Retail Inflation: తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం.. 11 నెలల తర్వాత ఆర్బీఐ టార్గెట్‍లోకి..
Retail Inflation: రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో దిగివచ్చింది. ఈ ఏడాది తొలిసారి 6శాతం కంటే తక్కువగా నమోదైంది.
Retail Inflation: నవంబర్ నెలలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. వినియోగదారుల ధరల సూచీ (Consumer Price Index - CPI) ఆధారంగా గణించే ఈ రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 5.88 శాతానికి దిగి వచ్చింది. అక్టోబర్‌లో ఇది 6.77 శాతంగా నమోదైంది. నవంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) 5.88 శాతానికి వచ్చి.. 11 నెలల కనిష్ఠానికి చేరింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్దేశించుకున్న 6శాతం లక్ష్యం దిగువకు ఈ ఏడాది తొలిసారిగా వచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణంలో క్షీణత.. నిత్యావసర సరుకులు, కూరగాయలతో పాటు మరిన్ని ఆహార పదార్థాల ధరల తగ్గుదలను సూచిస్తోంది. ప్రధానంగా నవంబర్‌లో వాటి ధరలు దిగిరావటంతో రిటైల్ ఇన్‍ఫ్లేషన్ తగ్గింది.
రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం మధ్యే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. 2026 మార్చి ముగింపు వరకు ఈ టార్గెట్‍ను ఇచ్చింది. 11 నెలల తర్వాత నవంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం ఈ పరిధిలోకి వచ్చింది.
ఆహార ద్రవ్యోల్బణం కూడా..
మరోవైపు, నవంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం (Food Inflation) 4.67 శాతానికి దిగివచ్చింది. అంతకు ముందు నెలలో 7.01 శాతంగా ఉండగా.. గణనీయంగా తగ్గింది. జాతీయ గణాంకాల కార్యాలయం (National Statistical Office - NSO) ఈ డేటాను విడుదల చేసింది.
దేశంలో ధరలు పెరగకుండా చేపట్టాల్సిన చర్యల్లో వెనుకడుగు వేయబోమని ఆర్‌బీఐ ఇటీవలే ప్రకటించింది. ద్రవ్యోల్బణం మార్పులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని చెప్పింది. రానున్న 12 నెలల్లో 4 శాతం దిగువనే రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేసింది.
కాగా, గత వారం రెపోరేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్బీఐ. దీంతో వడ్డీరేటు 6.25 శాతానికి చేరింది. ఈ ఏడాది మే 2022 నుంచి ఏకంగా 2.25 శాతం వడ్డీరేటు అధికమైంది, ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చే చర్యల్లో భాగంగా.. ఆర్బీఐ రెపోరేటును పెంచుతోంది. మరి ఇప్పుడు ద్రవ్యోల్బణం అదుపులోకి రావటంతో భవిష్యత్తులో రెపోరేటుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననేది ఆసక్తికరంగా మారింది.