5 states elections: 5 రాష్ట్రాల ఎన్నికలపై ఆ సర్వేలో ఏం తేలింది? తెలంగాణ ఓటర్లు ఎటు వైపు ఉన్నారు?
5 states elections: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతోంది. నవంబర్ 7 నుంచి నవంబర్ 30 మధ్య తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది.
5 states elections: తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే, ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు మరింత క్రియాశీలం అయ్యాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, విపక్ష కాంగ్రెస్ కు మధ్య జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఏబీపీ - సీ ఓటర్ సంస్థ ఈ ఐదు రాష్ట్రాల్లో ఓటర్ల నాడి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఒక సర్వే నిర్వహించింది.
Madhya Pradesh: మధ్య ప్రదేశ్..
ఏబీపీ - సీ ఓటర్ సర్వే ప్రకారం.. మధ్య ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోటా పోటీగా పోరు కొనసాగనుంది. ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. రాష్ట్రంలో బీజేపీకి 44.7%, కాంగ్రెస్ కు 44.6% ఓట్ షేర్ ఉంది. అంటే కాంగ్రెస్ కన్నా 0.1% మాత్రమే బీజేపీ ఎక్కువ ఉంది. మొత్తం మీద ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 113 నుంచి 125 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 104 నుంచి 116 స్థానాలు గెలుచుకుంటుంది. మధ్య ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 230.
Rajasthan: రాజస్తాన్
ఏబీపీ - సీ ఓటర్ సర్వే ప్రకారం.. రాజస్తాన్ లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. రాజస్తాన్ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 200. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ 127 నుంచి 137 స్థానాలు గెలుచుకుంటుంది. కాంగ్రెస్ 59 నుంచి 69 సీట్లను గెల్చుకుంటుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ షేరు 42% గా ఉండనుంది. మొత్తంగా రాజస్తాన్ లో స్పష్టమైన మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తుంది.
Chhattisgarh: చత్తీస్ గఢ్
చత్తీస్ గఢ్ లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 7 వ తేదీన మొదటి దశ, నవంబర్ 17న రెండో దశ ఎన్నికలు జరుగుతాయి. ఏబీపీ - సీ ఓటర్ సర్వే ప్రకారం.. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. అయితే, కొంత ఎడ్జ్ కాంగ్రెస్ కు ఉంది. చత్తీస్ గఢ్ లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 45నుంచి 51 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుంది. 39 నుంచి 45 సీట్లను బీజేపీ గెలుచుకుంటుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 45% ఓట్లు, బీజేపీకి 43% ఓట్లు లభిస్తాయి.
Mizoram: మిజోరం
ఈశాన్య రాష్ట్రాల్లోని ఒక చిన్న రాష్ట్రం మిజోరం. ఇక్కడ మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏబీపీ - సీ ఓటర్ సర్వే ప్రకారం.. ఇక్కడ ఈ ఎన్నికల ఫలితాల అనంతరం హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశముంది. పూర్తి మెజారిటీ ఏ పార్టీకి కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. మొత్తం 40 సీట్లలో 10 నుంచి 14 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. 13 నుంచి 17 సీట్లను ఎంఎన్ఎఫ్ గెల్చుకుంటుంది. 9 నుంచి 13 సీట్లను జెడ్ పీ ఎం గెల్చుకుంటుంది. మొత్తంగా మెజారిటీ మార్క్ అయిన 21 ని ఏ పార్టీ కూడా చేరుకోలేదు.
Telangana: తెలంగాణ
తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో కొనసాగుతోంది. కల్వకుంట్ల చంద్ర శేఖర రావు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఏబీపీ - సీ ఓటర్ సర్వే ప్రకారం.. తెలంగాణలో ఈ ఎన్నికలు పోటాపోటీగా జరిగే అవకాశముంది. అయితే, ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ గణనీయ స్థానాలను గెలుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. అగ్ర నేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి పెట్టి, పలు ప్రచార సభల్లో పాల్గొన్నప్పటికీ.. రాష్ట్రంలో బీజేపీ 5 నుంచి 11 సీట్లను మించి గెల్చుకోలేదు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొని ఉంది. ఈ ఎన్నికల్లో కొంతవరకు కాంగ్రెస్ కు సానుకూలత కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 48 నుంచి 60 సీట్లు గెల్చుకుంటుంది. బీఆర్ఎస్ 43 నుంచి 55 స్థానాలు గెల్చుకుంటుంది. మొత్తంగా కాంగ్రెస్ కు 39% ఓట్లు, బీఆర్ఎస్ కు 37% ఓట్లు, బీజేపీకి 16% ఓట్లు పడే అవకాశముంది. 119 స్థానాల తెలంగాణ అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 60.