Wimbledon 2022: జకోవిచ్ అరుదైన ఘనత.. తొలిరౌండులో సునాయస విజయం-defending champion novak djokovic survives kwon soon woo in first round of wimbledon 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wimbledon 2022: జకోవిచ్ అరుదైన ఘనత.. తొలిరౌండులో సునాయస విజయం

Wimbledon 2022: జకోవిచ్ అరుదైన ఘనత.. తొలిరౌండులో సునాయస విజయం

Maragani Govardhan HT Telugu
Jun 28, 2022 05:18 AM IST

వింబుల్డన్ 2022లో నొవాక్ జకోవిచ్ శుభారంభాన్ని అందుకున్నాడు. తొలి రౌండులో దక్షిణ కొరియాకు చెందిన క్వాన్ సూన్ వూపై విజయం సాధించి అదరగొట్టాడు. ఈ విజయంతో మరో అరుదైన రికార్డును కూడా సాధించాడు.

<p>&nbsp;జకోవిచ్</p>
జకోవిచ్ (AP)

ఫ్రెంచ్ ఓపెన్2022 ఫైనల్స్‌లో ఓటమి చవిచూసిన నొవాక్ జకోవిచ్.. వింబుల్డన్‌పై కన్నేశాడు. సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీలో తొలి రౌండులో అదరగొట్టాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సెర్బియా ఆటగాడు పురుషుల సింగిల్స్‌లో దక్షిణాకొరియాకు చెందిన క్వాన్ సూన్‌ వూపై విజయం సాధించాడు. ఈ విజయంతో జకో మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల్లో కలిపి అత్యధిక సింగిల్స్ విజయాలు సొంతం చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొత్తంగా 80 సింగిల్స్ విజయాలను అందుకున్నాడు 35 ఏళ్ల జకో.

సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో క్వాన్ సూన్‌ వూపై జకో.. 6-3, 3-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించి తర్వాతి రౌండుకు చేరాడు. తొలి సెట్‌ను సునాయసంగా సొంతం చేసుకున్న సెర్బియన్ ప్లేయర్.. రెండు సెట్‌లో మాత్రం ప్రత్యర్థి నుంచి చుక్కెదురైంది. రెండో సెట్ నాలుగో గేమ్‌లో డ్రాప్ షాట్‌తో సర్వీస్ బ్రేక్ చేసిన క్వాన్ సూన్ వూ ఆ సెట్‌లో విజయాన్ని అందుకున్నాడు. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ తన మొదటి మ్యాచ్ పాయింట్‌లో ఏస్ సంధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.

తర్వాతి రెండు సెట్‌లను ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా జకో ఆధిపత్యం చెలాయించాడు. ఫలితంగా మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఛాంపియన్‌షిప్‌కు ముందు ఎలాంటి గ్రాస్ కోర్టు వార్మప్ మ్యాచ్‌లు ఆడని జకో ఆకట్టుకున్నాడు. రెండో రౌండులో థానాసి కొక్కినాకిస్ లేదా కమిల్ మజ్‌చౌర్జాక్‌‌తో తలపడతాడు.

వింబుల్డన్‌లో వరుసగా నాలుగో టైటిల్‌పై కన్నేశాడు జకో. తొలి రోజు మ్యాచ్ ప్రారంభమైన 30 నిమిషాలకు వర్షం అంతరాయాన్ని కలిగించింది. సెంటర్ కోర్టు ఉపరితలం మూసివేయడంతో ఆ అడ్డంకి తొలిగింది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్