MLAS Trap Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ నేతకు సిట్ పిలుపు....-bjp filed lunch motion pitition on sit notices to bjp leaders in mlas trap case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Bjp Filed Lunch Motion Pitition On Sit Notices To Bjp Leaders In Mlas Trap Case

MLAS Trap Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ నేతకు సిట్ పిలుపు....

HT Telugu Desk HT Telugu
Nov 19, 2022 11:20 AM IST

MLAS Trap Case: టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన వ్యవహారంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం- సిట్‌ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మరబెట్టు లక్ష్మీ జనార్ధన సంతోష్‌కు సిట్ అధికారులు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు.

సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ
సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ (HT)

MLAS Trap Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో వివరాలు తెలిపేందుకు కమాండ్ కంట్రోల్‌లోని సిట్ కార్యాలయంలో ఈనెల 21న ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే అరెస్టు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బీఎల్‌ సంతోష్ కర్ణాటకలోని ఉడుపి ప్రాంతానికి చెందిన వారు కాగా, బెంగళూరులోని మల్లేశ్వరం, టెంపుల్ స్ట్రీట్ పేరుతో సిట్ నోటీసులు జారీ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

అక్టోబర్ 26న మోయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో భేటీ సందర్భంగా నిందితుడు రామచంద్రభారతి పలువురు ము‌ఖ్య నాయకుల పేర్లను ఉటంకించారు. నంబర్1 నంబర్ 2 అంటూ మాట్లాడటంతో పాటు బీజేపీ అగ్ర నాయకులు బీఎల్‌ సంతోష్‌, సునీల్ కుమార్ బన్సల్, కేరళ నాయకులు తుషార్‌ పేర్లను ప్రస్తావించాడు. తుషార్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. తాజాగా బీఎల్‌ సంతోష్‌కు నోటీసులు జారీ చేశారు.

విచారణకు వచ్చే సమయంలో 9449831415 నంబరు సిమ్‌ కార్డుతో ఉన్న ఫోన్‌ తమ వెంట తీసుకురావాలని పోలీసులు పేర్కొనడం గందరగోళానికి దారి తీసింది. బిల్‌.సంతోష్‌తో పాటు, శ్రీనివాస్‌కు ఇచ్చిన నోటీసుల్లో ఒకే ఫోన్‌ నంబర్‌, ఒకే ఐఎంఇఐ నంబర్‌ను పోలీసులు ఉటంకించారు.

మరోవైపు ఫామ్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో “సంతోష్‌ను ఆరెస్సెస్‌లో కీలక నాయకుడని” రామచంద్రభారతి ప్రస్తావించారు. సంతోష్‌ చాలా కీలకమైన నాయకుడని, ఆయన ఇంటికి నంబర్ 1,2లు సైతం వస్తుంటారని, ఆయన వారి దగ్గరకు వెళ్లరని చెప్పారు. అది తమ సంస్థలో ప్రోటోకాల్‌గా పేర్కొన్నారు. మంత్రులు కూడా ఆయన అపాయింట్‌మెంట్‌ తీసుకోవాల్సిందేనని, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉంటే తప్ప ఆయనకు ఫోన్‌ చేసి రమ్మనడం సాధ్యపడదని రామచంద్రభారతి ఎమ్మెల్యేలకు చెప్పారు.

"పేమెంట్‌తో ఎలాంటి ఇబ్బంది లేదని రామచంద్రబారతి చేసిన వ్యాఖ్యలు రహస్య కెమెరాలలో చిక్కాయి. రామచంద్రభారతి ఫోన్‌లో సంతోష్ బీజేపీ పేరుతో ఉన్న కాంటాక్టుకు ఇంగ్లీష్‌లో పంపిన మెసేజీలను సిట్ గుర్తించింది. “తనను తాను పరిచయం చేసుకున్న రామచంద్రభారతి, హరిద్వార్ బైఠక్‌లో కలిసినట్లు పేర్కొన్నాడు. తెలంగాణలో కీలక అంశాలను చర్చించాలని, 25మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, మొత్తం 40మంది తాను చెప్పేది వింటారని మెసేజీలు పంపారు. గతంలో తాను చెప్పినట్లు పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావులు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారాన్ని పంపారు. పార్టీలో చేరే ముందు ఎమ్మెల్యేలకు కొంత విటమిన్ కావాలని మెసేజ్ పంపారు.” సంతోష్ నుంచి రామచంద్రభారతికి ఎలాంటి బదులు రాలేదు.

మరోవైపు ఇదే కేసులో పరారీలో ఉన్న కేరళ వైద్యుడు జగ్గుస్వామి కోసం ఐదారు రోజులుగా సిట్ గాలిస్తోంది. అతని అచూకీ లభించకపోవడంతో నోటీసులు జారీ చేశారు. సిట్ సభ్యురాలు, నల్గొండ ఎస్సీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలోని బృందాలు కొచ్చి, కొల్లంలలో గాలించినా నిందితుడు దొరకలేదు. దీంతో అతను పనిచేసే ఆస్పత్రిలో నోటీసులు జారీ చేశారు. 21న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.ఇదే కేసులో కరీంనగర్‌కు చెందిన న్యాయవాది, ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బంధువు, శ్రీనివాస్‌కు కూడా నోటీసులు జారీ చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలోని సిట్‌ కార్యాలయంలో ఈనెల 21నే విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. వీరిద్దరిని సిట్‌ అధికారులు ఒకే సమయానికి విచారించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధంలేని వారికి వేధింపులు….

మరోవైపు సిట్‌ నోటీసులపై భాజపా హైకోర్టులో మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసింది. భాజపా తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. బి.ఎల్‌. సంతోష్‌, న్యాయవాది శ్రీనివాస్‌కు నోటీసులు ఇచ్చిన విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వారిని ఇరికించేందుకు సిట్‌ నోటీసులిచ్చి వేధిస్తోందని పేర్కొన్నారు. వీటిపై స్టే ఇవ్వాలని కోరారు. కేసుకు సంబంధం లేని వారికి నోటీసులు ఇచ్చారని బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఎనిమిది మందికి నోటీసులు ఇవ్వడాన్ని తప్పు పట్టింది. ఎనిమిది మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసులో సంతోష్‌, శ్రీనివాస్‌లకు సంబంధం లేదని బీజేపీ చెబుతోంది.

WhatsApp channel