Professor Saibaba : బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేసిన సుప్రీం.. జైలులోనే సాయిబాబా
Professor Saibaba supreme court : ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫలితంగా ఆయనతో పాటు మరికొందరు నిందితులు జైలులోనే ఉండనున్నారు.
Professor Saibaba supreme court verdict : మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఈ వ్యవహారంలో బాంబే హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పును.. సర్వోన్నత న్యాయస్థానం శనివారం కొట్టివేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ మేరకు సాయిబాబాకు నోటీసులు కూడా జారీ చేసింది సుప్రీంకోర్టు. ఫలితంగా సాయిబాబా జైలులోనే ఉండనున్నారు.
ఇదీ కేసు..
మవోయిస్టులతో సంబంధాలున్నాయన్న కారణంతో సాయిబాబాతో పాటు మరికొందరిని 2014లో అరెస్ట్ చేశారు పోలీసులు. సాయిబాబాను దోషిగా తేల్చుతూ 2017లో తీర్పును వెలువరించింది మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు. అప్పటి నుంచి 52ఏళ్ల సాయిబాబా.. నాగ్పూర్ సెంట్రల్ జైలులోనే ఉంటున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన వీల్ఛైర్పైనే ఉండిపోయారు.
Professor Saibaba : కాగా.. సాయిబాబాతో పాటు ఇతరులను నిర్దోషులుగా పేర్కొంటూ శుక్రవారం సంచలన తీర్పును ప్రకటించింది బాంబే హైకోర్టు. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఫలితంగా ఎన్నో ఏళ్ల జైలు శిక్ష తర్వాత.. సాయిబాబా బయటకొస్తారని అందరు భావించారు. కానీ బాంబే హైకోర్టు తీర్పును.. కొన్ని గంటల్లోనే సుప్రీంకోర్టులో సవాలు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేసింది.
ఈ విషయంపై శనివారం విచారణ జరిపింది సుప్రీంకోర్టు. సాయిబాబాపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది.
అనారోగ్య సమస్యల కారణంగా.. తనని జైలు నుంచి ఇంటికి తీసుకెళ్లి, అక్కడ హౌజ్ అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు సాయిబాబా. ఆ విజ్ఞప్తిని సైతం సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సాయిబాబా చేసిన నేరాల తీవ్రత ఎక్కువగా ఉందని, అందుకే ఆయన విజ్ఞప్తికి అంగీకరించలేమని స్పష్టం చేసింది.
సంబంధిత కథనం