Telugu News  /  National International  /  Trash Me All Day But It Will Cost 8 Dollars Elon Musk Responded On Twitter Blue Tick Fee Criticism
ఎలాన్ మస్క్
ఎలాన్ మస్క్ (AP)

Elon Musk Twitter : రోజంతా తిట్టినా.. మార్చేది లేదు : ఎలాన్ మస్క్

05 November 2022, 22:16 ISTHT Telugu Desk
05 November 2022, 22:16 IST

Elon Musk Twitter : ట్విట్టర్ లో బ్లూటిక్ వెరిఫైడ్ అకౌంట్ కోసం యూజర్ల నుంచి చార్జీలు వసూలు చేయాలని ఎలాన్ మస్క్ నిర్ణయించారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చాలా విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆయన స్పందించారు.

Elon Musk Twitter : పాపులర్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‍ఫామ్ ట్విట్టర్ లో మార్పులు వేగంగా జరిగిపోతున్నాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్..గత వారం ట్విట్టర్ ను సొంతం చేసుకున్నప్పటి నుంచి రోజురోజుకూ పరిస్థితులు మారిపోతున్నాయి. సీఈవో పరాగ్ అగర్వాల్ ఉద్వాసన నుంచి కంపెనీలో 50శాతం మంది ఉద్యోగులను తొలగించడం వరకు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు మస్క్. వెరిఫైడ్ అకౌంట్లకు ఉండే బ్లూటిక్‍ కోసం యూజర్ల నుంచి చార్జీలను వసూలు చేయాలన్న నిర్ణయం అందులో కీలకమైనదిగా ఉంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో ట్విట్టర్ ఓనర్ మస్క్ స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు

Elon Musk Twitter : బ్లూటిక్ బ్యాడ్జ్

Twitterలో వెరిఫైడ్ అకౌంట్లకు ఉండే బ్లూటిక్ బ్యాడ్జ్ కోసం యూజర్లు నెలకు 8డాలర్ల చార్జీ చెల్లించాలని ఎలాన్ మస్క్ నిబంధన తీసుకొచ్చారు. అంటే ఇక బ్లూ బ్యాడ్జ్ ఉన్న వారు నెలకు 8డాలర్ల రుసుము చెల్లించాలి. దీనిపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మస్క్ ఓ ట్వీట్ చేశారు. “రోజంతా నన్ను తిట్టండి. కానీ దానికి మాత్రం కచ్చితంగా 8డాలర్లు ఖర్చవుతుంది” అని ట్వీట్ పోస్ట్ చేశారు. అంటే ఎందరు, ఎంత విమర్శించినా తన నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని కుండ బద్దలు కొట్టేశారు ఎలాన్ మస్క్.

Elon Musk Twitter layoffs : అందుకే ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది

ట్విట్టర్ ఉద్యోగుల్లో మొత్తం 50శాతం మందిని ఎలాన్ మస్క్ విధుల నుంచి తొలగించారు. ఏకంగా ఒకేసారి సగం మందిని ఉద్యోగాల తీసేశారు. ఈ విషయంపై కూడా ట్విట్టర్ లో స్పందించారు టెస్లా బాస్ మస్క్. “ఉద్యోగుల తొలగింపు విషయానికి వస్తే, దురదృష్టవశాత్తు మరో ఛాయిస్ లేదు. ఎందుకంటే కంపెనీ రోజుకు 4 మిలియన్ డాలర్లను నష్టపోతోంది. ప్రతీ ఒక్కరు 3 నెలల సెవెరెన్స్ (నష్టపరిహారం)తో నిష్క్రమిస్తున్నారు” అని మస్క్ పోస్ట్ చేశారు.

Elon Musk Twitter : 44 బిలియన్ డాలర్ల డీల్‍

ఆరు నెలల పాటు ఎన్నో మలుపుల తర్వాత ఎట్టకేలకు ట్విట్టర్ ను కొనుగోలు డీల్‍ను ఎలాన్ మస్క్ పూర్తి చేశారు. 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.6లక్షల కోట్లు) కు ఈ సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్‍ను సొంతం చేసుకున్నారు. ఫేక్ అకౌంట్ల గురించి కంపెనీ తప్పుడు సమాచారం ఇచ్చిందని డీల్‍ను క్యాన్సల్ చేసుకునేందుకు మస్క్ ప్రయత్నించగా.. కోర్టుకు వెళ్లి మరీ డీల్ పూర్తయ్యేలా చేసింది ట్విట్టర్. కంపెనీ మస్క్ చేతికి వెళ్లిన తొలిరోజే సీఈవో పరాగ్ అగర్వాల్ తో పాటు మరో ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్వాసనకు గురయ్యారు. ఇప్పుడు 50శాతం మంది ఉద్యోగులను మస్క్ తొలగించారు. మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్తులోనూ గణనీయమైన మార్పులు ఉంటాయనేలా ఎలాన్ మస్క్ సంకేతాలు ఇస్తున్నారు.