బెంగళూరుతో తలపడుతోంది హైదరాబాద్. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది.
ఆ తప్పు రిపీట్ కాకుండా..
ఏప్రిల్ 15న హైదరాబాద్‍తో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‍లో టాస్ గెలిచి బెంగళూరు ముందు బౌలింగ్ ఎంపిక చేసుకుంది. అప్పటికే ఫుల్ ఫామ్‍లో ఉన్న హైదరాబాద్‍కు ముందు బ్యాటింగ్ ఇచ్చింది. దీంతో భీకర ఫామ్‍లో ఉన్న సన్‍రైజర్స్ బ్యాటర్లు దుమ్మురేపారు. ఏకంగా 287 పరుగులు చేసి.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులను చేసింది హైదరాబాద్. అయితే, నేడు ఉప్పల్ స్టేడియంలో బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆ పొరపాటు చేయలేదు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు.
ఉప్పల్ స్టేడియంలో టీమిండియా స్టార్, ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు మార్మోగింది. హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా కోహ్లీ.. కోహ్లీ అంటూ మోతెక్కించారు.
తమ జట్టును హైదరాబాద్ ప్రజలు ఎంతో ప్రేమిస్తున్నారని, ఆరెంజ్ జెండాలు రెపరెపలాడిస్తుంటే తనకు చాలా సంతోషంగా అనిపిస్తోందని టాస్ సమయంలో సన్‍రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పాడు. గత మ్యాచ్‍లో పోలిస్తే తుది జట్టులో ఓ మార్పు చేసింది ఎస్ఆర్‌హెట్. వాషింగ్టన్ సుందర్ స్థానంలో తుదిజట్టులో జయదేవ్ ఉనాద్కత్‍ను తీసుకుంది. బెంగళూరు తుదిజట్టులో మార్పులు చేయలేదు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇంకా తుదిజట్టులోకి రాలేదు.
ఈ ఐపీఎల్ సీజన్‍లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‍ల్లో ఏడు ఓడిన ఆర్సీబీకి ఘోరమైన ఫామ్‍లో ఉంది. ఇక ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే నేడు హైదరాబాద్‍పై తప్పక గెలువాల్సిందే. మరోవైపు, ఏడు మ్యాచ్‍ల్లో ఐదు గెలిచిన సన్‍రైజర్స్ అద్భుతంగా ఆడుతోంది. భీకరమైన బ్యాటింగ్‍తో రికార్డుల మోత మోగించింది. ఈ మ్యాచ్‍లోనూ అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.
సన్‍రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు: అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమాద్, షెహబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, మయాంక్ మార్కండే, నటరాజన్
హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్ ఆప్షన్లు: ట్రావిస్ హెడ్, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‍ప్రీత్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్
బ్యాటింగ్ సమయంలో ట్రావిస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావడం ఖాయమే.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లూకీ ఫెర్గ్యూసన్, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్
బెంగళూరు ఇంపాక్ట్ సబ్ ఆప్షన్లు: సుయాశ్ ప్రభుదేశాయ్, అనూజ్ రావత్, హిమాన్షు శర్మ, విజయ్‍కుమార్ వైశాఖ్, స్వప్నిల్ సింగ్