Kundaleshwara swami: కాశీకన్నా ముందుకు కుండలేశ్వరం ఎందుకు దర్శించాలి? కుండలేశ్వర స్వామి మహత్యం ఏమిటి?-why visit kundaleshwaram before kasi what is the significance of kundaleshwara swamy ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kundaleshwara Swami: కాశీకన్నా ముందుకు కుండలేశ్వరం ఎందుకు దర్శించాలి? కుండలేశ్వర స్వామి మహత్యం ఏమిటి?

Kundaleshwara swami: కాశీకన్నా ముందుకు కుండలేశ్వరం ఎందుకు దర్శించాలి? కుండలేశ్వర స్వామి మహత్యం ఏమిటి?

HT Telugu Desk HT Telugu
Apr 19, 2024 03:28 PM IST

Kundaleshwara swami: కాశీ వెళ్ళడం కంటే ముందుగా కుండలేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే చాలా మంచిది. ఈ స్వామి వారి మహత్యం ఏంటి అనే వివరాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా తెలియజేశారు.

కుండలేశ్వర స్వామి ఆలయం
కుండలేశ్వర స్వామి ఆలయం (youtube)

Kundaleshwara swami: కాశీ వెళ్ళడం కంటే ముందు వెళ్లాల్సిన క్షేత్రం ఒకటి ఉంది. దానిపేరు కుండలేశ్వరం. కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటే ఎంతటి పుణ్యం కలుగుతుందో అంతటి ప్రాశస్త్యం కలిగిన దేవాలయం ఇది.

తూర్పు గోదావరి జిల్లాలో గోదావరీ నదీ తీరాన ఈ క్షేత్రం ఉంది. అక్కడ గోదావరి నదిని వృద్ధ గౌతమి అని పిలుస్తారు. ఆ నదిలో స్నానం చేసి, కుండలేశ్వరస్వామికి అభిషేకం చేయించుకుని ఆ తరువాత కాశీ వెళ్ళాలని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

కుండలేశ్వరం ప్రాముఖ్యత

కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ గంగలో స్నానం చేస్తారు. అప్పుడు గంగానది మనం చేసిన పాపాలు తాను స్వీకరించి మనల్ని పుణ్యాత్ములను చేస్తుంది. ఇలా ప్రతిరోజూ ఉదయం అందరి వద్దా పాపాలు స్వీకరించి తెల్లని రాజహంసలాంటి గంగా నది సాయంత్రానికి నల్లని కాకిలాగ మారిపోతుంది. అ పాపభారం మోయడం గంగమ్మ తల్లికి చాలా కష్టం. కనుక ఎవరైనా పాపం చెయ్యని వారు వచ్చి స్నానం చేస్తే, వారు తనను కలుషితం చేయని కారణంగా గంగాదేవి చాలా సంతోషించి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుందట.

కాశీ అయినా, హరిద్వార్‌ అయినా ఎక్కడ గంగా స్నానం చేస్తామో అక్కడకు వెళ్ళే ముందు కుండలేశ్వరం వెళ్ళి గోదావరి స్నానం చేసి కుండలేశ్వర స్వామిని (ఈశ్వరుడిని) అర్చించుకుని ఆ తర్వాత ఆయా పుణ్య క్షేత్రాలకు వెళ్ళాలని చిలకమర్తి తెలిపారు.

కుండలేశ్వరుని కథ కవి సార్వభౌముడైన శ్రీనాథ మహాకవి తన భీమఖండంలో గోదావరిని వర్ణిస్తూ కుండలేశ్వరం గురించి రాశాడు. గౌతమీ మహత్యం అనే గ్రంథంలో ఈ క్షేత్ర మహిమను గురించి నూట మూడవ అధ్యాయంలో ఉంది.

కుండలేశ్వరం కథ

కాశీఖండలోనూ ఈ కుండలేశ్వరం గూర్చి ప్రస్తావన ఉంది. అందులో ఈ దేవాలయం గురించి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినట్లుగా ఉంది. కోటిపల్లిలో సోమేశ్వరుడుగాక దక్షిణ భాగం నుంచి గౌతమిని తీసుకొచ్చిన గోదావరి నది ప్రవహిస్తూ సముద్రం కేసి వెళుతోంది. ఆ నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. ఈ కుండలేశ్వరం చాలా వేగంగా వెళుతున్న గోదావరి సముద్ర ఘోషని విని కోపంతో మహావేగంతో పాతాళలోకంలో ప్రవేశించి ఈ సముద్ర దేవుడిని వేధించాలని అనుకుంది.

