Supreme Court: ఆరు నెలలు పై బడిన గర్భ విచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు-supreme court orders aiims to defer termination of 26 week foetus ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Supreme Court: ఆరు నెలలు పై బడిన గర్భ విచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme Court: ఆరు నెలలు పై బడిన గర్భ విచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

HT Telugu Desk HT Telugu
Oct 11, 2023 11:36 AM IST

Supreme Court: వైద్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో 26 వారాల గర్భాన్ని విచ్ఛిత్తి (abortion) చేయడాన్ని వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఢిల్లీ ఎయిమ్స్ ను ఆదేశించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT)

Supreme Court: 26 వారాల గర్భ విచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక రోజు క్రితం ఒక వివాహిత ఆరు నెలల పై బడిన గర్భాన్ని అబార్షన్ చేయడానికి సుప్రీంకోర్టులోని ఒక ధర్మాసనం ఆమోదం తెలిపింది. అయితే, మర్నాడే, ఆ ఆదేశాలను నిలిపివేస్తూ, మరో ధర్మాసనం తీర్పునిచ్చింది. మాత, శిశు ప్రాణాలపై వైద్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆ అబార్షన్ ను ప్రస్తుతానికి నిలిపివేయాలని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది.

శిశువు ప్రాణాలు..

తన 26 వారాల గర్భాన్ని అబార్షన్ చేసుకోవడానికి అనుమతించాలని ఒక వివాహిత కోర్టును ఆశ్రయించింది. మొదట ఈ కేసును విచారించిన జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ నాగరత్న ధర్మాసనం అబార్షన్ కు అనుమతిని ఇచ్చింది. కాగా, ఈ ఆదేశాలపై వైద్యుల అనుమానాలను అదనపు సొలిసిటర్ జనరల్ మరోసారి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. శిశువు ప్రాణాలతో, పూర్తి ఆరోగ్యంగా జన్మించే అవకాశాలున్నాయని, అబార్షన్ చేస్తే అది శిశు హత్యతో సమానమవుతుందని చెప్పిన వైద్యుల అభిప్రాయాన్ని కోర్టుకు విన్నవించారు. దాంతో, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్న త్రిసభ్య ధర్మాసనం ఆ పిటిషన్ ను విచారించింది. అనంతరం, ప్రస్తుతానికి అబార్షన్ ప్రక్రియను నిలిపివేయాలని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది. వైద్యులు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని గందరగోళంలో ఉన్నందున ప్రస్తుతానికి అబార్షన్ ను వాయిదా వేయాలని సూచించింది. సంబంధిత పిటిషన్తో తమ ముందుకు వస్తే, గతంలో అబార్షన్ కు ఆమోదం తెలిపిన ధర్మాసనానికి మరోసారి ఈ పిటిషన్ ను నివేదిస్తామని స్పష్టం చేసింది.

మహిళ హక్కు..

శిశువుకు జన్మనివ్వాలా? వద్దా? అన్నది మహిళ హక్కు అని, బిడ్డ పోషణ తనకు సాధ్యం కాదని ఆ మహిళ భావించినప్పుడు అబార్షన్ కు వెళ్లే హక్కు ఆమెకు ఉంటుందని అబార్షన్ ను అనుమతిస్తూ జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ నాగరత్న ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక మహిళ శరీరంపై ఆ మహిళకే సర్వ హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే, శిశువు సంపూర్ణంగా ఆరోగ్యంతో జన్మిస్తుందని, అబార్షన్ చేస్తే అది శిశు హత్యతో సమానమవుతుందన్న మెడికల్ బోర్డ్ సూచనలను ధర్మాసనం పట్టించుకోలేదు.

Whats_app_banner