IND vs AUS 1st Test: తొలి టెస్ట్‌లో టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం - ఇన్నింగ్స్ తేడాతో ఆస్ట్రేలియా చిత్తు-india defeat australia by innings and 132 runs in 1st test ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Aus 1st Test: తొలి టెస్ట్‌లో టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం - ఇన్నింగ్స్ తేడాతో ఆస్ట్రేలియా చిత్తు

IND vs AUS 1st Test: తొలి టెస్ట్‌లో టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం - ఇన్నింగ్స్ తేడాతో ఆస్ట్రేలియా చిత్తు

Nelki Naresh Kumar HT Telugu
Feb 11, 2023 02:35 PM IST

IND vs AUS 1st Test: బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ సిరీస్‌లో టీమ్ ఇండియా అదిరిపోయే బోణీ చేసింది. నాగ్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన‌ తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 132 ప‌రుగుల‌తో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో టీమ్ ఇండియా నిలిచింది.

ఇండియా వ‌ర్సెస్ ఆస్ట్రేలియా
ఇండియా వ‌ర్సెస్ ఆస్ట్రేలియా

IND vs AUS 1st Test: టీమ్ ఇండియా స్పిన్న‌ర్ల ధాటికి తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా కుదేలైంది. నాగ్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్ట్‌లో ఇన్నింగ్ 132 ప‌రుగుల తేడాతో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఘ‌న విజ‌యాన్ని సాధించింది. అశ్విన్ , జ‌డేజా బౌలింగ్ మెరుపుల‌కు రెండో ఇన్నింగ్స్‌లో 91 ప‌రుగుల‌కే ఆస్ట్రేలియా ఆలౌటైంది.

సెకండ్ ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు తీయ‌గా జ‌డేజా, ష‌మీ త‌లో రెండు వికెట్లు ద‌క్కించుకున్నారు. 223 ప‌రుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జ‌ట్టు కు ఆరంభంలోనే అశ్విన్ షాక్ ఇచ్చాడు. ఉస్మాన్ ఖ‌వాజాను ఔట్ చేసి వికెట్ల వేట‌ను ప్రారంభించాడు. వార్న‌ర్, ల‌బుషేన్ నిల‌దొక్కుకునేందుకు ప్ర‌య‌త్నించినా వారి పోరాటం ఎక్కువ సేపు సాగ‌లేదు. వార్న‌ర్‌ను అశ్విన్ ఔట్ చేయ‌గా, ల‌బుషేన్‌ను జ‌డేజా పెవిలియ‌న్‌కు పంపించాడు.

అశ్విన్ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న మిగిలిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. చివ‌రి ఆరు వికెట్ల‌ను ఆస్ట్రేలియా యాభై ప‌రుగుల‌కే కోల్పోయింది. 25 ప‌రుగుల‌తో స్టీవ్ స్మిత్ నాటౌట్‌గా నిలిచాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్‌లో అత‌డే టాప్ స్కోర‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. అంత‌కుముందు 321 ప‌రుగుల‌తో మూడో రోజును కొన‌సాగించిన టీమ్ ఇండియా 400 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

అక్ష‌ర్ ప‌టేల్‌, ష‌మీ క‌లిసి టీమ్ ఇండియా స్కోరును 400 వంద‌ల‌కు చేర్చారు. అక్ష‌ర్ 84 ప‌రుగులు చేయ‌గా ష‌మీ 37 ర‌న్స్ చేశాడు. తొలి టెస్ట్ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. మొత్తం నాలుగు మ్యాచ్‌లో టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

WhatsApp channel