LSG vs MI | హోమ్‌గ్రౌండ్‌లోనూ మారని ముంబై రాత.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఘన విజయం-lucknow super giants beat mumbai indians in their home ground in ipl 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Lsg Vs Mi | హోమ్‌గ్రౌండ్‌లోనూ మారని ముంబై రాత.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఘన విజయం

LSG vs MI | హోమ్‌గ్రౌండ్‌లోనూ మారని ముంబై రాత.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఘన విజయం

Hari Prasad S HT Telugu
Apr 24, 2022 11:36 PM IST

హోమ్‌గ్రౌండ్‌ వాంఖడెలోనూ ముంబై ఇండియన్స్‌ రాత మారలేదు. ఐపీఎల్‌ 2022లో ఆడిన 8వ మ్యాచ్‌లోనూ ఆ టీమ్‌ ఖాతా తెరవలేదు.

విజయంతో మళ్లీ గాడిలో పడిన లక్నో సూపర్ జెయింట్స్
విజయంతో మళ్లీ గాడిలో పడిన లక్నో సూపర్ జెయింట్స్ (IPL twitter)

ముంబై: ఐపీఎల్‌ 2022లో ముంబై బోణీ కొట్టడం కలగానే మిగిలిపోయేలా ఉంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఈ సీజన్‌లో ఆడిన రెండో మ్యాచ్‌లోనూ ఓడింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సూపర్‌ సెంచరీకి తోడు.. లక్నో బౌలర్ల అద్భుతమైన బౌలింగ్‌తో ముంబైకి వరుసగా 8వ ఓటమి తప్పలేదు. 169 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. చివరికి 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 రన్స్‌ మాత్రమే చేయగలిగింది. లక్నో 36 రన్స్‌తో గెలిచింది. ఒత్తిడిలోనూ డెత్‌ ఓవర్లలో కళ్లు చెదిరే బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. కృనాల్‌ పాండ్యా వేసిన చివరి ఓవర్లో అయితే ఏకంగా 3 వికెట్లు పడటం విశేషం. మోసిన్‌ ఖాన్‌ (4 ఓవర్లలో 27 పరుగులు), దుష్మంత చమీరా (4 ఓవర్లలో 14 పరుగులు) లక్నో విజయంలో కీలకపాత్ర పోషించారు.

169 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు నిలకడైన ఆరంభం లభించింది. ఓవైపు ఇషాన్‌ కిషన్‌ పరుగులు చేయడానికి ఇబ్బంది పడినా.. మరోవైపు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చాలా రోజుల తర్వాత టాప్‌ ఫామ్‌లో కనిపించాడు. అడపాదడపా బౌండరీలు బాదుతూ.. స్కోరుబోర్డును ముందుకు కదిలించాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 7.1 ఓవర్లలో 49 రన్స్‌ జోడించారు. ఈ సమయంలో 20 బంతుల్లో 8 రన్స్‌ మాత్రమే చేసి ఇబ్బంది పడుతున్న ఇషాన్‌ కిషన్‌ అనూహ్యంగా ఔటయ్యాడు. బిష్ణోయ్‌ బౌలింగ్‌లో షాట్‌ కొట్టడానికి వెళ్లగా అది కాస్తా బ్యాట్‌ అంచుకు తగిలి వికెట్‌ కీపర్‌ బూటుకు తాకి స్లిప్‌లో ఉన్న హోల్డర్‌ చేతుల్లో పడింది.

ఆ వెంటనే డివాల్డ్‌ బ్రెవిస్‌ (3), రోహిత్‌ శర్మ (31 బంతుల్లో 39), సూర్యకుమార్‌ యాదవ్‌ (7) వరుసగా వికెట్లు పారేసుకున్నారు. దీంతో ముంబై 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో తిలక్‌ వర్మ, పొలార్డ్‌ ముంబై ఇన్నింగ్స్‌ను చక్కబెట్టారు. ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. తిలక్‌ వర్మ మంచి టచ్‌లో కనిపించాడు. 27 బంతుల్లో 38 రన్స్‌ చేసినా.. 18వ ఓవర్లో హోల్డర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

రాహుల్.. సూపర్ మ్యాన్

అంతకుముందు లక్నో టీమ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఒంటరి పోరాటం చేశాడు. ముంబై ఇండియన్స్‌పై మరో సెంచరీ బాది తన టీమ్‌కు ఫైటింగ్‌ స్కోరు సాధించి పెట్టాడు. ఈసారి 61 బాల్స్‌లోనే రాహుల్‌ మూడంకెల స్కోరు అందుకోవడం విశేషం. ఐపీఎల్‌లో అతనికిది నాలుగో సెంచరీ. తన సహచరులంతా విఫలమవుతున్నా.. ఒక్కడే ముంబై బౌలర్లను చితకబాదాడు. రాహుల్‌ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. చివరికి అతడు 62 బంతుల్లో 103 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. దీంతో లక్నో 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 రన్స్‌ చేసింది. 19వ ఓవర్‌ వేసిన బుమ్రా కేవలం 4 రన్సే ఇవ్వగా.. చివరి ఓవర్లోనూ రెండు సిక్స్‌లు బాదినా.. 13 పరుగులే వచ్చాయి.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. పవర్‌ ప్లేలో ఆ టీమ్‌ భారీగా స్కోరు చేయలేకపోయింది. ఓపెనర్‌ క్వింటన్‌ డీకాక్‌ (10) వికెట్‌ కూడా త్వరగానే కోల్పోయింది. తర్వాత వచ్చిన మనీష్‌ పాండే కూడా వేగంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే రాహుల్‌తో కలిసి మంచి పార్ట్‌నర్‌షిప్‌ అయితే నెలకొల్పాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 58 రన్స్‌ జోడించిన తర్వాత మనీష్‌ (22) ఔటయ్యాడు. ఆ తర్వాతే లక్నో వికెట్ల పతనం మొదలైంది. తర్వాత వచ్చిన స్టాయినిస్‌ (0), కృనాల్‌ పాండ్యా (1), దీపక్‌ హుడా (10) దారుణంగా విఫలమయ్యారు. దీంతో 121 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది లక్నో సూపర్‌ జెయింట్స్‌ టీమ్‌.

WhatsApp channel

టాపిక్