India vs Barbados: సెమీస్ చేరిన భారత మహిళా క్రికెట్ జట్టు - బార్బడోస్‌పై 100 పరుగుల తేడాతో విజయం
కామన్వెల్స్ గేమ్స్ లో భారత మహిళా క్రికెట్ టీమ్ మెడల్ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. బుధవారం బార్బడోస్ పై వంద పరుగులు తేడాతో విజయాన్ని అందుకొని సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నది.
కామన్వెల్త్ గేమ్స్ టీ20 క్రికెట్ లో భారత మహిళ జట్టు సెమీఫైనల్ కు చేరుకున్నది. బార్బడోస్ తో బుధవారం జరిగిన మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో విజయాన్ని అందుకొని మెడల్ సాధించేందుకు మరో అడుగు ముందుకు వేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. స్టార్ ప్లేయర్ స్మృతి మందన 5 పరుగులకే ఔట్ అయ్యి నిరాశపరిచింది.
షెఫాలీ వర్మ, రోడ్రిగ్స్ కలిసి టీమ్ ఇండియాను ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి రెండో వికెట్ కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షెఫాలీ వర్మ 26 బాల్స్ లో ఒక సిక్సర్ ఏడు ఫోర్లతో 43 రన్స్ చేసి ఔటయ్యింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ డకౌట్ కాగా తానియా భాటియా కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరడంతో టీమ్ ఇండియా కష్టాల్లో పడింది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో రోడ్రిగ్స్ తో కలిసి దీప్తి శర్మ ఇండియా కు గౌరవప్రదమైన స్కోరు అందించింది. రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీతో మెరిసింది. 46 బాల్స్ లో ఓ సిక్సర్, ఆరు ఫోర్లతో 56 రన్స్ చేయగా దీప్తిశర్మ 28 బంతుల్లో ఓ సిక్సర్, రెండు ఫోర్లతో 34 రన్స్ చేసి నాటౌట్ గా మిగిలారు. 163 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బార్బడోస్...టీమ్ ఇండియా బౌలర్ల విజృంభణతో ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టపోయి కేవలం 68 రన్స్ మాత్రమే చేసింది.
బార్బడోస్ బ్యాటర్లలో క్యాషోనా నైట్ 16 రన్స్, షకీరా 12 రన్స్ మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. భారత బౌలర్ రేణుక సింగ్ నాలుగు ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్ల తీసింది. మేఘన సింగ్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, హర్మన్ ప్రీత్ తలో ఒక్క వికెట్ తీసుకున్నారు. బార్బడోస్ పై వంద పరుగుల విజయంతో టీమ్ ఇండియా సెమీఫైనల్ రేసులో నిలిచింది.