Vande Bharat Trains: వందే భారత్ రైళ్లలో కొత్త విధానం.. ప్రయాణికులకు రైల్వే మంత్రి విజ్ఞప్తి
Vande Bharat Trains: వందేభారత్ రైళ్లలో క్లీనింగ్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చింది రైల్వే శాఖ. విమానాల్లో ఉండే విధానాన్ని పాటించనుంది.
Vande Bharat Trains: వందేభారత్ రైళ్లను భారతీయ రైల్వే శాఖ (Indian Railways) ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తోంది. అధిక వేగంతో పాటు ప్రయాణికులకు అత్యున్నత సదుపాయాలు కల్పించేలా ఈ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలను కలుపుతూ 8 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. మరికొన్నింటిని త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. అయితే, వందే భారత్ రైళ్లలో చెత్త కుప్పలు తెప్పలుగా అవుతోందని ఇటీవల కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) స్పందించారు. వందే భారత్ రైళ్లలో విమానం తరహా శుభ్రత వ్యవస్థను అమలు చేయనున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలివే..
కొత్త విధానం ఇదే..
Vande Bharat Trains: వందేభారత్ రైళ్లలో కొత్త క్లీనింగ్ విధానాన్ని మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. రైలు సిబ్బంది ఒకరు ప్రయాణికుల వద్దకు వచ్చి బ్యాగులో చెత్తను సేకరిస్తారు. ఇలా ప్రతీ ప్యాసింజర్ దగ్గరికి వచ్చి వ్యర్థ పదార్థాలను తీసుకుంటారు. విమానంలోనూ ఇదే విధానం ఉంటుంది. దీన్ని ఇప్పుడు వందే భారత్ రైళ్లలోనూ అమలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.
“వందేభారత్ రైళ్ల కోసం క్లీనింగ్ సిస్టమ్‍లో మార్పులు చేశాం” అని మంత్రి అశ్వినీ వైష్ణవ్ పోస్ట్ చేశారు. ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
వందేభారత్ రైళ్లలో చెత్త!
వందేభారత్ రైళ్లలో అధిక మొత్తంలో చెత్త పోగవుతుందంటూ ఇటీవల చాలా కథనాలు వచ్చాయి. ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి.
Vande Bharat Trains: ఇటీవల ప్రారంభించిన సికింద్రాబాద్ - విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‍లో ప్లేట్లు, కప్‍లు, బాటిళ్లు, పాలిథిన్ కవర్లతో పాటు ఇతర చెత్త భారీగా ఉందంటూ ఫొటోలు వైరల్ అయ్యాయి. సిబ్బంది సాధారణంగా శుభ్రం చేసినా గమ్యస్థానమైన విశాఖపట్నం చేరేలోగా రైలులో ఇంత చెత్త పోగైందని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతిష్ఠాత్మకంగా నడుపుతున్న వందేభారత్ రైళ్లలో శుభ్రత పాటించాలని, చెత్త వేసేందుకు డస్ట్ బిన్‍లను వినియోగించాలని ప్రయాణికులను అధికారులు కోరుతున్నారు.
సంబంధిత కథనం