PV Sindhu: సింధు, లక్ష్యసేన్‌లను ఆకాశానికెత్తిన రాష్ట్రపతి, ప్రధాని-president and pm congratulate pv sindhu and lakshya sen on winning cwg 2022 gold ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pv Sindhu: సింధు, లక్ష్యసేన్‌లను ఆకాశానికెత్తిన రాష్ట్రపతి, ప్రధాని

PV Sindhu: సింధు, లక్ష్యసేన్‌లను ఆకాశానికెత్తిన రాష్ట్రపతి, ప్రధాని

Hari Prasad S HT Telugu
Aug 08, 2022 05:17 PM IST

PV Sindhu: కామన్వెల్త్ గేమ్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల, పురుషుల సింగిల్స్‌లో రెండు గోల్డ్‌ మెడల్స్‌ అందించిన పీవీ సింధు, లక్ష్యసేన్‌లను ఆకాశానికెత్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ.

<p>గోల్డ్ మెడల్ తో లక్ష్య సేన్</p>
గోల్డ్ మెడల్ తో లక్ష్య సేన్ (REUTERS)

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌లో ఇండియా ఆధిపత్యాన్ని కామన్వెల్త్ గేమ్స్‌లోనూ కొనసాగించారు మన స్టార్‌ షట్లర్లు. అటు మహిళల, ఇటు పురుషుల సింగిల్స్‌ రెండింట్లోనూ గోల్డ్‌ మెడల్స్‌ గెలిచి చరిత్ర సృష్టించారు. మొదట మహిళల సింగిల్స్‌లో సింధు గెలవగా.. తర్వాత లక్ష్యసేన్‌ కూడా గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. దీంతో ఈ ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్పారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ.

"కామన్వెల్త్‌ గేమ్స్‌లో చారిత్రక బ్యాడ్మింటన్‌ గోల్డ్‌ గెలిచి పీవీ సింధు దేశ ప్రజల మనసును గెలుచుకుంది. నువ్వు కోర్టులో మ్యాజిక్‌ చేసిన కోట్లాది మందిని పరవశింపజేశావు. నీ విజయం తిరంగాను సగర్వంగా ఎగిరేలా చేసింది. బర్మింగ్‌హామ్‌లో మన జాతీయ గీతం వినిపించింది. మనఃపూర్వక శుభాకాంక్షలు" అని సింధుని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ట్వీట్‌ చేశారు.

అటు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. "పీవీ సింధు ఛాంపియన్లకే ఛాంపియన్‌. అసలు సమర్థత అంటే ఏంటో ఆమె మళ్లీ మళ్లీ నిరూపిస్తూనే ఉంది. ఆమె అంకితభావం, నిబద్ధత ఎంతో స్ఫూర్తిదాయకమైంది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆమె గోల్డ్‌ గెలిచినందుకు శుభాకాంక్షలు. భవిష్యత్తు కోసం ఆల్‌ద బెస్ట్‌" అని అన్నారు.

ఇక ఆ వెంటనే పురుషుల సింగిల్స్‌లోనూ ఇండియాకు గోల్డ్‌ మెడల్‌ అందించిన లక్ష్యసేన్‌ను ఉద్దేశించి కూడా రాష్ట్రపతి ద్రౌపది మరో ట్వీట్‌ చేశారు. "యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ లక్ష్యసేన్‌ ఇండియాను గర్వపడేలా చేశాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియాకు గోల్డ్‌ మెడల్ అందించినందుకు శుభాకాంక్షలు. నువ్వు వెనుకబడినా తిరిగి పుంజుకున్న తీరు చూస్తుంటే విజయం సాధించడానికి ఈ సరికొత్త ఇండియా ఎంతలా కృతనిశ్చయంతో ఉందో తెలుస్తోంది. బర్మింగ్‌హామ్‌లో మరోసారి మన త్రివర్ణపతాకాన్ని రెపరెపలాడించావు" అని ట్వీట్‌ చేశారు.

Whats_app_banner