Hyderabad Metro Rail : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం రాత్రి 12:15 గంటల వరకు మెట్రో రైలు సేవలు నడుస్తాయని ఆయన వెల్లడించారు. చివరి మెట్రో రైళ్లు రాత్రి 12:15 గంటలకు బయలుదేరి ఒంటి గంటకు గమ్యస్థానాలకు చేరుతాయని వెల్లడించారు. ప్రతీ మెట్రో రైలు, మెట్రో స్టేషన్ లలో మెట్రో భద్రతా సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని ఆయన తెలిపారు.మెట్రో స్టేషన్ లోకి మద్యం సేవించి రావొద్దని హెచ్చరించారు. అలాంటి వారు ఎవరైనా వేస్తే ట్రైన్ ఎక్కేందుకు భద్రతా సిబ్బంది అనుమతించరని తెలియచేశారు. మెట్రో పరిధిలో ఎవరితో దుర్బాషలాడినా, ఎవరినైనా వేధించిన కఠిన చర్యలు తీసుకుంటామని మెట్రో ఎండీ ప్రయాణికులను హెచ్చరించారు. ప్రయాణికులు అంతా బాధ్యతగా వ్యవహరించి మెట్రో సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.
మరోవైపు నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై మూడు కమిషనరేట్ ల పరిధిలో పోలీసులు నిఘా పెంచారు. పోలీసులు నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే భారీ నగదు జరిమానాతో పాటు కఠిన శిక్షలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే వారి లైసెన్స్ సస్పెండ్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఇటు న్యూ ఇయర్ వేడుకల కోసం అనుమతి తీసుకుని జరుపుతున్న ఈవెంట్లపై కూడా పోలీసులు నిఘా ఉంచారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ లో బ్రీత్ అనలైజర్ తరహాలోనే ఈసారి కొత్తగా డ్రగ్ డిటెక్టివ్ కిట్ తో పోలీసులు వాహనదారులను టెస్ట్ చేయనున్నారు.
సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. ఆదివారం రాత్రి సైబరాబాద్ పరిధిలో అన్నీ ఫ్లైఓవర్ లు, ఓఅర్అర్ పై వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలకు ఫ్లైఓవర్లపై అనుమతి లేదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే యజమానిపై కఠిన చర్యలు తప్పవన్నారు. సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తూ
వాహనాలు నడిపిన వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని అవినాష్ మహంతి హెచ్చరించారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా