SIT On MLAs' poaching case: మరో ఇద్దరికి సిట్ నోటీసులు… వారి అరెస్ట్ తప్పదా..?
SIT Notices in MLAs' poaching case:ఎమ్మెల్యేల ఎర కేసులో మరో ఇద్దరికి నోటీసులు ఇచ్చింది సిట్. వీరిని ఇవాళ విచారించే అవకాశం ఉంది.
ఈ కేసులో ఇప్పటికే తుషార్ కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది సిట్. ఇంతకుముందే బీఎల్ సంతోష్ తో పాటు జగ్గుస్వామి కూడా నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని ఆదేశించింది. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటివరకు సిట్ విచారణకు రాలేదు. ఈ విషయంలో కోర్టును కూడా ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో.... ఇప్పటివరకు నోటీసులకే పరిమితమైన సిట్... అరెస్ట్‌ల దిశగానూ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
శ్రీనివాస్ పై ప్రశ్నల వర్షం...
ఈ కేసులో విచారణలో భాగంగా రెండు రోజులుగా కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సింహయాజీకి అభిమానంతోనే విమానం టికెట్ బుక్ చేశానని, అంతకు మించి ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని శ్రీనివాస్ తెలిపారు. రెండోరోజు విచారణకు హాజరైన ఆయన్ను దాదాపు 7గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ పూర్తయిన తర్వాత బయటకు వెళ్లే సమయంలో శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తనకు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. గతంలో పూజలు చేయించుకున్న క్రమంలో సింహయాజీ స్వామీజీతో పరిచయం ఏర్పడిందని, ఆ అభిమానంతోనే టికెట్ బుక్ చేసినట్టు తెలిపారు. సిట్ అధికారుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. నందకుమార్ తో ఫోన్ లో ఎందుకు మాట్లాడారని... ఆయనతో పరిచయంపై స్పందించలేదు. తర్వాత మాట్లాడుతానంటూ బదులిచ్చారు.
మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో దాదాపు ఆరు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరిగినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలతో కూడా నిందితులు చర్చించినట్లు ఫోన్ రికార్డుల ద్వారా వెలుగుచూసింది. వీటి ఆధారంగా సిట్ విచారణ ముమ్మరం చేస్తోంది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఈడీ, ఐటీ రైడ్స్ సంచలనంగా మారాయి. అధికార పార్టీ నేతలే టార్గెట్ గా దాడులు ఊపందుకున్నాయి. మొత్తంగా ఓవైపు సిట్ విచారణ… మరోవైపు ఈడీ, ఐటీ దాడులతో తెలంగాణలో దర్యాప్తు సంస్థల వ్యవహారం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య కూడా డైలాగ్ వార్ నడుస్తోంది.