NEET, JEE merger with CUET: సీయూఈటీలో నీట్, జేఈఈ విలీనంపై యూజీసీ స్పష్టత
NEET, JEE merger with CUET: జేఈఈ, నీట్‌లను వచ్చే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)తో విలీనం చేసే ఆలోచనపై యూజీసీ స్పష్టత ఇచ్చింది.
NEET, JEE merger with CUET: వైద్య విద్యలో ప్రవేశ పరీక్ష నీట్, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈని సీయూఈటీ-యూజీతో విలీనం చేయడంపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని యూజీసీ చైర్మన్ ఎం.జగదీష్ కుమార్ గురువారం స్పష్టం చేశారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లను భవిష్యత్తులో సీయూఈటీతో విలీనం చేస్తామని గత నెలలో ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే.
నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, రాబోయే రెండేళ్లపాటు కామన్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ)తో జేఈఈ, నీట్‌లను విలీనం చేసే ఆలోచన లేదని చెప్పారు. నీట్, జేఈఈని సీయూఈటీతో విలీనం చేయాలనే ఆలోచనపై విస్తృత చర్చలు జరుగుతున్నాయని, దీనిపై మేం ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని యూజీసీ ఛైర్మన్ స్పష్టం చేశారు.
‘భారత ఉన్నత విద్యలో పోటీతత్వం, నాణ్యతా విప్లవాన్ని పెంపొందించడం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ, అది 11, 12 తరగతిలో ఉన్న ప్రస్తుత విద్యార్థులపై ప్రభావం చూపకూడదు. మేం వారికి తగినంత సమయం ఇవ్వాలి. కనీసం వచ్చే రెండేళ్లలో ఇది అమలు చేయకూడదు. తగినంత సంప్రదింపులు జరిగిన తర్వాత, అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత దీనిపై నిర్ణయం ఉంటుంది..’ అని చెప్పారు.
సీయూఈటీ యూజీ తొలి విడత జూలైలో ప్రారంభమైంది. మొత్తం ఆరు దశల్లో సాగింది. అన్ని సెంట్రల్ వర్శిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు ఉమ్మడి గేట్‌వే అయిన సీయూఈటీ-యూజీ ఇప్పుడు 14.9 లక్షల దరఖాస్తులతో దేశంలో రెండో అతిపెద్ద ప్రవేశ పరీక్షగా ఉంది. ఇది జేఈఈ-మెయిన్ సగటు నమోదు తొమ్మిది లక్షలను అధిగమించిందని నివేదిక పేర్కొంది. నీట్ - యూజీకి భారతదేశంలో 18 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే జేఈఈ-మెయిన్స్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష. సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు. నీట్ పెన్, పేపర్ మోడ్‌లో నిర్వహిస్తారు.