Fixed Deposits : ఈ బ్యాంకుల్లో ఎఫ్‌డీ డిపాజిట్ చేసేవారు 9.60 శాతం వరకు వడ్డీని పొందవచ్చు
Fixed Deposits : ఫిక్స్‌డ్ డిపాజిట్ మీద వడ్డీ అధికంగా రావాలని అందరూ అనుకుంటారు. అయితే ఇందుకోసం మీరు ఎంచుకునే బ్యాంకు చాలా ముఖ్యం. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీని అందిస్తే.. మరికొన్ని బ్యాంకులు పెట్టుబడిదారులకు మంచి మెుత్తాన్ని ఇస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకునేవారికి ఏ బ్యాంకు బెటరో చూద్దాం..
భారతదేశంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఇప్పటికీ సురక్షిత పెట్టుబడులకు ఉత్తమ ఎంపికగా పరిగణిస్తారు. దేశంలోని పెద్ద ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులే కాకుండా చిన్న ఫైనాన్స్ బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు ఎఫ్‌డీలపై మెరుగైన రాబడిని అందిస్తాయి. 9.60 శాతం వరకు వడ్డీ రేట్లు అందించే కొన్ని మైక్రోఫైనాన్స్ సంస్థలు ఏంటో చూద్దాం..
సూర్యాడే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 9.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 9.60 శాతం వడ్డీని 5 సంవత్సరాల ఎఫ్‌డీలపై అందిస్తోంది. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 1001 రోజుల ఎఫ్‌డీలపై 9 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 9.50 శాతం వడ్డీని అందిస్తుంది. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన 1000 రోజుల ఎఫ్‌డీలపై సాధారణ కస్టమర్లకు 8.51 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 9.11 శాతం వడ్డీని అందిస్తోంది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన 888 రోజుల ఎఫ్‌డీలపై సాధారణ కస్టమర్లకు 8.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 9 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ISAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2 నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ FDలపై సాధారణ కస్టమర్లకు 8.50 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 9 శాతం వడ్డీని అందిస్తుంది.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 500 రోజుల ఎఫ్‌డీపై 8.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 9 శాతం వడ్డీని అందిస్తుంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1000 నుండి 1500 రోజుల ఎఫ్‌డీలపై సాధారణ కస్టమర్లకు 8.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.85 శాతం వడ్డీని అందిస్తోంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 560 రోజుల ఎఫ్‌డీపై సాధారణ కస్టమర్లకు 8.25 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 8.85 శాతం వడ్డీని అందిస్తుంది.
శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 24 నుండి 36 నెలల ఎఫ్‌డీలపై సాధారణ పెట్టుబడిదారులకు 8.15 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.65 శాతం వడ్డీని అందిస్తోంది. కానీ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 24 నెలల 1 రోజు నుండి 36 నెలల ఎఫ్‌డీలపై అందించే వడ్డీ రేటు సాధారణ డిపాజిటర్లకు 7.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.25 శాతం.