పుతిన్‌తో 'ఫైట్'కు మస్క్ సై.. సవాలు అదుర్స్!
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అపర కుబేరుడు ఎలాన్ మస్క్.. క్రేజీ సవాలు విసిరారు. తనతో పుతిన్ ఒక్కరే ఫైట్‌కు రావాలని పిలుపునిచ్చారు. అందులో గెలిచిన వారు ఉక్రెయిన్‌పై నిర్ణయం తీసుకోవచ్చని ట్వీట్ చేశారు.
Musk Putin tweet | టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్.. ఎంతటి ధైర్యవంతుడనే విషయం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకుని అపర కుబేరుల్లో ఒకరిగా నిలిచారు. తాజాగా మరోమారు తన ధైర్యసాహసాలను ప్రపంచానికి చూపించారు మస్క్. తనతో ప్రత్యక్ష పోరుకు రావాలని పుతిన్‌కు సవాలు విసిరారు. ఆ కాంబాట్‌లో ఓడిపోతే.. ఉక్రెయిన్ను విడిచిపెట్టాలని తేల్చిచెప్పారు.
ఉక్రెయిన్‌పై రష్యా గత కొన్ని రోజులుగా దండయాత్ర చేస్తోంది. పుతిన్ ఆదేశాలతో రష్యా సైనికులు ఉక్రెయిన్‌లోకి చొచ్చుకెళుతున్నారు. ఫలితంగా ఉక్రెయిన్‌లో మానవతా సంక్షోభం ఏర్పడింది. లక్షలాది మంది దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. చాలా మంది రష్యా దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో పుతిన్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది పుతిన్‌ను ఓ విలన్‌లాగా చూస్తున్నారు.
రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో అంతర్జాల సేవలు సైతం నిలిచిపోయాయి. అయితే అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపుతో.. స్పందించిన ఎలాన్ మస్క్.. తన స్టార్‌లింక్ ఉపగ్రహాల ద్వారా యుద్ధవిచ్ఛిన్న దేశానికి ఇంటర్నెట్ సేవలు అందించారు. ఉక్రెయిన్‌కు సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఊహించని రీతిలో పుతిన్‌కు సవాలు విసిరారు మస్క్. 'నాతో ప్రత్యక్ష పోరాటానికి పుతిన్‌కు సవాలు విసురుతున్నా. గెలిచిన వారు ఉక్రెయిన్ భవితవ్యాన్ని నిర్దేశించగలరు,' అని ట్వీట్ చేశారు మస్క్.
వాస్తవానికి పుతిన్‌కు అధికార ట్విట్టర్ ఖాతా లేదు. అందువల్ల రష్యా ప్రభుత్వం అధికార ట్విట్టర్ ఖాతా @KremlinRusia_E ని మస్క్ ట్యాగ్ చేశారు. పుతిన్, ఉక్రెయిన్ పేర్లను రష్యన్ భాషలో ట్వీట్ చేశారు. 'నా సవాలను స్వీకరిస్తారా?' అని ధైర్యంగా ప్రశ్నించారు.
మస్క్ సవాలుపై రష్యా అధికారులు ఇంకా స్పందించలేదు. పుతిన్ అంగీకరించడం అసాధ్యమే అయినా.. మస్క్ ధైర్యంగా ముందుకొచ్చి సవాలు విసరడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్