Stock market crash: స్టాక్ మార్కెట్లో రక్తపాతం.. ఈ భారీ పతనానికి కారణాలేంటి?
Stock market crash: కేంద్ర బడ్జెట్ కు ముందు, మంగళవారం భారతీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టపోయింది.
Stock market crash: వివిధ జాతీయ, అంతర్జాతీయ కారణాలతో భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ రక్తపాతాన్ని చవిచూశాయి. జనవరి 23న బీఎస్ఈ సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయి 70,419 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 341 పాయింట్లు నష్టపోయి 21,255 వద్ద స్థిరపడ్డాయి.
నిన్న సెలవు..
అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయం లోపల రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన వేడుక సందర్బంగా జనవరి 22, సోమవారం మార్కెట్లు మూసివేశారు. కాగా, మంగళవారం మార్కెట్ (Stock market) సెషన్ ముగిసే సమయానికి 1000 పాయింట్లకు పైగా పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ నెల రోజుల కనిష్ఠ స్థాయి 70,419ను తాకింది. 2023 జనవరిలోనే సెన్సెక్స్ 73,000 పాయింట్ల వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకడం గమనార్హం.
గరిష్టం నుంచి కనిష్టం
నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ ఈ నెల ప్రారంభంలో భారీ పెరుగుదలను చూశాయి. అప్పటి నుండి నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్నాయి. గత వారం వరుసగా మూడు రోజులు పతనమైన ఈ రెండు సూచీలు శుక్రవారం స్వల్పంగా కోలుకున్నాయి. అయితే, ఐదు ప్రధాన కారణాల వల్ల మంగళవారం మార్కెట్ భారీ పతనాన్ని చవిచూసింది.
ప్రధాన కారణాలు ఐదు..
మంగళవారం సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పడిపోవడానికి 5 ప్రధాన కారణాలున్నాయి. అవి
హెచ్ డీఎఫ్ సీ షేర్లు
క్యూ 3 ఫలితాలు ఆశించిన విధంగా రాకపోవడంతో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ షేర్లపై అమ్మకాల ఒత్తడి పెరిగింది. దాంతో, గత వారం రోజులుగా ఈ దిగ్గజ ప్రైవేటు బ్యాంక్ షేర్లు పతనమవుతున్నాయి. మంగళవారం కూడా హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ షేరు ధర భారీగా పతనమవడమే నేడు స్టాక్ మార్కెట్ పతనానికి 1/3వ వంతు దోహదపడింది.
రిలయన్స్ షేర్ల పతనం
భారతదేశపు అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ షేర్లు కూడా నేడు 2 శాతం పైగా పడిపోయాయి. ఈ చర్య స్టాక్ మార్కెట్ ను భారీ సంక్షోభంలో పడేసింది. నేటి స్టాక్ మార్కెట్ పతనానికి ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పతనం రెండో అతిపెద్ద కారణమని పేర్కొనవచ్చు.
ఎఫ్ఐఐ అమ్మకం
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) 2024 జనవరిలో రూ .23,000 కోట్లకు పైగా విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించారు. మార్కెట్ ప్రస్తుత పతనానికి ఇది కూడా ఒక కారణంగా నిలిచింది. అందుకే గత రెండు వారాలు స్టాక్ మార్కెట్ లు అల్లకల్లోలంగా ఉన్నాయి.
అంతర్జాతీయ ఉద్రిక్తతలు
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, గాజాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఈ నెలలో ముడి చమురు ధరలు, ఎర్ర సముద్రం ద్వారా జరిగే అంతర్జాతీయ రవాణాకు ఆటంకాలు.. మొదలైనవి స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. దిగుమతులు, ఎగుమతులు మందగించడం స్టాక్ మార్కెట్ పై ఒత్తిడి పెరగడానికి దారితీస్తోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సాంకేతిక కారణాలు..
నిఫ్టీ 50 కొంతకాలంగా 21,500-21,700 సెగ్మెంట్లో ఊగిసలాడుతోంది. మంగళవారం నిఫ్టీ 21,500 దిగువకు పడిపోయింది. వచ్చే రెండు వారాల పాటు కొనసాగే అమ్మకాల ఒత్తిళ్ల కారణంగా నిఫ్టీ, నిఫ్టీ బ్యాంక్ పతనం కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.