Rohit Sharma: రోహిత్‌కు గాయంపై బీసీసీఐ అప్డేట్.. ఏమైందంటే?-bcci provide injury update on rohit sharma who has back spasm ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Sharma: రోహిత్‌కు గాయంపై బీసీసీఐ అప్డేట్.. ఏమైందంటే?

Rohit Sharma: రోహిత్‌కు గాయంపై బీసీసీఐ అప్డేట్.. ఏమైందంటే?

Maragani Govardhan HT Telugu
Aug 03, 2022 09:26 AM IST

రోహిత్ శర్మ గాయంపై అప్డేట్ ఇచ్చింది బీసీసీఐ. అతడికి నడుముకు వెనుక భాగంలో గాయమైనట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలిపింది. విండీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (AP)

వెస్టిండీస్‌తో మంగళవారం నాడు జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ మధ్యలోనే అస్వస్థతకు గురై రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 5 బంతుల్లో 11 పరుగులు చేసి జోరుమీదున్న హిట్ మ్యాన్ అకస్మాత్తుగా మైదానాన్ని వీడటం చూసిన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అతడికి ఏమైందా అంటూ నెట్టింట చర్చ మొదలు పెట్టేశారు. అయితే ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి అప్డేట్ ఇచ్చింది.

రోహిత్‌కు నడుముకు వెనుక భాగంలో గాయమైందని బీసీసీఐ స్పష్టతనిచ్చింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు నడుముకు వెనుక భాగంలో గాయమైంది. అతడి పరిస్థితిని ఎప్పటికప్పుడు బీసీసీఐ వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తోంది. అని బీసీసీఐ తన ట్విటర్ వేదికగా స్పష్టం చేసింది.

విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ వేసిన రెండో ఓవర్ మూడో బంతి రోహిత్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని ఫోర్ వెళ్లింది. అనంతరం షార్ట్ లెగ్త్ డెలివరీగా వచ్చిన నాలుగో బంతికి హిట్ మ్యాన్ పరుగులేమి చేయలేదు. ఆ తర్వాత ఒక్కసారిగా నడుముపై చేతులు పెట్టుకుని ఇబ్బంది పడ్డాడు. దీంతో ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స ఇచ్చినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం శ్రేయాస్ అయ్యర్ మైదానంలోకి అడుగుపెట్టాడు.

ఈ గాయం కారణంగా అతడు పూర్తి సిరీస్‌కు దూరమవుతాడా లేదా వచ్చే గేమ్‌కు అందుబాటులో ఉంటాడా అనేది అనుమానంగా మారింది. హిట్ మ్యాన్‌కు నడుము గాయమైందని, ప్రస్తుతం నిలకడగానే ఉన్నాడనే చెప్పిన తర్వాత గాని అభిమానులకు ఉపశమనం కలగలేదు. తర్వాతి మ్యాచ్‌కు కాస్త గ్యాప్ ఉండటంతో ఆ లోపు కోలుకుంటాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రోహిత్ శర్మ లేకున్నప్పటికీ టీమిండియా 165 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఓ ఓవర్ మిగిలుండానే ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్(76) అర్ధశతకంతో అదరగొట్టగా.. రిషభ్ పంత్(33) చివర్లో మెరుపులు మెరిపించాడు. విండీస్ బౌలర్లలో డోమనిక్ డ్రైక్స్, జేసన్ హోల్డర్, అకీల్ హోసెన్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్లు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులతో కాపాడుకోగలిగే స్కోరు చేసింది. ఓపెనర్ కైల్ మేయర్స్(73) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు.

 

WhatsApp channel

సంబంధిత కథనం