Wimbledon 2022: వింబుల్డన్ ఫైనల్‌లో జకోవిచ్.. సెమీస్‌లో బ్రిటీష్ స్టార్‌పై విజయం
వింబుల్డన్ ఫైనల్‌కు మరోసారి సెర్బియా స్టార్ జకోవిచ్ అడుగుపెట్టాడు. శుక్రవారం రాత్రి జరిగిన సెమీస్‌లో బ్రిటీష్ ఆటగాడు కేమరన్ నొర్రీపై విజయం సాధించి 8వ సారి వింబుల్డన్ ఫైనల్‌కు చేరాడు. తుదిపోరులో నిక్ కిర్గియోస్‌తో తలపడనున్నాడు.
ప్రతిష్టాత్మక వింబుల్డన్-2022లో సెర్బియా స్టార్ జకోవిచ్ అదరగొట్టాడు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 8వ సారి ఈ టోర్నీ ఫైనల్‌కు చేరి అరుదైన రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా 32వ సారి గ్రాండ్ స్లామ్ ఫైనల్‌కు చేరి పాత రికార్డులను బద్దలు కొట్టాడు. శుక్రవారం రాత్రి జరిగిన సెమీఫైనల్‌లో బ్రిటన్‌కు చెందిన కేమరూన్ నొర్రీని ఓడించి తుదిపోరుకు అర్హత సాధించాడు. ఇప్పటి వరకు 8 సార్లు వింబుల్డన్ ఫైనల్‌కు చేరిన జకో.. 7వ టైటిల్ కోసం సమయాత్తమయ్యాడు.
మ్యాచ్ ఆరంభంలో ప్రత్యర్థి బలమైన పోటీనిచ్చాడు. ఫలితంగా జకోవిచ్ తొలి సెట్‌ను కోల్పోయాడు. అనంతరం వేగంగా పుంజుకున్న సెర్బియన్.. ఏమాత్రం ప్రత్యర్థికి అవకాశమివ్వలేదు. వరుస పెట్టి పాయింట్లు, గేమ్లు సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఫలితంగా 2-6, 6-3, 6-2, 6-4 తేడాతో విజయాన్ని అందుకోని ఈ టోర్నీలో 8వ సారి ఫైనల్‌కు చేరుకున్నాడు. నొర్రీపై తన వ్యూహాలను కచ్చితంగా అమలు చేసిన జకో.. మ్యాచ్‌లో ఆద్యంతం పైచేయి సాధించాడు.
తొలి సెట్‌లో 2-6 తేడాతో వెనకంజలో ఉన్న జకో.. అనంతరం ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వలేదు. సెర్బియన్ స్టార్ ముందు బ్రిటన్ ఆటగాడు నిలువలేకపోయాడు. పదే పదే తప్పులు చేయడం, 2, 3 సెట్లలో జకో పూర్తి స్థాయి ఆధిపత్యం కారణంగా నోర్రీ మ్యాచ్‌ను సమర్పించుకోవాల్సి వచ్చింది. చివరి సెట్‌లో తన రిథమ్‌ను తిరిగి పుంజుకుని గట్టిగా పోరాడినప్పటికీ జకో మాత్రం అవకాశమివ్వలేదు. ఫలితంగా ప్రత్యర్థి 4-6 తేడాతో ఓటమిని చవిచూశాడు.
విజయానంతరం మీడియాతో మాట్లాడిన జకో.. తాను తొలి సెట్‌లో పెద్దగా ప్రదర్శన చేయలేకపోయానని, బాల్‌ను సరిగ్గా అంచనా వేయలేక పోయానని, అందుకే ఆ సెట్‌లో అతడు గెలిచాడని తెలిపాడు. ఇప్పటి వరకు జరిగిన పోటీల్లో ఇదే అత్యంత రసవత్తరంగా సాగిన రోజని, ఇది ప్రారంభంలోనే తనపై ప్రభావం చూపిందని చెప్పాడు.
ఆదివారం జరగనున్న వింబుల్డన్ ఫైనల్‌లో నిక్ కిర్గియోస్‌తో జకోవిచ్ తలపడనున్నాడు. మరో సెమీస్ పోటీ రఫెల్ నాదల్-నిక్ కిర్గియోసే మధ్య జరగాల్సి ఉండగా.. నాదల్ సెమీస్‌కు ముందు పోటీల నుంచి తప్పుకున్నాడు. దీంతో నిక్ డైరెక్టుగా ఫైనల్‌కు చేరుకున్నాడు.
జకోవిచ్ తన కెరీర్‌లో 32వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు అడుగు పెట్టి ఈ ఘనత సాధించిన తొలి టెన్నిస్ స్టార్‌గా రికార్డు సృష్టించాడు. అతడి తర్వాత స్థానంలో రోజర్ ఫెదరర్(31), రఫెల్ నాదల్(30), ఇవాన్ లెండిల్(19), పీట్ సంప్రాస్(18) ఉన్నారు. వింబుల్డన్‌లో 8వ సారి తుదిపోరుకు చేరాడు. ఇందులో గెలిస్తే 7వ సారి టైటిల్‌ను కైవసం చేసుకుంటాడు.
సంబంధిత కథనం
టాపిక్