స్పోర్ట్స్‌పై మనసు పారేసుకుంటున్న కార్పొరేట్లు.. CSRతో ఒలింపిక్‌ ఛాంపియన్లు-corporate social responsibility playing an important role in making new olympic champions in the country ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  స్పోర్ట్స్‌పై మనసు పారేసుకుంటున్న కార్పొరేట్లు.. Csrతో ఒలింపిక్‌ ఛాంపియన్లు

స్పోర్ట్స్‌పై మనసు పారేసుకుంటున్న కార్పొరేట్లు.. CSRతో ఒలింపిక్‌ ఛాంపియన్లు

Hari Prasad S HT Telugu
Dec 22, 2021 10:38 AM IST

CSR.. సామాజిక బాధ్యతలో భాగంగా చాన్నాళ్లపాటు దేశంలో పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం వంటి సామాజిక సమస్యలపైనే దృష్టిసారించిన కార్పొరేట్లు ఇప్పుడిప్పుడే స్పోర్ట్స్‌ అభివృద్ధివైపు చూస్తున్నాయి. స్పోర్ట్స్‌ అంటే క్రికెట్‌ మాత్రమే అనుకునే మనలాంటి దేశంలో ఒలింపిక్‌ ఛాంపియన్లను తయారు చేయడానికి నడుం బిగించాయి.

ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ తో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా
ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ తో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (PTI)

CSR అంటే కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ. ఏ సమాజంపై ఆధారపడి కార్పొరేట్లు కోట్లు గడిస్తున్నాయో.. దానికి కచ్చితంగా ఎంతోకొంత తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2013 కంపెనీల చట్టంలో తప్పనిసరి చేసిన నిబంధనే ఈ CSR. తమ సామాజిక బాధ్యతలో భాగంగా చాన్నాళ్లపాటు దేశంలో పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం వంటి సామాజిక సమస్యలపైనే దృష్టిసారించిన కార్పొరేట్లు ఇప్పుడిప్పుడే స్పోర్ట్స్‌ అభివృద్ధివైపు చూస్తున్నాయి. స్పోర్ట్స్‌ అంటే క్రికెట్‌ మాత్రమే అనుకునే మనలాంటి దేశంలో ఒలింపిక్‌ ఛాంపియన్లను తయారు చేయడానికి నడుం బిగించాయి. 

మొన్న టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా రికార్డు స్థాయిలో 7 మెడల్స్ సాధించడం, అదే రికార్డు స్థాయిలో 120కిపైగా అథ్లెట్లు విశ్వక్రీడా వేదికలో పాల్గొనడం.. దేశ క్రీడారంగంలో మారుతున్న పరిస్థితులకు నిదర్శనం. ఖేలో ఇండియా వంటి స్కీమ్‌లతో ఓవైపు ప్రభుత్వం అథ్లెట్లను ప్రోత్సహిస్తుంటే.. మరోవైపు కార్పొరేట్లు తమ సామాజిక బాధ్యత నిధుల్లో నుంచి క్రమంగా స్పోర్ట్స్‌కు కేటాయింపులు పెంచుతున్నాయి.

TOPS.. టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌

ఒలింపిక్స్‌లో ఇండియా తొలి వ్యక్తిగత గోల్డ్ మెడల్‌ సాధించడానికి 108 ఏళ్లు పట్టింది. 2008లో బీజింగ్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌లో అభినవ్‌ బింద్రా ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. అదే ఒలింపిక్స్‌లో ఇండియాలో 3 మెడల్స్ సాధించింది. అప్పటికి అదే ఉత్తమ ప్రదర్శన. ఆ తర్వాత 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో ఈ సంఖ్య ఆరుకి చేరింది. ఈ మధ్యే టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు మెడల్స్‌తో ఆ రికార్డును కూడా మన అథ్లెట్లు మించిపోయారు. ప్రభుత్వం ప్రారంభించిన ఈ TOPS అంటే టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ లక్ష్యం ఇదే. విశ్వ క్రీడా వేదికపై సాధ్యమైనంత ఎక్కువ మంది ఇండియన్‌ అథ్లెట్లను పోడియంపైకి ఎక్కించే దిశగా ప్రభుత్వం, కార్పొరేట్లు ఇప్పుడు అడుగులు వేస్తున్నాయి.

ఇప్పటికీ తక్కువే అయినా..

