MLAs Poaching Case: జడ్జి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు.. హైకోర్టు కీలక ఆదేశాలు-telangana high court key orders on trs mlas poaching case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlas Poaching Case: జడ్జి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు.. హైకోర్టు కీలక ఆదేశాలు

MLAs Poaching Case: జడ్జి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు.. హైకోర్టు కీలక ఆదేశాలు

HT Telugu Desk HT Telugu
Nov 16, 2022 06:58 AM IST

TS HC On MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సింగిల్‌ జడ్జి పర్యవేక్షణలో కొనసాగించడానికి ఉన్నత న్యాయస్థానం అనుమతించింది.

ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

TS High Court On MLAs Poaching Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) విచారణ హైకోర్టు సింగిల్‌ జడ్జి పర్యవేక్షణలోనే సాగాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం విచారణ జరిపిన కోర్టు... ఉత్తర్వులు జారీ చేసింది.ఈ దర్యాప్తు పురోగతి వివరాలను కోర్టుకు(సింగిల్‌ జడ్జికి) మాత్రమే సమర్పించాలని స్పష్టం చేసింది.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసును ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ నేతృత్వంలో నియమించిన సిట్‌ దర్యాప్తు జరపవచ్చని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాలు తప్ప మరే సంస్థ జోక్యమూ ఉండరాదని పేర్కొంది. ఎవరి ఆదేశాలూ పాటించరాదని సిట్‌కు తేల్చిచెప్పింది. కేసు దర్యాప్తు వివరాలను ఎగ్జిక్యూటివ్‌ అథారిటీకి గానీ, పొలిటికల్‌ అథారిటీకి గానీ వెల్లడించరాదని పేర్కొంది. దర్యాప్తు వివరాలను మీడియాకు అసలే చెప్పరాదని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తున కు సంబంధించి ఏమైనా అనుమతులు కావాలంటే సింగిల్‌ జడ్జి వద్ద పొందాలని తెలిపింది. ఈ మొత్తం కేసు దర్యాప్తును సింగిల్‌ జడ్జి పర్యవేక్షించాలని.. ఎప్పటికప్పుడు సిట్‌ సమర్పించే మెటీరియల్‌ను, దర్యాప్తు పురోగతిపై సీల్డ్‌ కవర్‌లో అందించే నివేదికలను పరిశీలించి తగిన ఆదేశాలు జారీచేయాలని పేర్కొంది. ఈ నెల 29న బీజేపీ, ఫాంహౌస్‌ కేసు నిందితులు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లను సింగిల్‌ జడ్జి ధర్మాసనం ముందు లిస్ట్‌ చేయాలని ఆదేశాలు జారీచేసింది. అదే రోజు సిట్‌ కేసు దర్యాప్తు పురోగతి నివేదికనూ సమర్పించాలని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం తీర్పునిచ్చింది.

ఎమ్మెల్యేలకు ఎర కేసులో స్టేను ఎత్తివేస్తూ.. పోలీస్‌ దర్యాప్తునకు అనుమతిస్తూ.. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను బీజేపీ హైకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ చిదంబరం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు.

పిటిషన్ తరపు న్యాయవాది వైద్యనాథన్ చిదంబరం వాదనలు వినిపిస్తూ... ఈ కేసుకు సంబంధించి సింగిల్‌ జడ్జి.. పిటిషన్‌ విచారణార్హత స్థాయిని తేల్చకుండానే మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేశారన్నారు. దాంతో పిటిషన్‌ నిష్ప్రయోజనం అయిందన్నారు. బీజేపీకి ఈ కేసుతో సంబంధం లేదని ప్రభుత్వం చెబుతోందని.. కానీ, ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలిస్తే పదేపదే ఆ పార్టీ పేరును ప్రస్తావించిన విషయం స్పష్టమవుతోందని వాదించారు. తాము దర్యాప్తును నిలిపివేయాలని కోరడంలేదని, మరో సంస్థకు అప్పగించాలని మాత్రమే అడిగామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపిస్తూ.. క్రిమినల్‌ కేసుల దర్యాప్తును అడ్డుకోరాదని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. బీజేపీ.. ఇతర రాష్ట్రాల్లో మంత్రులను అరెస్టు చేసి జైళ్లకు తరలించిందని, ఇక్కడ దర్యాప్తునే అడ్డుకుంటోందన్నారు. ఇన్ని ఆధారాలున్నా బాధ్యతాయుతమైన పార్టీ నిందితులకు అండగా నిలవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎమ్మెల్యేలను హైజాక్‌ చేసి వారి మనసులు మార్చి ప్రభుత్వాలను కూలగొడుతున్నారని.. అదే ప్రయత్నం తెలంగాణలోనూ జరుగుతోందన్నారు. నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించినా.. దర్యాప్తును నిలిపివేయాలన్న ఆదేశాలు రాలేదన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు.ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం సిట్‌ దర్యాప్తు కొనసాగించొచ్చని.. నివేదికను సింగిల్‌ జడ్జికి సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ముగించింది.

IPL_Entry_Point