Shoaib Malik Ayesha Omar: సానియాకు విడాకులు.. పాకిస్థాన్‌ నటితో షోయబ్‌ మాలిక్‌ పెళ్లి?-shoaib malik ayesha omar getting married this is what ayesha has to say ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shoaib Malik Ayesha Omar: సానియాకు విడాకులు.. పాకిస్థాన్‌ నటితో షోయబ్‌ మాలిక్‌ పెళ్లి?

Shoaib Malik Ayesha Omar: సానియాకు విడాకులు.. పాకిస్థాన్‌ నటితో షోయబ్‌ మాలిక్‌ పెళ్లి?

Hari Prasad S HT Telugu
Dec 02, 2022 02:07 PM IST

Shoaib Malik Ayesha Omar: సానియాకు విడాకులు ఇచ్చి పాకిస్థాన్‌ నటి అయేషా ఒమర్‌ను షోయబ్‌ మాలిక్‌ పెళ్లి చేసుకోబోతున్నాడా? విడాకుల కంటే ఈ పెళ్లి వార్తలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. దీనిపై ఆ నటి కూడా స్పందించింది.

అయేషా ఒమర్, సానియా మీర్జా, షోయబ్ మాలిక్
అయేషా ఒమర్, సానియా మీర్జా, షోయబ్ మాలిక్

Shoaib Malik Ayesha Omar: ఇండియన్‌ ఏస్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాతో తెగదెంపులు చేసుకొని పాకిస్థాన్‌ నటిని షోయబ్‌ మాలిక్‌ పెళ్లాడబోతున్నాడా? ఇప్పుడీ వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. సానియాకు షోయబ్‌ విడాకులు ఇస్తున్నాడని కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్‌ నటి అయేషా ఒమర్‌ను షోయబ్‌ పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు రావడం సంచలనం రేపుతోంది.

నిజానికి ఈ పుకార్లపై అయేషా స్పందించింది. తాను షోయబ్‌, సానియాలను చాలా గౌరవిస్తానని చెప్పింది. అంతేకాదు షోయబ్‌ను పెళ్లి చేసుకునే ఆలోచన తనకేమీ లేదని కూడా ఆమె చెప్పడం విశేషం. గత నెలలోనే సానియాతో షోయబ్‌ విడిపోతున్నట్లు చాలా వార్తలు వచ్చాయి.

ఈ సందర్భంగా పాక్‌ అయేషాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అభిమాని ప్రశ్నిస్తూ.. షోయబ్‌ను పెళ్లి చేసుకోబోతున్నావా అని అడిగారు. దీనికి అయేషా కూడా సమాధానమిచ్చింది. "అలాంటిదేమీ లేదు. అంతా ఉత్తదే. అతనికి పెళ్లయింది. భార్యతో సంతోషంగా ఉన్నాడు. నేను షోయబ్‌, సానియాలను చాలా గౌరవిస్తాను" అని అయేషా ఆ అభిమానితో చెప్పింది.

"షోయబ్‌, నేను మంచి స్నేహితులం. ఇద్దరం ఒకరి జాగ్రత్తలు మరొకరం చూసుకుంటాం. ప్రపంచంలో వ్యక్తుల మధ్య ఇలాంటి బంధాలు కూడా ఉంటాయి" అని కూడా అయేషా చెప్పింది. గత నెలలో సానియా, షోయబ్‌ విడాకుల వార్త బయటకు వచ్చిన తర్వాత సానియాకు బర్త్‌డే విషెస్‌ చెప్పాడు షోయబ్‌. "హ్యాపీ బర్త్‌డే సానియా. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా" అని షోయబ్ అన్నాడు.

ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి మీర్జామాలిక్‌ టాక్‌ షో కూడా చేస్తున్నట్లు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉర్దుఫ్లిక్స్‌ అనౌన్స్‌ చేసింది. దీంతో ఈ ఇద్దరి విడాకుల పుకార్లు అక్కడితో ఆగిపోయాయి. షోయబ్‌, సానియా 2010లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచీ దుబాయ్‌లో ఉంటున్నారు. వీళ్లకు 2018లో ఓ కొడుకు పుట్టాడు. అతని పేరు ఇజాన్‌.

WhatsApp channel