టోక్యో ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో ఇండియాకు తొలి గోల్డ్‌ మెడల్‌ సాధించిపెట్టిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాపై ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ. 4.85 కోట్లు. ఈ డబ్బుతో అతడు విదేశాల్లో 450 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందుకున్నాడు. అదే ఈ ఒలింపిక్స్‌ పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన బ్రిటన్‌ ఒక్కో అథ్లెట్‌పై పెట్టిన ఖర్చు రూ. 40 కోట్లు. అలా చూస్తే అథ్లెట్లపై మన దేశంలో చేస్తున్న ఖర్చు చాలా తక్కువే అనిపించినా.. వస్తున్న ఫలితాలు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి. ప్రభుత్వాలు చేస్తున్న కృషికి ఎన్జీవోలు, కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా కార్పొరేట్లు చేస్తున్న సాయం క్రమంగా అథ్లెట్ల సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. 

రెండు దశాబ్దాలుగా ఆ దిశగా శ్రమిస్తున్న ఒలింపిక్‌ గోల్డ్‌ క్వెస్ట్‌ (ఓజీక్యూ), గోస్పోర్ట్స్‌ ఫౌండేషన్‌, జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌ వంటివి ఒలింపిక్స్‌లో పతకాలను తీసుకురాగలిగిన అథ్లెట్లను తయారుచేస్తున్నాయి. గోల్డ్‌ మెడల్‌ తెచ్చిన నీరజ్‌ చోప్రా, రెజ్లింగ్‌లో బ్రాంజ్‌ గెలిచిన భజరంగ్ పూనియాలాంటి వాళ్లను సపోర్ట్‌ చేసింది జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్సే. ఇక ఒలింపిక్స్‌లో ఫెన్సింగ్‌ క్రీడలో పాల్గొన్న తొలి ఇండియన్‌గా చరిత్ర సృష్టించిన భవానీ దేవిని రాటుదేల్చింది గోస్పోర్ట్స్‌. 

అటు వుమెన్‌ హాకీ ప్లేయర్స్‌ రాణి రాంపాల్‌, సవితా పూనియాలను దశాబ్దకాలంగా గోస్పోర్ట్స్‌ స్కాలర్‌షిప్స్‌ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు, సిల్వర్‌ మెడల్స్‌తో మెరిసిన వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను, రెజ్లర్‌ రవికుమార్‌లను ప్రోత్సహించింది ఓజీక్యూ. ప్రభుత్వం తీసుకొచ్చిన TOPSతోపాటు ఇలా కంపెనీలు CSRలో భాగంగా ఖర్చు చేస్తున్న నిధులతో అథ్లెట్లకు అత్యుత్తమ శిక్షణ వసతులు, ఫిజియోథెరపీ, స్పోర్ట్స్‌ మెడిసిన్‌, మానసిక శిక్షణ వంటివి లభిస్తున్నాయి.

స్పోర్ట్స్‌ అభివృద్ధిలో CSRది కీలకపాత్రే

గత నాలుగైదేళ్లుగా దేశంలో స్పోర్ట్స్‌ అభివృద్ధిలో CSR నిధులు కీలకపాత్ర పోషించినట్లు గోస్పోర్ట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దీప్తి బోపయ్యాలాంటి వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఆమె చెప్పింది అక్షరాలా నిజం. ఈ నిధుల వల్లే ఫెన్సింగ్‌ అంటే పెద్దగా తెలియని క్రీడలోనూ భవానీ దేవిలాంటి ఫెన్సర్‌ 6 నెలల పాటు విదేశాల్లో ప్రత్యేక శిక్షణ పొందగలిగింది. 

ఇప్పటికీ చైనా, అమెరికా, బ్రిటన్‌, జపాన్‌లాంటి దేశాలు ఒలింపిక్స్‌లో సాధించిన మెడల్స్‌తో పోలిస్తే ఇండియావి చాలా చాలా తక్కువే అయినా.. ఈ సంఖ్యను క్రమంగా పెంచే దిశగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని మాత్రం చెప్పొచ్చు. 2020 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్లు మొత్తం రూ. 24 వేల కోట్లను తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా ఖర్చు చేయగా.. అందులో స్పోర్ట్స్‌కు దక్కినవి రూ. 292 కోట్లు. మొత్తం నిధుల్లో ఇది చిన్న మొత్తమే కావచ్చు కానీ దేశంలో స్పోర్ట్స్‌ అభివృద్ధి వైపూ కార్పొరేట్లు చూస్తుండటం శుభపరిణామమే.

 

WhatsApp channel

సంబంధిత కథనం