Kolkata rape case : ‘క్రైమ్ సీన్‌ని మార్చేశారు’- వైద్యురాలి కేసు దర్యాప్తుపై సుప్రీంకు సీబీఐ రిపోర్టు!
కోల్‌కతా వైద్యురాలి రేప్, హత్య కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును సీబీఐ తాజాగా సుప్రీంకోర్టుకు సమర్పంచింది. క్రైమ్ సీన్‌ని మార్చేశారని రిపోర్టులో ఆరోపించింది.
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురువారం తన స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది. క్రైమ్ సీన్‌ని మార్చారని, తొలుత ఇది ఆత్మహత్య అని తల్లిదండ్రులకు పశ్చిమ్ బెంగాల్ పోలీసులు చెప్పారని, ఆ తర్వాత హత్య అని వెల్లడించినట్టు సీబీఐ తన స్టేటస్ రిపోర్టులో పేర్కొంది.
కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు సంబంధించిన సుమోటో కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేసుపై విచారణ చేపట్టింది.
నిందితుల గాయానికి సంబంధించిన మెడికల్ రిపోర్టు గురించి సీజేఐ చంద్రచూడ్ ప్రశ్నించగా, ఇది కేసు డైరీలో భాగమని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు తెలిపారు.
ఈ కేసు దర్యాప్తులోకి సీబీఐ 5వ రోజు ప్రవేశించిందని, కానీ అప్పటికే అంతా మార్చేశారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.
తుషార్ మెహతా వాదనను కపిల్ సిబల్ తిప్పికొట్టారు. ప్రతి విషయాన్ని వీడియోగ్రాఫ్ చేసినట్టు వివరించారు. కానీ మృతదేహాన్ని దహనం చేసిన తర్వాత ఉదయం 11:45 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, సీనియర్ వైద్యులు, సహోద్యోగులు పట్టుబట్టడంతోనే వీడియోగ్రఫీ చేశారని, అంటే వారు కూడా ఏదో అనుమానించారని మెహతా అన్నారు.
వైద్యులు, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణుల భద్రత కోసం ప్రోటోకాల్‌ని రూపొందించడానికి 10 మంది సభ్యులతో కూడిన జాతీయ టాస్క్ఫోర్స్ (ఎన్టిఎఫ్)ను సుప్రీంకోర్టు మంగళవారం ఏర్పాటు చేసింది.
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
ఈ ఘటనను 'భయంకరమైనది'గా అభివర్ణించిన అత్యున్నత న్యాయస్థానం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం, వేలాది మంది దుండగులు ప్రభుత్వ సౌకర్యాన్ని ధ్వంసం చేయడానికి అనుమతించడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది.
ప్రభుత్వాసుపత్రిలోని సెమినార్ హాల్లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
దర్యాప్తును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ ఆగస్టు 13న కలకత్తా హైకోర్టు ఆదేశించింది. సీబీఐ ఆగస్టు 14 న దర్యాప్తును ప్రారంభించింది.
సంబంధిత కథనం