Portugal vs Switzerland: స్విస్‌ను చిత్తు చేసిన పోర్చుగల్.. హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించిన రామోస్-portugal defeat switzerland in fifa world cup 2022 round of 16 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Portugal Vs Switzerland: స్విస్‌ను చిత్తు చేసిన పోర్చుగల్.. హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించిన రామోస్

Portugal vs Switzerland: స్విస్‌ను చిత్తు చేసిన పోర్చుగల్.. హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించిన రామోస్

Maragani Govardhan HT Telugu
Dec 07, 2022 07:27 AM IST

Portugal vs Switzerland: ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌లో స్విట్జర్లాండ్ జట్టును 6-1 తేడాతో చిత్తు చేసింది పోర్చుగల్ జట్టు. ఈ మ్యాచ్‌లో పోర్చుగీస్ ఆటగాడు గొంకలో రామోస్ 3 గోల్స్‌తో అదరగొట్టాడు. రొనాల్డో స్థానంలో వచ్చిన అతడు అదిరిపోయే ప్రదర్శన చేశాడు.

స్విట్జర్లాండ్‌పై పోర్చుగల్ విజయం
స్విట్జర్లాండ్‌పై పోర్చుగల్ విజయం (AFP)

Portugal vs Switzerland: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌‌లో పోర్చుగల్ జట్టు అదరగొట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్విట్జర్లాండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌‍లో 6-1 తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. పోర్చుగీస్ ఆటగాడు గోంకలో రామోస్ మూడు గోల్స్‌తో స్విస్ జట్టును వణికించాడు. మ్యాచ్ ఆద్యంతం దూకుడుగా ఆడిన పోర్చుగల్ ఆటగాళ్లు స్విట్జర్లాండ్‌ను చిత్తు చేశారు. క్రిస్టియానో రొనాల్డో లాంటి స్టార్ ఆటగాడి స్థానంలో రామోస్‌కు అవకాశమిచ్చిన పోర్చుగల్ కోచ్ ఫెర్నాండో శాంటోస్ వ్యూహాలు చక్కగా ఫలించాయి. రామోస్ 3 గోల్స్‌తో విజృంభించి జట్టుకు అదిరిపోయే విజయాన్ని అందించాడు.

మ్యాచ్ ప్రారంభమైన 17వ నిమిషంలోనే రామోస్ జావో ఫెలిక్స్ ఇచ్చిన పాస్‌ను నేరుగా గోల్ పోస్టులోకి నెట్టడంతో పోర్చుగల్ ఖాతాలో తొలి గోల్ నమోదైంది. అనంతరం 33 నిమిషాల వద్ద బ్రూనో ఫెర్నాండేస్ ఇచ్చిన పాస్‌ను అందిపుచ్చుకున్న పీప్ హెడ్ షాట్‌తో కళ్లు చెదిరే గోల్ చేశాడు. దీంతో 2-0 తేడాతో లీడ్‌లోకి వెళ్లింది పోర్చుగల్. ఇక రెండో అర్ధభాగంలో 51 నిమిషాల వద్ద రామోస్ మరో గోల్ కొట్టి 3-0 తేడాతో తన జట్టును మరింత ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ కాసేపటికే 55వ నిమిషాల వద్ద రామోస్ నుంచి బంతి అందుకున్న రాఫెల్ గెరీరో గోల్ చేయడంతో పోర్చుగల్ తన లీడ్ 4-0తో మరింత పెంచుకుంది.

ఓ పక్క పోర్చుగల్ జట్టు వరుసగా గోల్స్ చేస్తూ దూసుకెళ్తుంటే.. స్విస్ జట్టు మాత్రం వారి దూకుడుకు కళ్లెం వేయలేకపోయింది. అత్యధిక పాస్‌లతో బంతిని ఎక్కువగా తమ వద్దే ఉంచుకున్నప్పటికీ ఎక్కువ గోల్స్ చేయడంలో మాత్రం విఫలమైంది. 58వ నిమిషంలో మ్యానువల్ అకంజీ గోల్ చేయడంతో స్విస్ జట్టు ఖాతా తెరిచింది.

ఇక 67వ నిమిషంలో మరోసారి రామోస్ విజృంభించడంతో పోర్చుగల్ 5-1 తేడాతో మరింత ముందుకు వెళ్లింది. మ్యాచ్ అదనపు సమయంలో రాఫెల్ లియో గోల్ చేయడంతో 6-1 తేడాతో పోర్చుగల్ విజయం సాధించింది. ఫలితంగా స్విట్జర్లాండ్ ఈ టోర్నీలో తన ప్రయాణాన్ని ముగించింది. తదుపరి మ్యాచ్‌ను పోర్చుగల్.. మొరాకోతో ఆడనుంది.

WhatsApp channel

సంబంధిత కథనం