Rahul Gandhi ‘Bharat Jodo Nyay Yatra’: ‘న్యాయం అనే హక్కు లభించే వరకు..’: ఇదే రాహుల్ గాంధీ భారత న్యాయ యాత్ర ట్యాగ్ లైన్
Rahul Gandhi ‘Bharat Jodo Nyay Yatra’: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ త్వరలో ప్రారంభించనున్న ‘‘భారత్ జోడో న్యాయ యాత్ర’’ లోగో, ట్యాగ్ లైన్ లను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆవిష్కరించారు.
Rahul Gandhi ‘Bharat Jodo Nyay Yatra’: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ‘‘భారత్ జోడో న్యాయ యాత్ర’’ ను మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో జనవరి 14వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో కొనసాగి ముంబైలో ముగుస్తుంది.
న్యాయం కోసం..
ఈ సందర్భంగా ‘‘భారత్ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’’ లోగోను, ట్యాగ్ లైన్ ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే శనివారం ఆవిష్కరించారు. ఈ యాత్ర ట్యాగ్ లైన్ ను '‘న్యాయం అనే హక్కు లభించేవరకు (న్యాయ్ కా హక్ మిల్నే తక్)’' గా నిర్ణయించారు. ఈ యాత్రలో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై దృష్టి సారించనున్నట్లు మల్లికార్జున ఖర్గే తెలిపారు.
రాహుల్ ట్వీట్..
తన ‘‘భారత్ జోడో న్యాయ యాత్ర’’ దేశ ప్రజలందరికీ న్యాయం అనే హక్కు లభించేవరకు కొనసాగుతుందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. న్యాయ హక్కు లక్ష్యంగా అన్యాయం, అహంకారాలకు వ్యతిరేకంగా ఈ యాత్ర జరుపుతున్నామన్నారు. న్యాయ హక్కు అనే నినాదంతో మరొకసారి తన ప్రజల్లోకి వస్తున్నానని ఆయన ప్రకటించారు. ‘‘నేను సాగుతున్న ఈ సత్య మార్గంలో నేను ప్రమాణం చేస్తున్నాను. న్యాయం అనే హక్కు లభించేవరకు ఈ ప్రయాణం కొనసాగుతుంది’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. దాంతో పాటు, గతంలో భారత్ జోడో యాత్ర నాటి ఒక వీడియోను కూడా రాహుల్ గాంధీ షేర్ చేసుకున్నారు.
6 వేల కిలోమీటర్లు..
భారత్ జోడో న్యాయ్ యాత్ర జనవరి 14న ప్రారంభమవుతోంది. రాహుల్ గాంధీ నాయకత్వంలోని ఈ యాత్ర మణిపూర్ లోని ఇంఫాల్ నుంచి ప్రారంభమై దేశంలోని 15 రాష్ట్రాల గుండా ప్రయాణించి ముంబైలో ముగుస్తుంది. ఈ యాత్ర 110 జిల్లాలు, 100 లోక్ సభ స్థానాలు, 337 అసెంబ్లీ స్థానాలను కవర్ చేస్తుంది. ఈ యాత్ర 67 రోజుల్లో 6,700 కిలోమీటర్ల దూరం సాగుతుంది.
చత్తీస్ గఢ్ లో
ఈ యాత్ర ఫిబ్రవరి 16-17 తర్వాత ఛత్తీస్ గఢ్ చేరుకుంటుంది. జనాభాలో 32 శాతం గిరిజనులు ఉన్న ఈ రాష్ట్రంలోని ఏడు జిల్లాలను ఐదు రోజుల్లో కవర్ చేస్తుంది. ప్రజా హక్కుల కోసం పోరాడేందుకు 'సత్యాగ్రహం'ను బలమైన ఆయుధంగా కాంగ్రెస్ భావిస్తోందని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో అతిపెద్ద, పరివర్తనాత్మక సత్యాగ్రహంగా భారత్ జోడో న్యాయ్ పాదయాత్ర నిలుస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ధనుంజయ ఠాకూర్ అన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' మాదిరిగానే భారత్ జోడో న్యాయ్ యాత్ర రాజకీయాల్లో పరివర్తనకు దారి తీస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు.
పార్టీ ఓటమి తరువాత..
ఛత్తీస్ గఢ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం చవిచూసిన నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ యాత్ర ద్వారా పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని పెంపొందించాలని కాంగ్రెస్ భావిస్తోందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 90 స్థానాలున్న ఛత్తీస్ గఢ్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ 54 స్థానాలు గెలుచుకుని తిరిగి అధికారంలోకి రాగా, కాంగ్రెస్ 35 స్థానాల్లో విజయం సాధించింది. గోండ్వానా గణతంత్ర పార్టీ ఒకటి గెలుచుకోగలిగింది.