వన్ స్టాప్: సూపర్ యాప్స్‌ పనితీరు, భవిష్యత్తును విశ్లేషించే బుక్-one stop a book that deep dive into performance and future of super apps ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  వన్ స్టాప్: సూపర్ యాప్స్‌ పనితీరు, భవిష్యత్తును విశ్లేషించే బుక్

వన్ స్టాప్: సూపర్ యాప్స్‌ పనితీరు, భవిష్యత్తును విశ్లేషించే బుక్

HT Telugu Desk HT Telugu
Nov 03, 2023 03:18 PM IST

One Stop Book Introduction: ఒకే యాప్‌లో అనేక సేవలు అందించడమేనే భావనతో పుట్టుకొస్తున్నవే సూపర్ యాప్స్. వాటి పనితీరును విశ్లేషిస్తూ, భవిష్యత్తులో గల అవకాశాలను వివరిస్తూ ఇదే అంశంపై సింగపూర్ నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీలో ఫిన్‌టెక్ ప్రొఫెసర్ నేహా మెహతా వన్ స్టాప్ పేరుతో పుస్తకం రాశారు.

సూపర్ యాప్స్‌పై నేహా మెహతా వన్ స్టాప్ బుక్
సూపర్ యాప్స్‌పై నేహా మెహతా వన్ స్టాప్ బుక్

వన్ స్టాప్ పుస్తకంలో రచయిత నేహా మెహతా సూపర్ యాప్స్ గురించి మనకు తెలియని అనేక ఆసక్తికర విషయాలను చర్చించారు. ప్రపంచ యాప్ పరిశ్రమ ప్రతి రోజూ విస్తరిస్తోంది. ప్రజలు చిటికెలో తమ అవసరాలను తీర్చుకునేవిధంగా వృద్ధి చెందుతోంది. అది చెల్లింపుల కోసమే గానీ, షాపింగ్, హెల్త్ కేర్, ఆడియో లేదా వీడియో స్ట్రీమింగ్.. ఇలా అనేక రకాలు వినియోగదారుల అవసరాలు తీరుస్తోంది. టెక్ జెయింట్స్, ఫిన్‌టెక్ కంపెనీలు మార్కెట్లో భారీ వాటా సాధించుకునే దిశగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఇలాంటి అనేక సేవలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేదే సూపర్ యాప్. అంటే అనేక యాప్‌లను సమీకృతం చేసి ఎలాంటి అంతరాయం లేకుండా మెరుగైన అనుభవాన్ని అందించ గలిగే యాప్ అని చెప్పొచ్చు.

ఆ రకంగా సూపర్ యాప్ పుట్టింది. తన వన్ స్టాప్ బుక్ ద్వారా రచయిత నేహా మెహతా ఈ విశేషాలను చర్చించారు. ఒకే లాగిన్ ద్వారా బహుళ సేవలను పొందడాన్ని చర్చించారు. సూపర్ యాప్ రివల్యూషన్ గురించి ఈ వన్ స్టాప్ బుక్ ఒక ప్రాథమిక మార్గదర్శిగా నిలుస్తుంది. ఇంకా ఈ సూపర్ యాప్ రంగంలో ఉన్న అవకాశాలనూ చర్చిస్తుంది.

ఏషియాలో సూపర్ యాప్స్ సక్సెస్ కావడాన్ని ప్రపంచం చూసింది. అనేక రంగాలకు చెందిన వ్యాపారాలు ఈ మార్గంలో ఉన్న ఆదాయాన్ని అన్వేషించడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. బ్యాంకులు, అలాగే ఫుడ్ సర్వీసులు, డెలివరీ సేవలు అందించేందుకు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వచ్చిన కంపెనీలు సూపర్ యాప్స్‌పై ఎలా దృష్టి పెట్టాయి? అవి వినియోగదారులు తమ సమయాన్ని ఆదా చేసుకునేందుకు ఎలా తోడ్పడుతున్నాయి వంటి అంశాలను ఈ వన్ స్టాప్ బుక్ విశ్లేషించింది.

ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన సూపర్ యాప్స్ గురించి ఎవరికీ తెలియని కొన్ని విశేషాలను రచయిత ఈ పుస్తకంలో పంచుకున్నారు. అవి వినియోగదారుల అనుభవాన్ని ఎలా మెరుగుపరిచాయి? ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డేటా ప్రైవసీలో వాటి కృషి వంటి విశేషాలనూ రచయిత విశ్లేషించారు.

అసలు సూపర్ యాప్ అంటే ఏంటి? వివిధ దేశాల్లో సూపర్ యాప్స్ సేవలు అవసరం ఉన్నాయా? వాటి ప్రయాణం ఎలా ఉంది? వాటి భవిష్యతు ఏంటి? వాటి సామాజిక, ఆర్థిక ప్రభావం ఎలా ఉండబోతోంది? వంటి ప్రశ్నలను అన్వేషిస్తూ ఈ పుస్తకం సాగుతంది.

సూపర్ యాప్స్ లక్ష్యం ఏంటి? వీటి ఆవిర్భావం వెనక కారణాలేంటి? వినియోగదారులు ఏం కోరుకుంటున్నారు? కోవిడ్-19 తదనంతర పరిణామాల తరువాత ఫిన్‌టెక్ పరిశ్రమపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? వంటి వాటికి ఇందులో సమాధానం దొరుకుతంది.

సూపర్ యాప్స్‌ను పరిచయం చేయడం, వాటి గురించి అవగాహన కల్పించడం ఈ బుక్ ముఖ్య ఉద్దేశం అని రచయిత తెలిపారు. గ్రాబ్, వీచాట్ వంటి సూపర్ యాప్స్ తో ఏషియా ఇప్పటికే సూపర్ యాప్స్‌ను తన ఇంటిపేరుగా మార్చుకుంది. సూపర్ యాప్స్ ఎలా వర్క్ చేస్తాయి? ఫిన్‌టెక్ ఇండస్ట్రీని ఎలా విప్లవాత్మకంగా మార్చేశాయి? ప్రతి ఒక్కరికీ ఆర్థిక రంగంలోకి ఎలా స్వాగతం పలుకుతున్నాయి? స్టార్టప్స్ ఆపరేట్ చేసే విధానాన్ని ఎలా మార్చేస్తున్నాయి వంటి అనేక విశేషాలు ఈ బుక్‌లో ఉన్నాయి.

కోవిడ్-19 మహమ్మారి తదనంతర పరిణామాల్లో డిజిటల్ సేవలు, మౌలిక సదుపాయాల అవసరాలను గుర్తించాం. ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు ఆఫ్ లైన్ నుంచి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు మళ్లేందుకు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి. భవిష్యత్తులో అందరికోసం సమగ్రమైన, సుస్థిరమైన ప్రపంచాన్ని సృష్టించే దిశగా సూపర్ యాప్స్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌లో ఎలా విజేతలుగా నిలిచాయో ఈ పుస్తకం విశదీకరిస్తుంది. ఈ పుస్తకం డిసెంబరులో రిలీజ్ కానుంది.

రచయిత నేహా మెహతా ఢిల్లీ యూనివర్శిటీలో లా అండ్ కామర్స్‌లో డబుల్ డిగ్రీ చేశారు. తరువాత లండన్ కింగ్స్ కాలేజీలో ఫెలోషిప్ చేశారు.

Whats_app_banner