Supreme Court: చట్టబద్ధం కాని వివాహాల ద్వారా జన్మించిన పిల్లలకు కూడా తల్లిదండ్రుల ఆస్తిలో హక్కుంటుంది: సుప్రీంకోర్టు
Supreme Court: సుప్రీంకోర్టు శుక్రవారం మరో సంచలన, విప్లవాత్మక తీర్పునిచ్చింది. చట్టబద్ధం కాని వివాహాల (void or voidable marriages) ద్వారా జన్మించిన పిల్లలకు కూడా తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఉంటుందని స్పష్టం చేసింది.
Supreme Court: సుప్రీంకోర్టు శుక్రవారం మరో సంచలన, విప్లవాత్మక తీర్పునిచ్చింది. చట్టబద్ధం కాని వివాహాల (void or voidable marriages) ద్వారా జన్మించిన పిల్లలకు కూడా తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఉంటుందని స్పష్టం చేసింది. ఆ పిల్లలను అక్రమ సంతానంగా పరిగణించకూడదని తేల్చి చెప్పింది. ఈ తీర్పు హిందు మితాక్షర చట్టం (Hindu Mitakshara Law) పరిధిలోని హిందూ ఉమ్మడి కుటుంబాలకు సంబంధించిన ఆస్తులకు మాత్రమే వర్తిస్తుందని వివరించింది.
వంశపారంపర్య ఆస్తిలో కూడా..
ఈ విప్లవాత్మక తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం వెలువరించింది. హిందూ వివాహ చట్టం ప్రకారం చట్టబద్ధం కాని వివాహాలు చేసుకున్న తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలకు కూడా తల్లిదండ్రుల ఆస్తిలో సముచిత వాటా ఉంటుందని ధర్మాసనం నిర్దిష్టంగా తీర్పునిచ్చింది. ఆ ఆస్తి ఆ తల్లిదండ్రులు స్వయంగా సంపాదించినదైనా కావచ్చు, లేదా, వంశపారంపర్యంగా వచ్చినదైనా కావచ్చని స్పష్టంగా చెప్పింది.
2011 నాటి తీర్పు..
గతంలో, 2011లో, రేవన సిద్దప్ప వర్సెస్ మల్లిఖార్జున్ కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సమర్ధించింది. తల్లిదండ్రులు స్వయంగా సంపాదించిన, లేదా వారికి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిలో వారికి చట్టబద్ధంగా జన్మించని పిల్లలకు కూడా వాటా ఉంటుందని నాడు ద్విసభ్య ధర్మాసనం కూడా తీర్పునిచ్చింది. నాడు జస్టిస్ జీఎస్ సింఘ్వీ, జస్టిస్ ఏకే గంగూలీల ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘తల్లిదండ్రుల మధ్య ఉన్న సంబంధానికి అతీతంగా, స్వతంత్రంగా పిల్లల పుట్టుకను పరిశీలించాల్సి ఉంటుంది. తాము ఎలాంటి సంబంధాల ద్వారా జన్మిస్తున్నామన్న విషయం ఆ పిల్లలకు తెలియదు. అందువల్ల చట్టబద్ధం కాని, అక్రమ వివాహాల ద్వారా జన్మించిన పిల్లలకు కూడా, చట్టబద్ధంగా జరిగిన వివాహాల ద్వారా జన్మించిన పిల్లలకు లభించిన తీరులోనే తల్లిదండ్రుల ఆస్తిలో వాటా లభించాలి’’ అని ఆ తీర్పులో పేర్కొంది.