Bandi Sanjay : బైంసాలో బండి సంజయ్ బహిరంగ సభ….-bandi sanjay 5th phase praja sangrama public meeting in bhaimsa ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay : బైంసాలో బండి సంజయ్ బహిరంగ సభ….

Bandi Sanjay : బైంసాలో బండి సంజయ్ బహిరంగ సభ….

HT Telugu Desk HT Telugu
Nov 29, 2022 01:12 PM IST

Bandi Sanjay తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ప్రారంభమైంది. భైంసాలో మంగళవారం బహిరంగ సభ నిర్వహించనున్నారు. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతినివ్వడంతో బండి సంజయ్ భైంసా నుంచి యాత్రను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. బండి సంజయ్ యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో కోర్టు అనుమతితో మంగళవారం నుంచి యాత్రను చేపడుతున్నారు.

ఐదో విడత బండి సంజయ్ పాదయాత్ర
ఐదో విడత బండి సంజయ్ పాదయాత్ర (twitter)

Bandi Sanjay తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న ఎట్టకేలకు ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను హైకోర్టు ఇచ్చిన షరతులకు లోబడి ప్రారంభించారు. సోమవారం రాత్రి నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని అడెల్లి మహా పోచమ్మకు ప్రత్యేక పూజలు చేసిన బండి సంజయ్ పాద యాత్రను మొదలుపెట్టారు. మంగళవారం మధ్యాహ్నం 1.30కి భైంసా శివారులో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. నిర్మల్ నేషనల్ హైవే పక్కన ఉన్న గణేశ్ ఇండస్ట్రీ ప్రాంగణంలో సభ నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బైంసాలో నిర్వహించే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా భైంసా బాధితులతో బండి సంజయ్ మాటామంతి నిర్వహించారు. భైంసా మతఘర్షణల్లో ఇండ్లు కాలిపోయి, సర్వస్వం కోల్పోయిన 30 బాధిత కుటుంబాలతో బండి సంజయ్ భేటీ అయ్యారు. బాధిత కుటుంబాల కష్టసుఖాలను, వారి ఆర్ధిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. భైంసా అల్లర్ల సంఘనను గుర్తు చేసుకుని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులను ఓదార్చిన బండి సంజయ్, వారికి అండగా ఉంటామని ప్రకటించారు. తమపైనే దాడి చేసి, తమపైనే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, తీవ్రంగా వేధించారని భైంసా బాధితులు ఆరోపించారు. భైంసా అల్లర్ల సమయంలో తమకు బీజేపీ అండగా నిలిచిందని బాధితులు బండి సంజయ్‌కు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం తమను ఆదుకోక పోగా, ఇప్పటికీ వేధింపులకు పాల్పడుతోందని బాధితులు ఆరోపించారు.

హైకోర్టు షరతులు….

పాదయాత్ర ప్రారంభించకుండా ఆదివారం రాత్రి పోలీసులు బండి సంజయ్‌ని అడ్డుకోవడంతో సోమవారం బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు. భైంసా సిటీకి 3 కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహించు కోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. భైంసా సిటీ లోపలి నుంచి పాదయాత్ర వెళ్లకూడదని, 3వేల మందికి మించి యాత్రలో పాల్గొనరాదని, ఆయుధాలు ధరించరాదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మతపరమైన ఉద్రిక్తతలకు తావివ్వకూడదని సూచించింది. హైకోర్టు షరతులకు అంగీకరించిన బీజేపీ నేతలు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకున్నారు.

బైంసాలో కొనసాగుతున్న 144 సెక్షన్….

మరోవైపు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రాయ యాత్రతో ఉద్రిక్తతలు తలెత్తుతాయని భావించి తెలంగాణ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో 144 సెక్షన్ అమల్లో ఉంది. యాత్ర నేపథ్యంలో అమల్లోకి తెచ్చిన ఆంక్షలను అమల్లో ఉంచుతున్నారు. భైంసాలో భారీగా పోలీసులు మోహరించారు. నగర శివార్లలో యాత్ర నిర్వహిస్తుండటంతో శాంతి భద్రతలకు ఎలాంటి సమస్యా రాదని భావిస్తున్నారు.

ఐదో విడత పాదయాత్ర సాగుతుందిలా….

బండి సంజయ్‌ ఐదో విడత పాదయాత్ర భైంసా నుంచి కరీంనగర్ వరకు సాగనుంది. 20 రోజుల పాటు 222 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. 5 జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో యాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 17వ తేదీ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 14,15,16 తేదీలో చొప్పదండిలో యాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 16,17 తేదీల్లో యాత్రను ముగించాలని నిర్ణయించారు.