Disha Report | ఇన్వెస్టిగేషన్ టైంలో ప్రెస్‌మీట్స్ వద్దు!
`దిశ` హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సమగ్ర నివేదిక అందించిన సిర్పుర్కర్ కమిషన్.. పోలీసింగ్‌కు సంబంధించి కొన్ని సాధారణ సూచనలు కూడా చేసింది.
నేరారోపణలు, ఎఫ్ఐఆర్ నమోదు, ఇన్వెస్టిగేషన్, ప్రెస్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం.. తదితర అంశాల్లో పాటించాల్సిన నియమనిబంధనలను ఇదే నివేదిక చివరలో సిర్పుర్కర్ కమిషన్ పొందుపర్చింది.
ఆ వివరాలు..
1) జ్యూరిస్‌డిక్షన్‌తో సంబంధం లేకుండా నేర ఘటనలపై, ముఖ్యంగా పిల్లలు, మహిళలపై జరిగిన నేరాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆ తరువాత సంబంధిత పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేయాలి. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ మ్యాన్యువల్ ఆర్డర్ 409(3) లోనే ఉంది. `దిశ` కేసు విషయంలో దీన్ని పాటించలేదు.
2) పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఇన్వెస్టిగేషన్‌కు, అలాగే, శాంతి భద్రతల పరిరక్షణకు వేర్వేరు విభాగాలు ఉండాలి. దీనివల్ల ఇన్వెస్టిగేషన్ వేగంగా జరుగుతుంది.
3) వ్యక్తులను అరెస్ట్ చేసే విషయంలో చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటించాలి.
4) ఇన్వెస్టిగేషన్ ప్రక్రియను పూర్తిగా వీడియో తీయాలి. అరెస్ట్ చేయడం, అరెస్ట్ నోటీసు ఇవ్వడం, క్రైమ్ సీన్‌ను పరిశీలించడం, ఫొరెన్సిక్ పరీక్షలు, నేరానికి సంబంధించిన వస్తువుల రికవరీ.. ఇవన్నీ వీడియో రికార్డ్ చేయాలి.
5) పోలీసులు శరీరంపై ధరించే కెమెరాలను ఉపయోగించాలి. దానివల్ల రియల్ టైమ్ రికార్డింగ్‌కు వీలవుతుంది. పోలీస్ వాహనాల డాష్ బోర్డులపై కూడా కెమెరాలను ఏర్పాటు చేయాలి. తద్వారా వాహనం వెళ్తున్నప్పుడు, క్రైమ్ సీన్‌లో ఏం జరుగుతుందో తెలుస్తుంది.
6) నేర ఘటన స్థలంలోని, ఇతర సంబంధిత ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజ్‌లను కచ్చితంగా సేకరించి, భద్రపరచాలి.
7) సాక్షులను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ కచ్చితంగా చేయాలి.
8) నేరం జరిగిన ప్రదేశాన్ని జాగ్రత్తగా పరిరక్షించాలి. ఘటనాస్థలిలోని సాక్ష్యాలు ధ్వంసం కాకుండా చూడాలి. శిక్షణ పొందిన వ్యక్తే మొదట క్రైమ్ సీన్ కు వెళ్లాలి. ఘటనా స్థలిని పూర్తిగా ఫొరెన్సిక్ టీమ్, లేదా క్లూస్ టీమ్‌కు అప్పగించాలి.
9) ఫొరన్సిక్ ఎవిడెన్స్‌లను జాగ్రత్తగా పరిరక్షించాలి. ఇన్వెస్టిగేషన్ సమయంలో ఈ ఎవిడెన్స్‌లు ధ్వంసం కావడం చాలా కేసుల్లో జరుగుతుంది. అలా జరగకుండా చూసుకోవాలి. ఫొరెన్సిక్ ప్రక్రియను అంతా పకడ్బందీగా రికార్డ్ చేయాలి.
10) జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ బాధ్యతలను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌లు నిర్వహించడాన్ని నిలిపేయాలి. తప్పనిసరైతే, సంబంధిత ప్రక్రియపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తికే ఆ బాధ్యతలు ఇవ్వాలి.
11) పోలీసు కస్టడీకి నిందితులను అప్పగించే సమయంలో, మెజిస్ట్రేట్‌లు కచ్చితంగా, తదుపరి విచారణ సమయంలో నిందితుడిని తమ ముందు హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించాలి.
12) పోలీస్ కస్టడీలో ఉండగా నిందితుడెవరైనా చనిపోతే, వెంటనే సంబంధిత జ్యూరిస్‌డిక్షన్‌కు చెందిన జ్యూడీషియల్ మెజిస్ట్రేట్‌కు సమాచారం ఇవ్వాలి. సమాచార అందిన వెంటనే, ఆ మెజిస్ట్రేట్ ఘటనాస్థలానికి వెళ్లాలి.
13) నేరం జరిగిన తరువాత, దర్యాప్తు పూర్తై, కోర్టుకు ఫైనల్ రిపోర్డ్ అందించేంత వరకు ఏ పోలీస్ అధికారి కూడా ఆ నేరానికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించకూడదు. అయితే, నేర విచారణకు సంబంధించిన వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్ ప్రెస్ నోట్ రూపంలో పంపించవచ్చు. అయితే, విచారణలో సేకరించిన సమాచారాన్ని వెల్లడించకూడదు.
టాపిక్