SBI FD schemes: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ప్రజాదరణ పొందిన రెండు ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలను పొడిగించారు. సీనియర్ సిటిజన్లకు ఉద్దేశించిన ఎస్బీఐ వి కేర్ (SBI WeCare)తో పాటు అమృత్ కలశ్ (Amrit Kalash) స్పెషల్ ఎఫ్డీ పథకాన్ని పొడిగిస్తూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ వి కేర్ (SBI WeCare) ఎఫ్డీ పథకాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు.
ఎస్బీఐ వి కేర్ (SBI WeCare) ఎఫ్డీ పథకం ద్వారా సీనియర్ సిటిజన్లు ఆకర్షణీయమైన వడ్డీ రేటును పొందవచ్చు. ఈ పథకం కాల వ్యవధి 5 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ పథకాన్ని తాజాగా సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. అంటే, సెప్టెంబర్ 30 లోపు కొత్తగా ఫిక్స్ డ్ డిపాజిట్ చేయవచ్చు. అలాగే, గడువు ముగియనున్న ఎఫ్డీలను రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన సీనియర్ సిటిజన్లకు 7.5% వార్షిక వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్స్ కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రారంభించిన ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ సీనియర్ సిటిజన్స్ కేర్ ఎఫ్డీ ప్లాన్(Senior Citizen Care FD plan) ను కూడా జులై 7వ తేదీ వరకు పొడగించారు.
అమృత్ కలశ్ పేరుతో ఎస్బీఐ తీసుకువచ్చిన ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని కూడా పొడిగించారు. ఈ పథకం గడువు జూన్ 30వ తేదీ వరకు మాత్రమే ఉండగా, తాజాగా ఆ గడువును ఆగస్ట్ 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కీమ్ ను 2023, ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. ఈ స్కీమ్ లో ఎఫ్డీ చేసినవారిలో సీనియర్ సిటిజన్లకు 7.6% వార్షిక వడ్డీ రేటు, ఇతరులకు 7.1% వార్షిక వడ్డీ రేటు లభిస్తుంది.