Ugadi 2023 Kanya Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కన్య రాశి ఫలాలు
Ugadi 2023 Kanya Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కన్య రాశి ఫలాలు ఇక్కడ చదవండి. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
Ugadi 2023 Kanya Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కన్య రాశి ఫలితాలు
కన్యరాశి వారి ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 4, అవమానం - 7
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కన్య రాశి వారికి ఫలితములు మధ్యస్తం నుంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కన్యరాశి వారికి చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఈ సంవత్సరం బృహస్పతి అష్టమ స్థానము నందు సంచరిస్తున్నాడు. శని 6వ స్థానమునందు సంచరిస్తున్నాడు. రాహువు అష్టమ (ఆయు) స్థానము నందు సంచరిస్తున్నాడు. కేతువు 2వ స్థానమునందు సంచరిస్తున్నాడు. అందుచేత కన్యరాశి వారికి ఈ సంవత్సరంలో మధ్యస్తము నుండి శుభ ఫలితములు ఉన్నవి.
కన్యరాశివారికి శని ఆరవ స్థానమునందు సంచరించుట వలన ప్రతీ పని యందు విజయము పొందెదరు. కీర్తిలాభము, ధనలాభము కలుగును. ఆర్ధిక వ్యవహారాలు, వ్యాపారాలు మరియు ధనమునకు సంబంధించిన విషయాల్లో చేయు ప్రయత్నాలు లాభించును. అష్టమ గురు, రాహు సంచారము వలన కుటుంబ వ్యవహారముల యందు మరియు ఆరోగ్య విషయముల యందు జాగ్రత్తలు వహించాలి. శారీరక శ్రమ అధికమగును. ద్వితీయ స్థానము నందు కేతువు ప్రభావంచేత దూకుడు నిర్ణయాలు తీసుకుందురు. అలాగే కేతువు ప్రభావం చేత గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మొత్తం మీద కన్యరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్తము నుండి అనుకూల ఫలితాలున్నవి.
కన్యా రాశి ఉద్యోగులకు ఉగాది రాశి ఫలాలు
శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కన్య రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఉద్యోగములో శ్రమ ఒత్తిడి ఉ న్నప్పటికి విజయం మీదే అవుతుంది. మీ దూకుడు ప్రవర్తన వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడును. అయినప్పటికి శని అనుకూల ప్రభావంచేత విజయాన్ని పొందెదరు.
కన్యరాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభదాయకముగా ఉండును. వ్యాపారస్తులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కన్యరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్త ఫలితాలున్నవి. కన్యరాశి స్త్రీలకు అనారోగ్య సూచనలు మరియు కుటుంబము నందు సమస్యలు అధికముగా ఉన్నవి. ఆరోగ్య విషయమునందు అశ్రద్ధ వహించకూడదు.
కన్యరాశి రైతులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. కన్యరాశి సినీరంగం వారికి మధ్యస్త ఫలితాలు ఏర్పడతాయి. మొత్తం మీద కన్యరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు. రాజకీయ ఆరోగ్య మరియు కుటుంబ వ్యవహారాలలో మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. కన్యరాశి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలముగా ఉన్నది.
కన్య రాశి వారు శుభ ఫలితాల కోసం
కన్య రాశివారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలనుకుంటే గురువారం రోజు దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించాలి. శనివారం రోజు దుర్గాదేవిని మరియు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.
కన్యా రాశి నెలవారీ రాశి ఫలాలు 2023-24
ఏప్రిల్ :- ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సూచన. శత్రుభయం. జీవిత భాగస్వామితో వాదనలకు దిగుతారు.
మే:- ఈ మాసం మధ్యస్తమునుండి అనుకూలంగా ఉంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. ధనాదాయం వస్తుంది. అప్పులను తగ్గించుకోవాలి. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో గొడవలు.
జూన్:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. ఆర్ధికంగా అనుకూలించును. స్నేహితులు మీకు సహకరిస్తారు. ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు.
జూలై : - ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. సోదరులు మరియు స్నేహితులు అండగా ఉంటారు. రాజకీయంగా పలుకుబడి వస్తుంది. ఆదాయ వృద్ధి.
ఆగస్టు: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధనలాభం. అనవసర ఖర్చులు. ఆర్ధిక విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
సెప్టెంబర్: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. వ్యాపారాలలో హెచ్చుతగ్గులు. మాతృవర్గంలో విభేదాలు. సొంత వ్యాపారాలకు దూరంగా ఉండాలి.
అక్టోబర్ : ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. ఆర్ధికముగా లాభదాయకము. విందులు వినోదాలలో పాల్గొంటారు. విదేశ యాత్రలో ధనమును అధికముగా ఖర్చు చేస్తారు.
నవంబర్:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. దూరప్రయాణాలు. సంపదవృద్ధి. ఆనందము. వివాహ అవకాశాలు. వ్యాపారంలో లాభాలు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
డిసెంబర్:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఆదాయ వృద్ధి.
జనవరి : – ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. నూతన వస్తు వస్త్రాల ప్రాప్తి. కుటుంబ సభ్యులతో వినోదాలలో పాల్గొంటారు. ఆభరణాల కొనుగోలు కోసం ధనమును అధికముగా ఖర్చు చేస్తారు.
ఫిబ్రవరి :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. స్నేహితుల నుండి లాభదాయకం. వ్యాపార వృద్ధి శత్రు జయం. శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. అధికార యోగం వస్తుంది.
మార్చి : ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు లాభదాయకము. సంపద వృద్ధి. ఉద్యోగస్తులు పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు.
- పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