Hanumakonda District : గొర్ల మంద వద్ద గొడవ.. గొడ్డలితో నరికి చంపిన యజమాని
Hanumakonda district Crime News:గొర్ల మంద వద్ద జరిగిన గొడవలో ఓ వ్యక్తిపై గొర్ల యజమాని గొడ్డలితో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది.
Hanumakonda district Crime News: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో దారుణ హత్య జరిగింది. గొర్ల మంద వద్ద జరిగిన గొడవలో ఓ వ్యక్తిపై గొర్ల యజమాని గొడ్డలితో దాడిచేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిపేట గ్రామానికి చెందిన దద్దు రాజయ్య, అతని కొడుకు మహేందర్, మరికొందరితో కలిసి తమకున్న గొర్లతో పొలం వద్ద మంద పెట్టారు. రోజులాగే మంగళవారం కూడా మంద పెట్టి, రాత్రి 8 గంటల సుమారులో భోజనం కోసం ఇండ్లకు వెళ్లారు. తిరిగి మంద వద్దకు వస్తున్న క్రమంలో గొర్లు బెదురుతూ కనిపించాయి. అప్పటికే గొర్ల కాపరుల కుక్కలు కూడా వారిని చుట్టుముట్టాయి. పరీక్షించి చూడగా.. గొర్ల మంద సమీపంలో ఎల్కతుర్తి గోపాలపూర్‌కు చెందిన గండికోట లక్ష్మణ్, గండికోట శేఖర్, సూర శ్రీకాంత్, గండికోట రమేశ్ అనే నలుగురు వ్యక్తులు కనిపించారు. దీంతో దొంగలుగా అనుమానించి వారిని దద్దు రాజయ్య, అతని కొడుకు మహేందర్ పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ శేఖర్, శ్రీకాంత్, రమేశ్ అక్కడి నుంచి తప్పించుకుని పరారు కాగా.. లక్ష్మణ్ ఒక్కడే వారికి చిక్కాడు. దీంతో లక్ష్మణ్, మహేందర్‌కు తీవ్ర గొడవ జరిగింది.
గొడవ తీవ్రం కావడం, తన కొడుకుకు దెబ్బలు తగలడంతో మహేందర్ తండ్రి రాజయ్య తమ వద్ద ఉన్న గొడ్డలితో లక్ష్మణ్ పై దాడి చేశారు. గొడ్డలి లక్ష్మణ్ తల, గొంతు భాగంలో తగలడంతో తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. దీంతో ఆయన ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్ బాడీని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. హత్య అనంతరం రాజయ్య పోలీసుల ఎదుట లొంగిపోయారు. కాగా మృతుడు లక్ష్మణ్ భార్య కల్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ధర్మసాగర్ పోలీసులు తెలిపారు.