అయితే గోదావరి ఆలోచనలను నదులన్నింటికి నాథుడైన సముద్రుడు గ్రహించి పూజా ద్రవ్యాలను కుండలాలనను ఒక పళ్ళెంలో ఉంచి గౌతమికి ఎదురెళ్ళాడు. గౌతమీనది కోపం పోగొట్టడానికి సాష్టాంగ నమస్కారం చేసి, నామీద కోపం వద్దు సూర్యభగవానుని తేజస్సుతో మెరుస్తున్న ఈ కుండలాలను నీకు బహుమతిగా ఇస్తున్నాను. లోగడ వరుణదేవుడు తపస్సు చేసి సూర్యుని అనుగ్రహంతో వీటిని పొందాడని అన్నాడు.

గౌతమీనది కరిగిపోయి సముద్రుని కోరిక మేరకు తన వేగాన్ని తగ్గించుకుని, అక్కడ ఈశ్వర ప్రతిష్టకు అంగీకరించింది. అందుకే అది కుండలేశ్వర క్షేత్రంగా పేరు పొందింది. ఈ పుణ్యక్షేత్రంలో గోదావరి పుష్కర సమయంలో స్నానదానపూజల వలన అత్యంత పుణ్యం కలుగుతుందని అని చిలకమర్తి తెలిపారు.

ఈ క్షేత్రంలో ప్రవహించే గోదావరి నదికి వ్యాసమహర్షి ఒక వరం ఇచ్చాడు. పార్వతీదేవి ఆజ్ఞ మేరకు వ్యాస మహర్షి కాశీని వదిలిపెట్టి, విశ్వేశ్వరుని దర్శించుకోలేని దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం అనేక క్షేత్రాలు దర్శించుకుంటున్న తరుణంలో ఈ కుండలేశ్వరం వచ్చాడు. దక్షయజ్ఞం తరువాత యోగాగ్నిలో దగ్ధమైన సతీదేవి చెవి కుండలం పడిన ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసి కుండలేశ్వర స్వామిని దర్శించి ఆయన కాశీ విశ్వనాథుని దర్శించుకున్న అనుభూతిని పొందాడు. అప్పుడు ఆయన ఇక్కడ ప్రవహించే గోదావరి నదికి ఒక అపురూపమైన వరం ఇచ్చాడు.

భారతదేశంలో ప్రవహించే ప్రతి ఒక్క నదికీ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఆ పుష్కరాల సమయంలో నదీస్నానం చేసినవారు పాపవిముక్తులవుతారు. అయితే ఈ కుండలేశ్వర క్షేత్రంలో ప్రవహించే గోదావరి పాయ వృద్ధ గౌతమికి మాత్రం ప్రతిరోజూ పుష్కరాలే అని వ్యాస మహర్షి వరం ఇచ్చాడు. కనుక ఆరోజు ఈరోజు అని లేకుండా ఏ రోజైనా ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసిన వారికి పుష్కర స్నాన ఫలం వలన పాప విముక్తి లభిస్తుంది.

కుండలేశ్వరం ఎలా వెళ్ళాలి?

ఆ తరువాత వారు కాశీ హరిద్వార్‌ వంటి గంగాతీరంలో ఉన్న క్షేత్రాలు దర్శించుకుంటే గంగానది యొక్క అనుగ్రహం వలన కోరుకునే ఒక కోరిక గంగానది తీరుస్తుందని పురాణ కథనం అని చిలకమర్తి తెలిపారు. ఈ కుండలేశ్వర స్వామి అలయం మురమళ్ళకు దగ్గరలో కాట్రేనికోన మండలంలో ఉంటుంది.

కాకినాడ నుంచి యానాం మీదుగా టాక్సీలో వెళ్ళవచ్చు. బస్సులో కానీ రైలులో కానీ విమానంలో కానీ రాజమండ్రి చేరుకున్న తర్వాత, టాక్సీలో ఈ కుండలేశ్వరం వెళ్ళవచ్చు. లేదా రాజమండ్రి నుంచి బస్సులో అమలాపురం వెళ్ళి అక్కడనుంచి ఆటోలో ఈ కుండలేశ్వరం వెళ్ళవచ్చు. అమలాపురం నుండి కుండలేశ్వరం బస్సు కూడా ఉంటుంది. కుండలేశ్వరం చేరుకుని గోదావరి స్నానం చేసి కుండలం ఆకారంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేసుకోవచ్చు. రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయం కూడా శివాలయం ప్రాంగణంలో ఉంది.

పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel

టాపిక్