Bandi Sanjay On BRS: ఇక కేసీఆర్ కు మాట్లాడే అర్హత లేదు - బండి సంజయ్-bjp state president bandi sanjay comments on brs formation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Bjp State President Bandi Sanjay Comments On Brs Formation

Bandi Sanjay On BRS: ఇక కేసీఆర్ కు మాట్లాడే అర్హత లేదు - బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Dec 09, 2022 06:14 PM IST

bandi sanjay comments on kcr: బీఆర్ఎస్ ఏర్పాటుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఆవిర్భావ సభలా లేదన్న ఆయన... సంతాప సభలా ఉందంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై కూడా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

Bandi Sanjay Comments on BRS Formation: బీఆర్ఎస్ ఆవిర్భావంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. అది ఆవిర్భావ సభలా లేదు... సంతాప సభలా ఉందంటూ కామెంట్స్ చేశారు. పార్టీ పేరు నుంచి, జెండా నుంచి తెలంగాణను తీసేశారని దుయ్యబట్టారు. మెట్ పల్లిలో శుక్రవారం మాట్లాడిన ఆయన... బెంగళూరు లో డిపాజిట్ రాని వాళ్ళను ఆహ్వానించారని... ఎద్దేవా చేశారు. పార్టీ ప్రారంభించినప్పుడే ఏం చేస్తాడో చెప్పాలి కానీ... కేసీఆర్ అలా చేయలేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు

పచ్చి సమైక్యవాది అయిన ఉండవల్లిని తీసుకొచ్చి, దావత్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అంటూ బండి సంజయ్ ఆక్షేపించారు. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తెరపైకి తీసుకువస్తున్నారని.. తెలంగాణ మీద మాట్లాడే అర్హత కేసీఆర్ కోల్పోయాడని అన్నారు. బీఆర్ఎస్ అంటే... బందిపోట్ల రాష్ట్ర సమితి అని మండిపడ్డారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిన చరిత్ర కేసీఆర్ ది అని వ్యాఖ్యానించారు.

"పంజాబ్ లో రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లని పరిస్థితి ఉంది. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చాడు? కేసీఆర్ కుటుంబం దోచుకుతిన్నది. కేసీఆర్ బిడ్డ కవిత ఢిల్లీలో లిక్కర్ దందా చేసింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ లిక్కర్ దందా చేస్తుందేమో చూడాలి. బిడ్డ లిక్కర్ దందా పక్కకు పోయేందుకే... BRS పార్టీ అంటూ నాటకాలు చేస్తున్నారు. జాతీయ పార్టీ పెడితే... విధివిధానాలు ఉండాలి. కేవలం తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. గుజరాత్ లో బిజెపి గ్రాండ్ విక్టరీ నుంచి, ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ ప్రకటన చేశారు. 'బీఆర్ఎస్' ఎప్పటికీ 'బంధిపోట్ల రాష్ట్ర సమితి' నే. కృష్ణా జలాల్లో తెలంగాణకు ద్రోహం చేసిండు. తెలంగాణకు 575 టీఎంసీ లు రావాల్సి ఉంటే...299 టీఎంసీలకే సంతకం చేసి, తెలంగాణ నోట్లో మన్ను కొట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టు లో కోట్లు దండుకున్నాడు. కమీషన్ల విషయంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల ఒప్పందం కుదిరినట్లు ఉంది. రెండు రాష్ట్రాల నాయకులు కుట్రలతో సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ వి అన్నీ బూటకపు వాగ్దానాలే" అని బండి సంజయ్ ఘాటుగా విమర్శించారు.

కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారని బండి సంజయ్ ప్రశ్నించారు.? కాషాయ జెండా కాంతిలో రంగురంగుల జెండాలు మాడి మసైపోతాయన్నారు.

IPL_Entry_Point