TDP Mahanadu 2023: ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు - మినీ మేనిఫెస్టోను ప్రకటించిన చంద్రబాబు-tdp chief chandrababu announced mini manifesto at mahanadu 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp Mahanadu 2023: ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు - మినీ మేనిఫెస్టోను ప్రకటించిన చంద్రబాబు

TDP Mahanadu 2023: ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు - మినీ మేనిఫెస్టోను ప్రకటించిన చంద్రబాబు

Maheshwaram Mahendra Chary HT Telugu
May 28, 2023 08:37 PM IST

TDP Manifesto:భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో ప్రకటించింది. 6 ప్రధాన హామీలను ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు.

టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu at TDP Mahanadu:రాజమహేంద్రవరంలో టీడీపీ తలపెట్టిన మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే లక్ష్యంతో 'భవిష్యత్ కు గ్యారంటీ; పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు. అందులో ముఖ్యంగా ఆరు కీలక పథకాలను పేర్కొన్నారు.

మేనిఫెస్టో వివరాలు:

1) Rich To Poor

1.పేదలను సంపన్నులను చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

2. ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

2) బీసీలకు రక్షణ చట్టం

బీసీలకు రక్షణ చట్టం తెచ్చి... వారికి అన్ని విధాలా అండగా నిలుస్తుంది తెలుగుదేశం పార్టీ.

3) ఇంటింటికీ నీరు

చంద్రబాబుగారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే "ఇంటింటికీ మంచి నీరు" పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తుంది తెలుగుదేశం.

4) అన్నదాత

ఈ అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

5) మహాశక్తి

1.ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి "స్త్రీనిధి" కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

2. 'తల్లికి వందనం' పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000లు అందిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం.

3."దీపం" పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

4."ఉచిత బస్సు ప్రయాణం" పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కలిగిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం.

6) యువగళం

1. ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

2. ప్రతి నిరుద్యోగికి 'యువగళం నిధి' కింద నెలకు 2500 రూపాయలను ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

వచ్చేది మనమే - చంద్రబాబు

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు... భావితరాల భవిష్యత్ కోసమే వచ్చాను - రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఎప్పుడూ ముందుంటా అని చెప్పారు. మనల్ని అడ్డుకున్న వారిని తొక్కుకుంటూ వెళ్దామని వ్యాఖ్యానించారు. తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. "రాజకీయ రౌడీలు ఖబడ్దార్.. జాగ్రత్త - టీడీపీ కార్యకర్తలను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. టీడీపీని దెబ్బతీయాలన్ని ఎందరో ప్రయత్నించారు. సంపద సృష్టించడం నేర్పిన పార్టీ మనదే... ఒకేసారి రూ.50వేల రుణమాఫీ చేశాం. రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిన పార్టీ వైసీపీ. రాజధానికి 34 వేల ఎకరాల భూమి సేకరించాం. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నాం - రాష్ట్రాన్ని జగన్‌రెడ్డి సర్వనాశనం చేశారు. పోలీసులు అనవసరంగా రెచ్చిపోతున్నారు .. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని మర్చిపోవద్దు. మహానాడును అడ్డుకోవడానికి కుట్రలు చేశారు. జగన్‌రెడ్డివి చిల్లర రాజకీయాలు - వైసీపీ నాలుగేళ్ల పాలనలో ఒక్కరికి ఉద్యోగం రాలేదు. యువతకు జాబ్ రావాలంటే మళ్లీ బాబు రావాలి. మద్యం ధర పెంచారు.. నాసిరకం బ్రాండ్లు తెచ్చారు.. పేదల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే జగన్‌ను సైకో అంటున్నాం" అని చంద్రబాబు మండిపడ్డారు.

'భవిష్యత్‌కు గ్యారెంటీ' పేరుతో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేస్తున్నామని ప్రకటించారు చంద్రబాబు. పేదవాళ్ల పక్షాన నిలిచేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. యువత, మహిళలు, రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 మహిళల ఖాతాల్లో వేస్తామన్నారు. "18 నుంచి 50 ఏళ్లు ఉన్న ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తాం. స్థానిక సంస్థల్లో పోటీకి పిల్లల నిబంధన ఎత్తివేస్తాం. ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణం. యువత కోసం 'యువగళం' కార్యక్రమం తెస్తాం. యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ. 3 వేలు అందజేస్తాం. కరోనా కాలంలోనూ పనిచేసిన ఏకైక వ్యక్తి.. అన్నదాత. అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తాం - బీసీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం - బీసీల అభివృద్ధికి నేను బాధ్యత తీసుకుంటా. బీసీలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తాం. పేదలను ధనికులుగా చేయడం నా సంకల్పం. రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే నా లక్ష్యం" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

టీ20 వరల్డ్ కప్ 2024